Share News

మన స్వదేశీయంలో విదేశీయానిదే విజయమా?

ABN , Publish Date - May 22 , 2026 | 01:14 AM

సప్తపదులు, సప్తనదులు, సప్తస్వరాలు, సప్తరుషులు.. ఇట్లా ఏడు అంకె చుట్టూ అనేక జీవిత, ఖగోళ, భౌగోళిక అంశాలను ముడిపెట్టటం మనకు కొత్తకాదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మొదలుపెట్టిన యుద్ధంతో...

మన స్వదేశీయంలో విదేశీయానిదే విజయమా?

సప్తపదులు, సప్తనదులు, సప్తస్వరాలు, సప్తరుషులు.. ఇట్లా ఏడు అంకె చుట్టూ అనేక జీవిత, ఖగోళ, భౌగోళిక అంశాలను ముడిపెట్టటం మనకు కొత్తకాదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మొదలుపెట్టిన యుద్ధంతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోటానికి ప్రజలు త్యాగాలూ, పొదుపులూ చేయాలంటూ ప్రధాని మోదీ కూడా సప్తసూత్రాలను ప్రకటించారు. దేన్నైనా సప్తసూత్రాలుగా చెబితే ప్రజలను బాగా ఆకర్షిస్తుందనే మోదీ భావించి ఉండొచ్చు. సప్తానికి మన సంస్కృతి చాలా ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో సందేహం ఏమీలేదు. ఇక సంస్కృతిలో బాగా పాతుకుపోయిన భావాలను ఉపయోగించుకుని రాజకీయంగా ప్రజలను సమాయత్తం చేయటం అన్ని దేశాల్లోనూ ఉంది. ఇటీవల కాలంలో ఈ విషయంలో మోదీ ప్రదర్శించే ప్రతిభ అసాధారణమైంది! ఇందులో ఆయన దరిదాపులకు వచ్చే నేతలను ప్రపంచం మొత్తంలోనే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఆచారాలు, నమ్మకాలు, ఇష్టాయిష్టాల్లో ఎంతో వైవిధ్యం ఉన్న దేశంలో మంచికైనా చెడుకైనా సంస్కృతిని ఆధారం చేసుకుని జనాన్ని రాజకీయ లక్ష్యాలవైపు ఆకర్షించటం అంత సులువుకాదు. రాజకీయ లక్ష్యాలు సంకుచితమైనవైతే సంస్కృతి కూడా చివరికి అదే దారిలోకి వెళుతుంది. దీనికి ఏ దేశమూ మినహాయింపుకాదు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు 40 రోజులపాటు భీకరంగా దాడులు చేశాయి. వీటిని అసాధారణలో రీతిలో తట్టుకుంటూ ఇరాన్‌ ప్రతిదాడులనూ చేసింది. గల్ఫ్‌దేశాల్లోని అమెరికా సైనికస్థావరాలు ఆ ప్రతిదాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికాకు ఇంతకు మించిన తలవంపు ఇటీవల కాలంలో మరొకటి లేదు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా హోర్ముజ్‌ జలసంధిని అమెరికా దిగ్బంధం చేయటంతో చమురు, సహజవాయువు, ఎరువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రపంచ సరఫరా వ్యవస్థే గాడితప్పింది. అయినా అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకూ యుద్ధప్రభావం గురించి విపులంగా ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడలేదు. అంతకు ముందుకూడా అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటించనూ లేదు. యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతోందనీ దాన్ని దృష్టిలో పెట్టుకునైనా యుద్ధం ఆపాలనీ కోరలేదు. కొండెక్కిన చమురు ధరలతోనూ ఇతరత్రానూ దిగుబడుల భారం పెరిగి విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా హరించుకుపోయే ప్రమాదం ముంచుకొస్తూ ఉండటంతో త్యాగాలు చేయాలనీ, పొదుపులు పాటించాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.


