Share News

ఆ భేటీ మాటేంటి?

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:42 AM

గజం మిథ్య – పలాయనం మిథ్య అంటారు. అధికారంలో ఉన్న వారిపై ప్రతిపక్షాలు – ప్రతిపక్షంలో ఉన్న వారిపై అధికార పక్షం చేసే ఆరోపణలు ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు...

ఆ భేటీ మాటేంటి?

గజం మిథ్య – పలాయనం మిథ్య అంటారు. అధికారంలో ఉన్న వారిపై ప్రతిపక్షాలు – ప్రతిపక్షంలో ఉన్న వారిపై అధికార పక్షం చేసే ఆరోపణలు ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం, అధికారంలోకి రాగానే ఎదురుదాడి చేయడం రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలోకి రాగానే ప్రభుత్వం తీసుకునే చర్యలను కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ రక్షణ పొందడం అలవాటుగా చేసుకున్నారు. పనిలో పనిగా దృష్టి మళ్లింపు రాజకీయాలను జోడిస్తారు. విచారణలు సాగుతూ ఉంటాయి. విషయం మాత్రం తేలదు. ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోతాయి. ఆధారాలు లభించిన సందర్భాలలో కూడా చర్యలు ఉండవు. తెలంగాణలో నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల వ్యవహారంతోపాటు కేసీఆర్‌ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అంతకు ముందు ఫార్ములా –ఈ కారు రేసు వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కొంత కాలం హడావుడి సృష్టించాయి. ఫార్ములా–ఈ కారు రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఏమైందో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకొంది. సీబీఐ దర్యాప్తుపై కేంద్రం మౌనంగా ఉంటోంది. అంటే, వ్యవస్థలు తమకు తాముగా పనిచేయవని స్పష్టమవుతోంది. ఈ రెండు అంశాలలో అధికార దుర్వినియోగం జరిగిందన్నది వాస్తవం. అలాగే కేసీఆర్‌ జమానాలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నది కూడా వాస్తవం. అయినా దేనిపైనా చర్యలు ఉండవు. విషయ తీవ్రత ఎంతగా ఉన్నప్పటికీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ అందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలు ఆరోపణలను తేలికగా తీసి పారేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఆయా అంశాలను రాజకీయ క్రీడలో భాగంగానే పరిగణిస్తున్నాయి.


చర్యలు వదిలేసి ఎదురుదాడి...

ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి విచారణ పేరిట కాలయాపన చేయడం జరిగేది. దివంగత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలైంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు. దురుద్దేశాలు ఆపాదించేవారు. ఈ క్రమంలో మీడియా కన్నును మీడియాకు చెందిన వారితోనే పొడిపించేవారు. దీంతో అసలు విషయం పక్కదారి పట్టేది. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్లు ఏ మాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. తమను కాపాడుకునేందుకు కులాలను రంగంలోకి తెస్తున్నారు. నైనీ కోల్‌ బ్లాక్‌ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్లీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. వేరెవరి ప్రయోజనాల కోసమో ఆ కథనం రాశానని ప్రచారం చేస్తున్నారు. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననం చేస్తూ ఎన్టీవీలో కథనం ప్రసారం అయ్యేవరకు ఈ టెండర్ల విషయం కూడా నాకు తెలియదు. ఆ తర్వాతే వివరాలు తెలిశాయి. ‘పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలు’ అని భట్టి విక్రమార్క నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను– నైనీ కోల్‌ బ్లాక్‌ను పొందేందుకు భట్టి విక్రమార్క, ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? ఈ నేపథ్యంలో నేను రాసిన కథనం వల్ల చెలరేగిన మంటలు చల్లారకపోవడంతో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్లీ తెరమీదకు తెచ్చింది. ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలో పరిశోధనాత్మక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కోవలసి వస్తోంది.


దిద్దుబాటు ఏదీ?

