‘లివ్ ఇన్’పై సమగ్ర చట్టం అవసరం
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:04 AM
నేటి ‘జెన్ జీ’ యువతరం ‘లివ్ ఇన్ రిలేషన్’లో ఉండడానికి ఇష్టపడుతున్నది. పెళ్లి వలన ఏర్పడే బాధ్యతలు, బంధాలు ఇవేమీ లేకుండా, ఇష్టమైనంత కాలం కలసి ఉండి, ఏ చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఎప్పుడైనా...
నేటి ‘జెన్ జీ’ యువతరం ‘లివ్ ఇన్ రిలేషన్’లో ఉండడానికి ఇష్టపడుతున్నది. పెళ్లి వలన ఏర్పడే బాధ్యతలు, బంధాలు ఇవేమీ లేకుండా, ఇష్టమైనంత కాలం కలసి ఉండి, ఏ చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఎప్పుడైనా విడిపోగలగడమే ఈ ‘లివ్ ఇన్ రిలేషన్’ ప్రత్యేకత. మేజర్ అయిన వారు ఇష్టానుసారం, ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు, లేదా ఎవరితోనైనా కలిసి ఉండే హక్కు ఉందనీ, అనైతికంగా అనిపించినా అది నేరం కాదనీ 2006లోనే ‘లతా సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్’ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరింత లోతుగా విశ్లేషిస్తూ, ఇదే అభిప్రాయాన్ని మరింత దృఢంగా, మరింత స్పష్టంగా సుప్రీంకోర్టు ‘ఖుష్బూ వర్సెస్ కన్నియమ్మాల్’ కేసులో వెల్లడించింది. ‘ఇద్దరు వ్యక్తులు పెళ్లిని పోలిన సంబంధంలో కలిసి ఒకే గృహంలో నివసిస్తూ, అందులో ఒకరు గృహహింసకు గురైనప్పుడు ఫిర్యాదు చేయవచ్చ’ని పేర్కొంటూ ‘గృహహింస చట్టం–2005’ కూడా ‘లివ్ ఇన్ రిలేషన్’ను గుర్తించిందని వర్ష కపూర్ కేసులో ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇందిరాశర్మ కేసులో అన్ని సంబంధాలు ‘లివ్ ఇన్ రిలేషన్’ కాలేవని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో.. ఈ విషయం తెలిసి కూడా ఆమె పెళ్లై పిల్లలు ఉన్న వ్యక్తితో 18 ఏళ్లు కలిసి జీవించింది. ఆ తరువాత, అతను ఆమె నుంచి దూరమవ్వడంతో, మెయింటెనెన్స్ కావాలని గృహహింస చట్టం కింద కేసు వేసింది. ఇటువంటి సంబంధాలు ‘లివ్ ఇన్ రిలేషన్’ కోవలోకి రావని చెప్తూ, పార్లమెంటు దీనిపై చట్టం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. మరి ‘లివ్ ఇన్ రిలేషన్’లో పిల్లలు పుడితే? ఒకప్పుడు పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలను అక్రమ సంతానంగా పరిగణించేవారు. అయితే, చట్ట విరుద్ధ వివాహంలో కన్న సంతానాన్నీ సక్రమంగానే పరిగణించాలని, తల్లిదండ్రుల ఆస్తుల్లో వారికి వాటా కూడా లభిస్తుందని 1976లో హిందూ వివాహ సవరణ ద్వారా చట్టంలో మార్పు చేశారు. అలాగే, ‘ఎస్పీఎస్ బాలసుబ్రమణ్యం వర్సెస్ సురుత్తేయన్’ కేసులో చాలా కాలం ‘లివ్–ఇన్’ సంబంధంలో ఉండి పిల్లలు పుడితే వారిని సక్రమ సంతానంగానే పరిగణించాలని, వారికి కూడా తల్లిదండ్రుల ఆస్తుల్లో వాటా లభిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే, ‘భారతమాత వర్సెస్ విజయా రంగనాథన్’ కేసులో పూర్వీకుల ఆస్తిలో వాటా మాత్రం రాదని చెప్పింది.
2018లో.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో పుట్టిన పిల్లలకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేసింది. కానీ, పార్లమెంటు ఇంతవరకు దీనిపై చట్టం చేయలేదు. కోర్టులు మాత్రం లివ్ ఇన్ సంబంధాన్ని గుర్తించాయి. అయితే, ఉత్తరాఖండ్ రాష్ట్రం, 2025 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసింది. దీనిలో భాగంగా, లివ్ ఇన్ సంబంధాన్ని నిర్వచించి ఎన్నో కఠిన నియమ నిబంధనలను ఏర్పరచింది. అవి: ఒక ‘లివ్ ఇన్’ సంబంధంలో ఉన్నప్పుడు మరో ‘లివ్ ఇన్’ సంబంధంలో ఉండరాదు. కేవలం మేజర్ అయినవారు మాత్రమే లివ్ ఇన్ సంబంధంలో ఉండవచ్చు. కానీ, 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి విషయంలో ఆ వ్యక్తుల తల్లిదండ్రులకు వారి లివ్ ఇన్ సంబంధం గురించి సబ్ రిజిస్ట్రార్ తెలియపరచాలి. లివ్ ఇన్ సంబంధాన్ని మొదలుపెట్టిన 30 రోజుల్లోగా, రిజిస్ట్రేషన్ చేసి, ధ్రువపత్రం పొందాలి. రిజిస్ట్రేషన్ కాగానే, సబ్-రిజిస్ట్రార్ సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారమందించాలి. అలాగే, లివ్ ఇన్‌కు ఇరువురిలో ఎవరైనా, ఎప్పుడైనా స్వస్తి పలకవచ్చు. లివ్ ఇన్ సంబంధం ముగిసిపోయినప్పుడు కూడా మళ్లీ రిజిస్ట్రార్‌కు సమాచారమివ్వాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే, మూడు నెలల వరకు జైలు శిక్ష, పదివేల రూపాయల వరకు జరిమానా, లేక ఈ రెండూ విధించవచ్చు. లివ్ ఇన్ పార్టనర్స్‌కు కొన్ని హక్కులు కూడా కల్పించారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళ మెయింటెనెన్స్ భృతి కోసం కోర్టుకు దరఖాస్తు చేయవచ్చు. కాబట్టి, లివ్ ఇన్ సంబంధాలకు చట్టబద్ధత ఉన్నట్టే లెక్క. కానీ ఈ సంబంధాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు సూచించినట్లుగా, త్వరగా ఒక సమగ్ర చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.
కె.ఎస్. హరీశ్‌కుమార్
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు
సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట
Read Latest AP News And Telangana News And National News
And Telugu News