Share News

రేవంత్‌ తేల్చుకోవాలి!

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:44 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ లొల్లి ఏంది? ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు వేచి చూసిన కాంగ్రెస్‌ పార్టీలో పాత సంస్కృతి పోలేదా? లేక తెరవెనుక ఏమైనా జరుగుతోందా?...

రేవంత్‌ తేల్చుకోవాలి!

క్షేత్ర స్థాయిలో కదన కుతూహలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా? అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి!

కాంగ్రె్‌సలో ఎంత మంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయారు. కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అవడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

రేవంత్‌ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్ఠానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వాళ్లను ప్రోత్సహించింది. రేవంత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ సంస్కృతికి తగ్గట్టుగా తనను తాను మలచుకొనే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణతిని ప్రదర్శించలేదు.

బీఆర్‌ఎస్‌, వైసీపీ ఏకమై రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బలహీనపడాలి. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటం కంటే రేవంత్‌ రెడ్డి బలహీనపడటమే బీఆర్‌ఎ్‌సకు ముఖ్యం. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరుగు ఉండదని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కేసీఆర్‌, జగన్‌ రెడ్డికి చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్‌ రెడ్డినే టార్గెట్‌ చేస్తున్నాయి.

ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత సీఎం రేవంత్‌ రెడ్డిపైనే కాదు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై కూడా ఉంది. పార్టీలో క్రమశిక్షణ నెలకొనడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం దృఢ నిశ్చయంతో వ్యవహరించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై నమ్మకం లేకపోతే ఆ విషయం చెప్పి, ఆయనను తప్పించి మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలి. అలా కాదనుకుంటే రేవంత్‌ రెడ్డికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. సీఎంకు అండగా నిలబడాలి.

అంతేగానీ సాచివేత ధోరణిని ప్రదర్శించడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతుంది. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రె్‌సలో అంతర్గత పోరు ముదిరితే పార్టీ మళ్లీ అధికారంలోకి రాదన్న భావన మరింత బలపడుతుంది.

రేవంత్‌ కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి తనను తాను సంస్కరించుకోవాలి. ఆయన వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. తనవైపు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం సోదరుల జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉంటే తన సోదరులను కట్టడి చేయడానికి రేవంత్‌ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో తన సోదరుల జోక్యానికి అడ్డుకట్ట వేయగలిగితే రాజకీయ ప్రత్యర్థులే కాదు- పార్టీలోని అంతర్గత శత్రువులకూ విమర్శలు చేయడానికి అవకాశం ఉండదని సీఎం గుర్తించాలి.

నిజానికి రాష్ట్ర కాంగ్రె్‌సలో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేరు. ముఖ్యమంత్రి కావాలని చాలా మందికి కోరిక ఉండవచ్చు గానీ రేవంత్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోదగిన నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారా? అంటే చెప్పడం కష్టమే. పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వ్యవహరించాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న సుమతీ శతకం రాజకీయాలలో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు.

సీఎం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలలో గౌరవం లేదా భయం ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగకపోయినా ఒకటే. ఈ వాస్తవాన్ని గుర్తించి దృఢచిత్తంతో వ్యవహరించి బలమైన నాయకుడిగా ఎదగడమా? లేదా? అన్నది రేవంత్‌ అనుసరించబోయే వైఖరిని బట్టి ఉంటుంది.


తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ లొల్లి ఏంది? ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు వేచి చూసిన కాంగ్రెస్‌ పార్టీలో పాత సంస్కృతి పోలేదా? లేక తెరవెనుక ఏమైనా జరుగుతోందా? ముఖ్యమంత్రిగా దాదాపు మూడేళ్లు పూర్తిచేసుకోబోతున్న రేవంత్‌రెడ్డి బలమైన నాయకుడిగా ఎదగలేదా? కాంగ్రెస్‌ పార్టీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ సంస్కృతిలో భాగమేనా? లేక ముఖ్యమంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నట్టుగా వీటి వెనుక కుట్ర ఏమైనా ఉందా? పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఇప్పటికీ కొంత మంది కాంగ్రెస్‌ నేతలు అంగీకరించలేకపోవడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితికి కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యత ఎంత? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత ఎంత? క్షేత్ర స్థాయిలో కదన కుతూహలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా? అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి! తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి ఏమిటి? రాయలసీమకు చెందిన రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కిక్కురుమనకుండా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తమ ప్రాంతానికే చెందిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు ఆమోదించలేకపోతున్నారు? ఈ క్రమంలో ఆత్మపరిశీలన చేసుకోవలసింది రేవంత్‌రెడ్డా? లేక కాంగ్రెస్‌ అధిష్ఠానమా? అన్నది ఇప్పుడు చూద్దాం. 2023లో ఎన్నికలు జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ పరిశీలకులకు గానీ, కాంగ్రెస్‌ నాయకులకు గానీ నమ్మకం లేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్‌రెడ్డికి మాత్రమే ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తొలగించింది. ఈ పరిణామం రేవంత్‌రెడ్డికి కలిసొచ్చింది. కేసీఆర్‌ పోకడల పట్ల విముఖంగా ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయ నాయకుడిగా రేవంత్‌రెడ్డిని ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేనా? సచ్చేనా? అన్న అనుమానంతో ఆ పార్టీలో బడా నాయకులుగా చలామణి అవుతున్న కొందరు అప్పటికే భారత రాష్ట్ర సమితిలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న పట్టుదలతో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు.


కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉండకపోతే రేవంత్‌రెడ్డి పరిస్థితి ఏమిటి? అని అప్పట్లో ఆయన అనుచరులు ఆందోళన చెందారు కూడా! ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు ప్రయత్నించినప్పటికీ రాహుల్‌గాంధీ ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి పెద్దగా ఆటంకాలు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకు జూనియర్‌ అయిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికీ కొందరు సీనియర్లు మొరాయిస్తూనే ఉన్నారు. సీనియారిటీ ముఖ్యమా? సమర్థత ముఖ్యమా? అంటే ఎవరైనా సమర్థతకే ఓటు వేస్తారు. కాంగ్రెస్‌లో ఎంత మంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్‌రెడ్డి సక్సెస్‌ అవడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అధిష్ఠానం తన సహజ లక్షణమైన ఢిల్లీ పెత్తనాన్ని వదులుకోలేకపోవడం, సహజంగానే దూకుడు స్వభావం కలిగిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా అదే దూకుడు ప్రదర్శించడంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించడానికి కొంత మంది సీనియర్లకు అహం అడ్డు వచ్చింది. రేవంత్‌రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్ఠానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తున్న వాళ్లను ప్రోత్సహించింది. రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ సంస్కృతికి తగ్గట్టుగా తనను తాను మలచుకొనే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణతిని ప్రదర్శించలేదు. పలు సందర్భాలలో ఆయన తొందరపాటు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దశ దిశ లేదన్న భావన ప్రజల్లో వ్యాపించడం మొదలైంది. పాత కాంగ్రెస్‌ సంస్కృతి విస్తరించింది. పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పింది. ఈ పరిణామాలను ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి సహజంగానే తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ సంస్కృతిని అలవర్చుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. ఫలితంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఆయనకు పట్టు చిక్కలేదన్న అభిప్రాయం ఏర్పడింది. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తెలంగాణపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఉభయ రాష్ర్టాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి ఒక జట్టుగా ఏర్పడగా, ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి మధ్య పాత సాన్నిహిత్యం మరింత బలపడింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉండిపోయింది. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ తొలగించడం, తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా సహకరించడంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరైనా అంగీకరించవలసిందే!


అధిష్ఠానం బాధ్యత కూడా..