సప్తసూత్రాల్లో స్వదేశీ వస్తువులను కొనాలనే పిలుపు కూడా ప్రధానంగా ఉంది. గ్లోబలైజేషన్‌ తర్వాత ఈ స్వదేశీ నినాదం ఎంతమేరకు ఆచరణాత్మకమో పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏదీ విదేశీ, ఏదీ స్వదేశీ అన్న గీతలు గీయటం కూడా కష్టమైపోతోంది. మేడిన్‌ ఇండియా వస్తువుల లోగుట్టుని లోతుగా చూస్తే అందులోని విదేశీయత రట్టు అవుతుంది. నూటికినూరుపాళ్లూ స్వదేశీ కంపెనీ ఉత్పత్తులనే కొనాలనుకుంటే మన ఎంపిక చాలా పరిమితం అయిపోతుంది. విదేశీ మారకద్రవ్యం పొదుపు లక్ష్యంగా ఇక్కడ తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయించటమే మోదీ పిలుపు పరమార్థమైతే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. 90శాతం మంది ప్రజలకు ఇక్కడే దొరికే వస్తువులే బోలెడు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అచ్చంగా ఏవి స్వదేశీ అన్నవే సమస్య! మనం రోజూ వాడే వస్తువులనూ, ఉపకరణాలనూ స్వదేశీ కంపెనీలే తయారుచేయటం లేదు. అవి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నా వాటిని స్వదేశీయతకూ, స్వావలంబనకూ ఉదాహరణలుగా చెప్పుకోలేం. అవన్నీ ప్రధానంగా విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. సర్ఫ్‌ ఎక్సెల్‌, లక్స్‌, లైఫ్‌బాయ్‌, క్లినిక్‌ ప్లస్‌, డవ్‌, క్లోజప్‌, బ్రూక్‌బాండ్‌ రెడ్‌లేబుల్‌, బ్రూ, హార్లిక్స్‌, బూస్ట్‌, లేస్‌, ట్రోపికానా, జిలెట్‌, హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌, కాల్గేట్‌, పెప్సొడెంట్‌, మ్యాగీ, నెస్‌కేఫ్‌, కిట్‌క్యాట్‌, సెరెలాక్‌, కెల్లాగ్‌ కోర్న్‌ఫ్లేక్స్‌, కోకకోలా, థమ్స్‌అప్‌, పెప్సీ, కుర్కురే, వ్యాసలీన్‌, లాక్మే, పాండ్స్‌, రిన్‌, పియర్స్‌ లాంటి ఉత్పత్తులన్నీ విదేశీ బహుళజాతి సంస్థలకు అనుబంధంగా ఉన్న కంపెనీల నుంచే వస్తున్నాయి. మనం వినియోగించే వస్తువులన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈ జాబితా ఇంకా పెరుగుతుంది. ఈ కంపెనీల్లో భారతీయుల పెట్టుబడులు లేవా? అంటే ఉన్నాయి. అవన్నీ చాలా వరకూ 45శాతం లోపే ఉంటాయి. కానీ విదేశాల్లోని మూల కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులే అధికంగా ఉంటాయి. కీలక నిర్ణయాలన్నిటినీ అవే శాసిస్తాయి. ఐటీసీ, అమూల్‌, డాబర్‌, మ్యారికో, బ్రిటానికా, గోద్రేజ్‌, పార్లే లాంటి భారత కంపెనీల ఉత్పత్తులు కూడా మార్కెట్‌లో రాణిస్తున్నాయి. కానీ వీటి ఉత్పత్తుల వాటా మార్కెట్‌లో 42–48శాతం మధ్యలోనే ఉంటుంది. వీటితో పోల్చితే బహుళజాతి సంస్థల అనుబంధ కంపెనీల ఉత్పత్తుల వాటా ఎక్కువ. అది 52–58శాతం ఉంటుంది. నెలనెలా వాడుకునే ఈ ఉత్పత్తుల్లో భారత యాజమాన్యంలోని కంపెనీల వాటా 45శాతం ఉండటం ఊరటగా అనిపించొచ్చు. కంప్యూటర్లు, వాహనాలు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్స్‌ దగ్గరకు వెళితే స్వదేశీ కంపెనీలు ఎక్కడో ఉంటున్నాయి. ముందుగా మొబైల్‌ ఫోన్ల సంగతి చూద్దాం. భారతీయుల యాజమాన్యంలో ఉన్న మొబైల్‌ కంపెనీలు లావా, మైక్రోమాక్స్‌, కార్బన్‌ తయారుచేసే మొబైళ్ల మార్కెట్‌ వాటా 2–3శాతం మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. మిగతావన్నీ విదేశీ కంపెనీల మొబైళ్లే. యాపిల్‌ ఫోన్లను ఇక్కడ తయారుచేసే కంపెనీల్లో కూడా ఫాక్స్‌కాన్‌దే (తైవాన్‌) ఆధిపత్యం. మన టాటా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ కూడా 35 శాతం వరకూ యాపిల్‌ ఫోన్లను తయారుచేస్తోంది. విస్ట్రన్‌, పెగట్రాన్‌ లాంటి తైవాన్‌ కంపెనీలో షేర్లు కొనుగోలుచేసి యాజమాన్యాన్ని పొందటంతో టాటా ఎలక్ట్రానిక్స్‌ ఆ పనిని సులభంగా చేయగలుగుతోంది.