1985కి పూర్వం ప్రభుత్వంలో జరిగే అవకతవకలు, అంటే కుంభకోణాలు వెలుగులోకి తేవడంలో ఇంగ్లిషు పత్రికలు క్రియాశీలకంగా వ్యవహరించేవి. అప్పట్లో పరిశోధనాత్మక కథనాల ప్రచురణలో దక్కన్‌ క్రానికల్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ద హిందూ పత్రికలు పోటీ పడేవి. ఈ పత్రికల్లో వచ్చే కథనాలతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి దిద్దుబాటు చర్యలు తీసుకునే వారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేవారు. దీంతో సదరు కథనాలను రాసిన జర్నలిస్టులకు మంచి పేరుతోపాటు వృత్తిపరంగా గొప్ప కిక్కు వచ్చేది. ఆ తర్వాతి కాలంలో ఆంగ్ల పత్రికలను వెనక్కు నెట్టి తెలుగు పత్రికలు ఈ పాత్రను పోషించాయి. సంచలన కథనాలు రాసిన జర్నలిస్టులకు యాజమాన్యాలు రివార్డులు ఇచ్చేవి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండేది. ఆయన హయాంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ పనులకు టెండర్లు వేయడం అనే ప్రక్రియకు నిర్వచనం మార్చివేశారు. తాము ఎంపిక చేసిన కంపెనీలకే పనులు దక్కేలా సిండికేట్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పని చేసినందుకు ప్రభుత్వ పెద్దలు ఆరు శాతం కమీషన్‌ తీసుకొనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్సెంటేజీ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీతత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. రాజశేఖరరెడ్డి అమలు చేసిన విధానాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయా ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో అవినీతి వ్యవస్థీకృతమైంది. టెండర్ల గూడుపుఠాణీ ప్రభుత్వ పెద్దలకు హక్కుగా మారింది. ఎప్పుడైనా సదరు గూడుపుఠాణీకి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తే రాజశేఖరరెడ్డి బాటలో ఎదురుదాడి చేస్తున్నారు. నైనీ కోల్‌ బ్లాక్‌ విషయంలో ఇదే జరిగింది.


భట్టి మాటలు... నిజాలు!

కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేయడానికి ప్రవేశపెట్టిన సైట్‌ విజిట్‌ అనే విధానాన్ని టెండర్లలో పాల్గొనే అర్హతగా మార్చివేశారు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకునే నైనీ కోల్‌ బ్లాక్‌ను హస్తగతం చేసుకొనే స్కెచ్‌ రూపొందించారు. ఈ విషయాన్ని నేను వెలుగులోకి తేవడంతో, ఇందులో ప్రధాన పాత్రధారి అయిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యథావిధిగా ఎదురుదాడికి దిగారు. తాను రాజశేఖరరెడ్డి అనుచరుడినని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. ఎప్పుడో పదహారు సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖరరెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోనని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. అందుకనే నైనీ బ్లాక్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాను. సదరు కథనం రాయడంలో నాకు దురుద్దేశాలు ఉన్నాయని, ఎవరి ప్రయోజనాల కోసమో ఆ వార్త రాశానని కూడా భట్టి నిందించారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్‌ అధికారుల వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైనీ కోల్‌ బ్లాక్‌ అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో! ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోపంతో మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఏమిటి?’ అని ఆరా తీసిన నాకు అసలు విషయం తెలిసింది. జరిగింది ఇదే! ఈ విషయమై భట్టి విక్రమార్క ఎటువంటి సవాళ్లయినా విసురుకోవచ్చు. వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను రాజకీయ నాయకుడిని కాను. కనుక తిరిగి ఆయనపై ప్రత్యారోపణలు చేయదలచుకోలేదు. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే, తాను రాజశేఖరరెడ్డి శిష్యుడినని భట్టి విక్రమార్క స్వయంగా చెప్పుకొన్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? పంచకట్టు విషయంలోనే కాకుండా అలవాట్ల విషయంలో కూడా ఆయన రాజశేఖరరెడ్డినే ఆదర్శంగా తీసుకున్నట్టు ఉంది. భట్టి విక్రమార్క నన్ను విమర్శించిన రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, రెండు మీడియా సంస్థల మధ్య గొడవలే దీనికంతటికీ కారణం అంటూ వ్యవహారాన్ని తేలికగా తీసిపడేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎన్టీవీ యాజమాన్యాన్ని, నన్ను ఒకే గాటన కట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం మాత్రం నాకు నచ్చలేదు. ఏది ఏమైనా నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించడం ఒక జర్నలిస్టుగా నాకు గర్వకారణం. ప్రభుత్వం తీసుకొనే దిద్దుబాటు చర్యలే జర్నలిస్టులకు లభించే విజయం. నైనీ కోల్‌బ్లాక్‌కు పిలిచిన టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను.


బీఆర్‌ఎస్‌ వింత వైఖరి...