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏ ముఖ్యమంత్రి అయినా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సహజం. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి కూడా తనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓటర్లపై తన పట్టు చేజారకుండా చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఈ కారణంగానే రాజగోపాల్‌రెడ్డి, సుస్మిత వంటి వాళ్లు రేవంత్‌రెడ్డిని పచ్చ కాంగ్రెస్‌ ప్రతినిధిగా అభివర్ణించే ప్రయత్నం చేశారని చెప్పాలి. హైదరాబాద్‌లోని మైత్రీవనం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ సందర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై రేవంత్‌రెడ్డి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. కారణం ఏమైనప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఇప్పటికీ రేవంత్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగానే చూస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసిన విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. అయితే నాటి పరిణామాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు అనుకూలంగా మలచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు అటువంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. రేవంత్‌రెడ్డితో అనుబంధం కారణంగా తెలుగుదేశం అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని బలపరిచారు. ఇది వాస్తవం! అయితే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీని ఒక భూతంగా చూపించే ప్రయత్నాన్ని బీఆర్‌ఎస్‌ ఎప్పటి నుంచో చేస్తున్నది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం పార్టీ కూడా కొంత వరకు కారణం అన్న అభిప్రాయంతో ఉన్న బీఆర్‌ఎస్‌.. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మరింత సన్నిహితమైంది. పాత సాన్నిహిత్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సఖ్యంగా ఉండే రేవంత్‌రెడ్డిని తమ ప్రధాన శత్రువుగా కేసీఆర్‌, జగన్‌ పరిగణించడం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌–వైసీపీలకు చెందిన సోషల్‌ మీడియా గ్రూపులు కూడా ఒక్కటై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఈ కోణంలోనే చూడాలా? అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాల వెనుక నిజంగానే కుట్ర ఉందా? బీఆర్‌ఎస్‌, వైసీపీ ఏకమై రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలహీనపడాలి. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటం కంటే రేవంత్‌రెడ్డి బలహీనపడటమే బీఆర్‌ఎస్‌కు ముఖ్యం. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరుగు ఉండదని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కేసీఆర్‌, జగన్‌రెడ్డికి చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్‌రెడ్డినే టార్గెట్‌ చేస్తున్నాయి.


ఈ రాజకీయ ప్రత్యర్థులతో పాటు ఇప్పుడు అంతర్గత శత్రువులు కూడా ఏకం కావడం యాదృచ్ఛికమా? లేక దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా? అన్న అనుమానం సహజంగానే వ్యక్తమవుతోంది. రేవంత్‌రెడ్డిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శలు చేస్తున్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిలు జగన్‌రెడ్డికి సన్నిహితులు అన్న విషయాన్ని ముఖ్యమంత్రి వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ కొంత కాలంపాటు వైసీపీతో పనిచేయడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్గీయులు వ్యక్తంచేస్తున్న అనుమానాల్లో నిజం ఉందో లేదో తెలియదు గానీ కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితి అదుపు తప్పుతోందన్నది నిజం! ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే కాదు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై కూడా ఉంది. పార్టీలో క్రమశిక్షణ నెలకొనడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం దృఢ నిశ్చయంతో వ్యవహరించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నమ్మకం లేకపోతే ఆ విషయం చెప్పి, ఆయనను తప్పించి మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలి. అలా కాదనుకుంటే రేవంత్‌రెడ్డికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. ముఖ్యమంత్రికి అండగా నిలబడాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నందున అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా పార్టీని బలహీనపరిచే వారిని ప్రోత్సహించడం అంటే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరింపులకు దిగినప్పుడు ‘ఎవరైనా రాజీనామా చేస్తే అరగంటలోనే ఆమోదిస్తాం’ అని పార్టీ అధిష్ఠానం హెచ్చరించడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు సర్దుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని బాహాటంగా విమర్శిస్తున్న వారిపై చర్యలైనా తీసుకోవాలి లేదా తప్పు ముఖ్యమంత్రిదే అయితే ఆయనను సరిదిద్దాలి. అంతేగానీ సాచివేత ధోరణిని ప్రదర్శించడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతుంది. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదిరితే పార్టీ మళ్లీ అధికారంలోకి రాదన్న భావన మరింత బలపడుతుంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ వాస్తవాన్ని గుర్తించి వెంటనే విరుగుడు చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసినట్టు అవుతుంది.

1-e-kotha.jpg


దిద్దుబాటు తక్షణావసరం!