ఇక రిఫ్రిజిరేటర్ల పరిస్థితి చూసినా మనకు ఈ దృశ్యమే కనపడుతుంది. పది ప్రధాన బ్రాండ్లను తీసుకుంటే అందులో గోద్రేజ్‌, వీడియోకోన్‌లు మాత్రమే స్వదేశీ యాజమాన్యం కింద ఉన్నాయి. మిగతావన్నీ విదేశీ యాజమాన్యాలకు చెందినవే. వాటి మార్కెట్‌ వాటా 80–90శాతం మధ్యలో ఉంటుంది. కార్ల వ్యవహారాన్ని చూసినా పరిస్థితిలో మార్పు కొద్దిగానే కనపడుతోంది. భారతీయ కంపెనీల కార్ల మార్కెట్‌ వాటా ఇప్పటికీ 15–25 శాతం మధ్యలోనే ఉంది. 12 ప్రధాన కార్ల కంపెనీల్లో టాటామోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా మాత్రమే భారత యాజమాన్యానికి చెందినవి. విదేశీ కార్ల కంపెనీల మార్కెట్‌ వాటా 75–85శాతం మధ్యలో ఉంటుంది. కంప్యూటర్ల తయారీలో స్వదేశీ కంపెనీల వాటా 3–10శాతం మధ్యలో ఉంటే విదేశీ కంపెనీలు 90–97శాతం వాటాతో మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఒకప్పుడు హెచ్‌సీఎల్‌, జెనిత్‌, విప్రో కంప్యూటర్లు భారతీయ బ్రాండ్లుగా మార్కెట్‌లో బాగానే ఉండేవి. కాలక్రమంలో విదేశీ కంపెనీల ధాటికి తట్టుకోలేకపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హెచ్‌పీ, డెల్‌, లెనోవో, యాపిల్‌, ఏసర్‌, ఏసస్‌ కంప్యూటర్లే మనకు కనపడతాయి.

ఒకకోణం నుంచి చూస్తే ఔషధాల తయారీలో భారతీయ కంపెనీల ఆధిపత్యం కనపడుతుంది. 65–75శాతం మార్కెట్‌ వాటాతో అగ్రభాగాన ఉన్నాయి. బహుళజాతి కంపెనీలు మిగతా వాటాను పంచుకుంటున్నాయి. జనరిక్‌ డ్రగ్స్‌ను, వాక్సిన్లను పెద్దఎత్తున తయారుచేయగలగటంలో భారతీయ కంపెనీలు అసాధారణ సామర్థ్యాన్ని సంపాదించాయి. ఇది దేశ అవసరాలను పెద్దఎత్తున తీర్చటంతో పాటు విదేశాలకూ చౌకగా వాటిని ఎగుమతి చేయటానికి బాగా తోడ్పడింది. అయితే మౌలిక పరిశోధనలతో, కొత్త ఫార్ములాల ఆవిష్కరణలతో, సంపూర్ణ పేటెంట్‌ హక్కులతో తయారుచేసే మందుల్లో భారతీయ కంపెనీలు బాగా వెనుకబడే ఉన్నాయి. కొలెస్ట్రాల్‌, డయాబిటీస్‌, రక్తపోటుకు డాక్టర్లు రాసే మందులనూ, వివిధ ఇన్ఫెక్షన్లను తగ్గించటానికి వాడే యాంటీబయాటిక్స్‌నూ పరిశీలిస్తే మనకు పరిస్థితి అర్థమవుతుంది. వీటిల్లో దాదాపుగా అన్నీ వేరే దేశాల్లో అభివృద్ధి అయినవే ఉన్నాయి. అత్యవసరంగా మనం వాడే 100 మందులను తీసుకుంటే అందులో 1–5 వరకూ మాత్రమే మనం సొంత పరిశోధనతో ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం.