అయితే, ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది మరోదారి అన్నట్టుగా ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆ పార్టీ నన్ను ఒక రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించడం వల్లనే కాబోలు, నాపై కొన్ని విమర్శలు చేసింది. కేసీఆర్‌ సొంత పత్రికలో యథావిధిగా విషం కక్కారు. ఆ పార్టీలోని రాజకీయ మరుగుజ్జులతో విమర్శలు చేయించారు. ఆ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన శత్రువు కనుక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను భుజానికి ఎత్తుకున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో వారి ఎత్తుగడలను తప్పుపట్టాల్సిన పని లేదు. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు సృష్టించగలిగితే లాభపడేది భారత రాష్ట్ర సమితి కనుక ఆ పార్టీ నాయకులు ఆ పని చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ గొడవలతో నాకేమి సంబంధం? మధ్యలో నాపై పడి ఏడవడం ఎందుకు? సింగరేణి సంస్థలో మరెన్నో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రి లేదా ఆ శాఖను చూస్తున్న భట్టి విక్రమార్క సమాధానం చెప్పుకొంటారు. రాజకీయాలు ఎంత కలుషితం కాకూడదో అంతగా కలుషితమైనందునే అన్నిటికీ వక్రభాష్యాలు చెబుతున్నారు. జరుగుతున్న దానికి మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించినట్టుగా... రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగరేణి సంస్థను పాడి ఆవుగా మార్చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఎండీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని నియమించేవారు. ఆ సంస్థ వ్యవహారాలలో ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకొనేది కాదు. విడిపోయిన తర్వాత పాలకులు తమ చెప్పు చేతల్లో నడుచుకొనే వారిని సింగరేణి ఎండీలుగా నియమించుకున్నారు. ఫలితంగా ఇప్పుడు అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మునుముందు కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి సంస్థ నెట్టబడుతోంది. నైనీ బ్లాక్‌ టెండర్లలో పాల్గొనాలనుకొనే వారందరికీ సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ జారీ చేసి ఉంటే, ఏ నిబంధన పెట్టినా ఏ గొడవా ఉండేది కాదు. అలా జారీ చేయకుండా అధికారులను కట్టడి చేయడం వల్లనే తంటా అంతా! ఈ నిబంధనతో తనకు సంబంధం లేదని భట్టి విక్రమార్క చెబుతున్నారుగానీ సంబంధమే లేకుంటే అధికారులపై ఆంక్షలు ఎవరు విధించినట్టు? మొత్తం మీద నేను తెరమీదకు తెచ్చిన కథనంతో తేనె తుట్టెను కదిపినట్టు అయింది. సింగరేణి వ్యవహారాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయని స్పష్టమైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిష్పాక్షిక విచారణ జరిగితే సింగరేణి విషయంలో ఎవరి పాపం ఎంతో తేటతెల్లమవుతుంది. బురద కడుక్కోవలసిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు బురద చల్లే పరిస్థితికి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి వ్యూహం సిద్ధం చేసుకొని అమలు చేస్తోంది. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయడం ఇందులో భాగమే. సింగరేణి వ్యవహారం రచ్చకెక్కడంతో ముందుగా హరీశ్‌రావు, ఆ తర్వాత కేటీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించుకున్నారు.


