Share News

మన పొదుపు DNA పోతోంది!

ABN , Publish Date - May 17 , 2026 | 01:11 AM

‘గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ప్రజలంతా పొదుపు పాటించాలి. చమురు వాడకం తగ్గించాలి. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తున్నారు.

మన పొదుపు DNA పోతోంది!

గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ప్రజలంతా పొదుపు పాటించాలి. చమురు వాడకం తగ్గించాలి. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తున్నారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు తమ వాహన శ్రేణుల సంఖ్యను తగ్గించుకున్నారు. పొదుపు వైపు ప్రజలను మళ్లించడానికి ఇటువంటి చర్యలు ఉపయోగపడవచ్చునుగానీ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగలవా? దేశ స్వావలంబన ఎండమావిగానే మిగిలిపోతుందా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించదు. భారతీయుల డీఎన్‌ఏలో పొదుపు అంతర్భాగంగా ఉండేది. పొదుపు చేసుకోవడంతోపాటు కష్టపడి పనిచేయడం భారతీయుల లక్షణం. ఈ రెండు లక్షణాలే మన బలం కూడా! ప్రపంచీకరణ పుణ్యమా అని ఇప్పుడు వీటికి మనం దూరమయ్యాం. కేంద్ర, రాష్ర్టాల పాలకులు పోటీ పడి మరీ ప్రజలను వినిమయతత్వంలోకి నెట్టారు. దీంతో అప్పుచేసి పప్పు కూడు తినడానికి ప్రజలు అలవాటుపడ్డారు. తోటి వాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకునేలా చేశారు. ఫలితంగా ఇప్పుడు మళ్లీ పొదుపు చేయండి మహాప్రభో అని ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి. పశ్చిమాసియాలో యుద్ధం జరగడమేమిటి? మనకు తిప్పలు రావడమేమిటి? అని ప్రశ్నించుకుంటే ఈ పరిస్థితికి మన రాజకీయ పార్టీలే ప్రధాన కారణం అన్న సమాధానం లభిస్తోంది. ఒకప్పుడు దేశంలో కరువు కాటకాలు ఏర్పడినా ప్రజలు ఆకలి చావులకు గురికాకుండా పని కల్పించడం ద్వారా ప్రభుత్వాలు ఆదుకునేవి. ఇప్పటిలా ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులను చేయలేదు. అప్పు చేయడాన్ని అవమానంగా భావించిన ప్రజలకు... అప్పు చేయడం నిత్యావసరంగా మార్చిన ఘనత రాజకీయ పార్టీలది కాదా? కన్జ్యూమరిజంను ఫ్యాషన్‌గా మార్చింది ఎవరు?


సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వాలు, మితిమీరిన వినిమయతత్వంతో ప్రజలు అప్పులపాలు అవడానికి పాలకులు కారణం కాదా? కూలీనాలీ చేసుకునే వారి చేతిలో కూడా రెండేసి సెల్‌ఫోన్లు అవసరమా? ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? జీవన ప్రమాణాలు పెరగడమంటే అప్పు చేసి పప్పు కూడు తినడమా? నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఉంటే సంక్షేమ పథకాల అవసరమేమిటి? ఉత్పాదక వ్యయం నుంచి అనుత్పాదక వ్యయంవైపు దేశంతో పాటు ప్రజలూ మళ్లడం వికాసం అవుతుందా? నిజంగా దేశం అభివృద్ధి చెంది ఉంటే మన రూపాయి విలువ నానాటికీ ఎందుకు పతనమవుతోంది? ఎగుమతులు పెంచుకోకుండా విచ్చలవిడిగా దిగుమతులను ప్రోత్సహించడం ఏమిటి? ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా రేపటి గురించి ఆలోచించకుండా అప్పులు చేయడం ఏమిటి? నిజమైన ధనవంతుడు ఎవరు అంటే అప్పులేని వాడని ఒకప్పుడు చెప్పుకొనేవారు. ఇప్పుడు ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత గొప్ప అన్న భావనను వ్యాపింపజేశారు. ప్రభుత్వాలు కూడా లక్షల కోట్ల అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఏమిటో తెలియదు. ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా విలాసాలకు అలవాటుపడేలా చేసింది ఎవరు? సంపాదనలో, సామర్థ్యంలో పోటీ ఉండాలి కానీ అప్పులు చేయడంలో పోటీ ఏమిటి? బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తూ ఎగవేస్తుండగా సామాన్య ప్రజలు మాత్రం అప్పుల నుంచి బయటపడేందుకు అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతున్నారు. మన దేశానికి మానవ వనరులే అతి పెద్ద ఆస్తి అని గర్వంగా చెప్పుకొనేవాళ్లం. ఇప్పుడు ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు వినిమయతత్వం పెంచడం వల్ల మానవ వనరులు నిర్వీర్యమయ్యాయి. దీంతో పనులు దొరకని పరిస్థితి నుంచి పనిచేసే వాళ్లు దొరకని పరిస్థితికి చేరుకున్నాం. మన దేశానికి అసలైన ప్రమాదం పనులు చేయడానికి మనుషులు దొరకని పరిస్థితుల వల్ల ఏర్పడనుంది.