ఈ పరిణామాల కోణంలో మన ఆర్థిక వ్యవస్థను స్వదేశీ, విదేశీ అని గిరిగీసి చూసుకుంటే పరిస్థితి అంతా ఆశాజనకంగానే కనిపించదు. చాలా కీలకరంగాల్లో మన అడుగులు.. చేరాల్సిన గమ్యంతో పోల్చితే తక్కువే పడ్డాయి. సంక్షోభాలు మీద పడ్డప్పుడు మాత్రమే మన పాలకులకు అవి గుర్తుకొస్తాయి. 1990లో విదేశీ మారకద్రవ్యం చెల్లింపుల్లో సంక్షోభం ఏర్పడినప్పుడు దాన్నుంచి గట్టెక్కటానికి ఆర్థికసంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే కోవిడ్‌ విజృంభించినప్పుడు మాస్క్‌లూ, ఇతర వైద్య ఉపకరణాలూ దొరకని పరిస్థితుల్లో మేకిన్‌ ఇండియా విధానానికి పదునుపెట్టారు. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధమూ అండగా ఉంటుందనుకున్న అమెరికా తెచ్చిపెట్టిన అనేక చిక్కులతో స్వదేశీ వస్తు వినియోగానికి పిలుపునివ్వటం అవసరమైంది. విదేశీ కంపెనీలు తమ సొంత పరిశోధనలతో, తమ సొంత డిజైన్లతో, తమ సొంత సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌లో ఉత్పత్తులు తయారుచేయటం వల్ల మనకు స్వావలంబన రాదు. ఎంతగా గ్లోబలైజేషన్‌ విస్తృతమైనా కీలక రంగాల్లో స్వావలంబన లేకపోతే ఆర్థిక వ్యవస్థ పటిష్ఠపునాదులపై ఉన్నట్లుగా భావించలేం. మేకిన్‌ ఇండియా ఉత్పత్తులన్నీ నిజమైన భారతీయ బ్రాండ్లుగా ప్రపంచం గుర్తించాలంటే మన సొంత సాంకేతిక పరిజ్ఞానంతో, మన డిజైన్లతో, మన పరిశోధనల పునాదులపై అవి తయారుకావాలి. అందుకు ఎంతో హేతుబద్ధమైన దృష్టీ, వైజ్ఞానిక దృక్పథమూ ఉండాలి. మతం, కులాల పేరుతో ప్రజలను ఊర్రూతలూగించటం తేలిక. సొంత సంస్కృతిలోనే గొప్పవైనవన్నీ ఉన్నాయనే భ్రమలో బతకటమూ తేలికే. మనవైన మౌలిక ఆవిష్కరణలూ, వినూత్న వస్తునిర్మాణ కౌశల్యాలే కష్టమైనవి. ఒకనాటి భారతీయ చేనేత పరిశ్రమ దాన్ని సాధించింది. అందుకే నాటి దేశాలన్నీ భారత చేనేత ఉత్పత్తుల కోసం చేతులుచాపాయి. రాజకీయంగా స్వదేశీయత గురించి మాట్లాడడం సులభం. వైజ్ఞానికంగా, సాంకేతికంగా దాన్ని సాధించటం మాత్రం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. దాన్ని సాధించనంత కాలం మన స్వదేశీయంలో విదేశీయానిదే విజయమవుతుంది! అన్నిరంగాల్లో లోతైన విషయ విజ్ఞానాన్నీ, సాంకేతిక చాతుర్యాన్నీ సమకూర్చుకోబట్టే చైనా తన గొంతును బలంగా విన్పించగలుగుతోంది. ఇటీవల చైనాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ దాన్ని మనసుపెట్టి వినకా తప్పలేదు. క్షీణిస్తున్న శక్తిగా అమెరికా మారుతోందని చైనా అధినేత అంటే గట్టిగా ఖండించలేకపోయారు. అది చాలదన్నట్లుగా తైవాన్‌ స్వతంత్రతపై అమెరికా హామీ ఇవ్వలేదంటూ చేతులెత్తేశారు. అమెరికాతో మనకంటే ఎక్కువగా ఆర్థిక బంధాలను పెనవేసుకుని చైనా ఈ స్థాయికి వచ్చింది. స్వల్పకాలంలో అనూహ్య సామర్థ్యాన్నీ చాకచక్యాన్నీ సంపాదించుకుని ఆ దేశానికి అన్నిరంగాల్లో సవాళ్లను విసురుతోంది. ఆ స్థితికి చేరుకోటానికి అడుగులు వేయటమే మనముందన్న అసలు సవాల్‌! ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దాన్ని సాధించటంలోనే అసలైన ఆత్మనిర్భరత లభిస్తుంది.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 01:14 AM