సా....గుతున్న విచారణ

కేంద్ర ప్రభుత్వ టెలిగ్రాఫిక్‌ చట్టం ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ తీవ్ర నేరమే అవుతుంది. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది ఇతరుల ఫోన్‌ సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించివేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తాము కూడా బాధితులమే అని చెప్పుకొంటున్నారంటే ఏ స్థాయిలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ దుర్వినియోగమయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలతోపాటు జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల సంభాషణలు విని వారి కదలికలను తెలుసుకోవడం ద్వారా కేసీఆర్‌ సాధించింది ఏమిటో తెలియదు. అధికారాన్ని కూడా నిలుపుకోలేకపోయారు కదా! ఎలక్టోరల్‌ బాండ్స్‌ పొందడం కోసం టెలిఫోన్‌ ట్యాపింగ్‌ను సాధనంగా వాడుకోవడం సరికొత్త పరిణామం. ‘ఈ వ్యవహారంపై రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇంకెంత కాలం విచారణ జరుపుతారు?’ అంటూ సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఒక సందర్భంలో విసుగు ప్రదర్శించింది. నిజం చెప్పాలంటే టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై అవసరమైన ఆధారాలు ఇప్పటికే ప్రభుత్వానికి లభించాయి. కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవచ్చు. అయినా విచారణను సాగదీస్తున్నారు. బహుశా కేసీఆర్‌, సంతోష్‌రావును కూడా త్వరలో విచారణకు పిలవవచ్చు. విచారణ ఎంత ఎక్కువ కాలం సాగితే విషయ తీవ్రత అంతగా పలుచనవుతుంది. తాజాగా విచారణకు హాజరైన హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారణ పేరిట వేధిస్తున్నారని ఎదురుదాడి మొదలెట్టారు. తమాషా ఏమిటంటే, నాటి టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు హరీశ్‌ కూడా బాధితుడు కావడం! కేటీఆర్‌ కూడా మినహాయింపు అని చెప్పలేం. ట్యాపింగ్‌ విధుల్లో ఉన్న సిబ్బంది సరదా కోసమైనా కేటీఆర్‌ సంభాషణలను విని ఉండవచ్చు కదా? విచ్చలవిడితనానికి ఆస్కారం కల్పించినప్పుడు ఏదైనా జరగవచ్చు. కేసీఆర్‌ మాటలను కూడా విని ఉండొచ్చు. కుతూహలం మనిషి నైజం. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ విచారణలను వీలైనంత త్వరగా ముగించడం వాంఛనీయం. లేనిపక్షంలో సీరియస్‌నెస్‌ పోతుంది. గతంలో జరిగిన తప్పులపై చర్యలు తీసుకొనే ఆలోచన లేకపోతే విచారణ తంతుకు స్వస్తి చెప్పాలి. అలాకాకపోతే ఇదంతా అధికార విపక్షాల మధ్య నడిచే డ్రామాగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటికే విమర్శలు చేయడం మొదలెట్టారు. అతీగతీ లేకుండా విచారణలు సాగుతూ ముఖ్య నాయకులను విచారణల పేరిట పిలుస్తూ పోవడంవల్ల ప్రజలు సహజంగానే వారి విమర్శలను విశ్వసిస్తారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ సాగినంత కాలం బీఆర్‌ఎస్‌ నాయకులు సింగరేణి వంటి విషయాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే వారం గడిచేసరికి సింగరేణి వ్యవహారం మసకబారడం మొదలైంది. ప్రస్తుతానికి టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విషయమే హాట్‌ టాపిక్‌ అయింది. త్వరలో మరో వివాదం తెరపైకి రావొచ్చు. అప్పుడు ఇది కూడా తెర మరుగవుతుంది. చివరికి గజం మిథ్య – పలాయనం మిథ్య అన్న భావనలోకి ప్రజలు వెళతారు. రాజకీయ నాయకులు కోరుకొనేదీ ఇదే కదా! ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది సింగరేణి విషయమైనా, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విషయమైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వాలు బలంగా కోరుకున్న సందర్భాలలో విచారణలు వేగంగా పూర్తవుతాయి. శిక్షలు కూడా అంతే వేగంగా పడతాయి. రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు సాగుతూనే ఉంటాయి. ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ఎదురుదాడి వ్యూహాలు పదునెక్కుతాయి.


ఏపీ రాజకీయాల బాటలోనే టీజీ

ఏడాదిన్నర క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు, అక్కడి పరిస్థితులు చర్చనీయాంశంగా, అసహ్యకరంగా ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రమే టార్గెట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రులుగానీ మరొకరుగానీ తప్పు చేసినా ఆ పార్టీ ఉపేక్షిస్తోంది. అవసరమైతే వారికి భుజం కాస్తోంది. రేవంత్‌రెడ్డిని ఎంతగా బలహీనపరిస్తే తమ పాచిక అంతగా పారుతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు లెక్కలు వేసుకొంటున్నారు. అందుకే, సింగరేణి విషయంలో కూడా రేవంత్‌రెడ్డిని మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్‌ పార్టీ దానంతట అదే బలహీనపడుతుందన్నది బీఆర్‌ఎస్‌ అభిప్రాయం. బహుశా ఈ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులను టెన్షన్‌లో పెట్టేందుకు టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విచారణను వేగవంతం చేయిస్తూ ఉండొచ్చు. ‘నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా!’ అన్నట్టుగా తనపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనుకాడకపోవచ్చు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రారంభమైన ఈ రాజకీయ క్రీడలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం! ఈ విషయం అలా ఉంచితే, నైనీ కోల్‌ బ్లాక్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నాయకులు క్రెడిట్‌ చోరీకి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తీసుకురాగా తానే ఈ వ్యవహారాన్ని బయటపెట్టానని బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావు చెప్పుకొంటున్నారు. తాము కోల్‌ బ్లాక్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీశ్‌రావు చెప్పుకోవడం క్రెడిట్‌ చోరీ కాదా? సింగరేణికి నష్టం జరగనంత వరకు ఎవరు క్రెడిట్‌ తీసుకున్నా ఫర్వాలేదని సరిపెట్టుకుందాం!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి...

నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 07:02 AM