పార్టీ అధిష్ఠానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి తనను తాను సంస్కరించుకోవాలి. ఆయన వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. తనవైపు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి సోదరుల జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉంటే మాత్రం తన సోదరులను కట్టడి చేయడానికి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో తన సోదరుల జోక్యానికి అడ్డుకట్ట వేయగలిగితే రాజకీయ ప్రత్యర్థులే కాదు– పార్టీలోని అంతర్గత శత్రువులకు కూడా విమర్శలు చేయడానికి అవకాశం ఉండదని ముఖ్యమంత్రి గుర్తించాలి. ఈ దిశగా చర్యలు తీసుకున్నప్పుడు రేవంత్‌రెడ్డికి నైతిక బలం దానంతట అదే వస్తుంది. ముందుగా ఇంటిని చక్కదిద్దుకోగలిగితే ఆ తర్వాత పార్టీలో పరిస్థితులను అదుపులో పెట్టడం సులువు అవుతుంది. కొన్ని శాఖలలో అవినీతికి సంబంధించిన ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కూడా ఆయన దృష్టిపెట్టాలి. ప్రైవేట్‌ ఆస్తులను 22ఏ జాబితాలో పెట్టడంపై ప్రభుత్వం అప్రతిష్ఠపాలవడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఎంతకాలం పనిచేశామన్నది కాదు– ఎలా పాలించామన్నది ముఖ్యమని రేవంత్‌రెడ్డి గుర్తించాలి. కాకిలా కలకాలం ఉండాలని కోరుకోకూడదు.. హంసలా ఆరు నెలలు బతికినా చాలు అంటారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినవాళ్లు ఇదే విధంగా ఆలోచించాలి. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ర్టానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా అయిదేళ్లు కూడా అధికారంలో ఉండలేకపోయారు. అయినా ఆయనను ఇప్పటికీ బలమైన నాయకుడిగా మనం గుర్తుచేసుకుంటుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కూడా ఆ స్థాయిలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎంత బలమైన నాయకుడైనా శాశ్వతంగా అధికారంలో ఉండిపోరు. అలా ఉండాలని అనుకోవడం ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తమను ఎంత మంది గుర్తుపెట్టుకుంటారు? తమకు ఎంత మంది అనుచరులు మిగులుతారు? అని ఆలోచించాలి. రేవంత్‌రెడ్డి కూడా ఈ దిశగానే ఆలోచించాలి. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేరు. ముఖ్యమంత్రి కావాలని చాలా మందికి కోరిక ఉండవచ్చు గానీ రేవంత్‌రెడ్డికి ప్రత్యామ్నాయం అని చెప్పుకోదగిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారా? అంటే చెప్పడం కష్టమే. ఈ కారణంగా రేవంత్‌రెడ్డి తనలోని లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు బలమైన నాయకుడిగా ఎదగడానికి మరింతగా కృషి చేయాలి. పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వ్యవహరించాలి. అదే సమయంలో పరిణతి ప్రదర్శించాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న సుమతీ శతకం రాజకీయాలలో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు. సమస్యాత్మకంగా మారిన వారిని ఎదుర్కొనే ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. సమస్యలతో వచ్చిన వారిని కలుసుకోకుండా దూరంగా ఉండిపోవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత ముదురుతుంది.


మంత్రులు, అధికారులపై ముఖ్యమంత్రికి పట్టు లేదన్న అభిప్రాయమూ ఉంది. ఈ అభిప్రాయం పోగొట్టడానికి రేవంత్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రిగా అరుదైన అవకాశం లభించింది అని సంతృప్తి చెందితే సరిపోదు. ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలని రుజువు చేసుకోవాలి. ముఖ్యమంత్రి అంటే మంత్రులు, ఎమ్మెల్యేలలో గౌరవం లేదా భయం ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగకపోయినా ఒకటే. ఈ వాస్తవాన్ని గుర్తించి దృఢ చిత్తంతో వ్యవహరించి బలమైన నాయకుడిగా ఎదగడమా? లేదా? అన్నది రేవంత్‌రెడ్డి అనుసరించబోయే వైఖరిని బట్టి ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స చేసి బతికించుకుంటారా లేక శస్త్ర చికిత్స చేసి నిలబెట్టుకుంటారా? అన్నది కాంగ్రెస్‌ అధిష్ఠానంతో పాటు ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 12:58 AM