పొదుపు... అదుపు

ప్రధానమంత్రి చెబుతున్న పొదుపు విషయానికి వద్దాం! బంగారం కొనుగోళ్లు ఒకప్పుడు తక్కువగా ఉండేవి. మహిళలు పొదుపు చేయడం ద్వారా దాచుకున్న డబ్బుతో బంగారం కొనుక్కొనేవారు. కాసు బంగారం కొనాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించేవారు. ఇప్పుడు బంగారం కొనడానికి కూడా అప్పులు దొరుకుతున్నాయి. ఏమీ తోచకపోయినా నగల దుకాణానికి వెళుతున్నారు. బంగారం విషయంలోనే కాదు– ఇంట్లో నిత్యావసరాల వినియోగంలోనూ దుబారా అధికం అయింది. సూపర్‌ బజార్లకు వెళ్లినవాళ్లు అవసరానికి మించి కొనేలా ప్యాకేజింగ్‌ చేస్తున్నారు. ఆహారాన్ని కూడా దుబారా చేస్తున్నాం. స్విగ్గీ, జొమాటో వంటి డోర్‌ డెలివరీ వ్యవస్థలు వచ్చిన తర్వాత అవసరానికి మించి ఆర్డర్లు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్డర్లు ఇంటికి చేరేసరికి మనసు మార్చుకొని వచ్చిన వాటిని పక్కన పడేస్తున్నారు. చమురు వాడకం విషయమే తీసుకుందాం! ఒకప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లలో ఇన్ని వాహనాలు ఉండేవి కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సైతం మూడు వాహనాలే వినియోగించేవారు. వారి భద్రతను నలుగురైదుగురు సిబ్బంది మాత్రమే చూసేవారు. ఇప్పుడు పదుల సంఖ్యలో వాహనాలను కాన్వాయ్‌లో చేర్చారు. ముఖ్యమంత్రుల బహిరంగ సభలు, సమావేశాలకు వందలమంది పోలీసులను నియమిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులకు అదనపు భద్రత అవసరమయ్యేది. ఇప్పుడు నక్సలైట్లు దాదాపుగా అంతరించిపోయారు కదా? అయినా భద్రతను కుదించడం లేదు. ఇప్పుడు ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు తాము వినియోగించే వాహనాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త అతి ప్రదర్శిస్తారు. ప్రధాని మోదీపై ప్రస్తుతం ఉన్న మోజు వల్ల కాబోలు ఆయన ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే పొదుపు చర్యలపై చర్చలు జరిపారు. అతిగా స్పందిస్తే విమర్శలపాలు అవుతామన్న వాస్తవాన్ని ఆయన విస్మరించారు. ప్రభుత్వాలలో దుబారా సర్వసాధారణం అయింది. ముఖ్యమంత్రులు పాల్గొనే కార్యక్రమాలకు కూడా అలంకరణ అవసరమా? అని ఆలోచించకుండా మన సొమ్ము కాదు కదా అని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుంటారు. ఖర్చుల నియంత్రణ, పొదుపు అనేది ప్రజలకు ఆదర్శంగా ఉండాలి.


గతంలో ముఖ్యమంత్రులు సాధారణ ప్రజలవలె ప్రయాణికుల విమానాల్లో వెళ్లేవారు. ఇప్పుడు ప్రత్యేక విమానాలను వాడుతున్నారు. మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా చీటికీ మాటికీ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాడటం వేరు! ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకు ప్రత్యేక విమానాల అవసరం ఏమిటి? అంతెందుకూ, ఇదివరకు మంత్రులు రైళ్లలో ప్రయాణించేవారు. ఇప్పుడు ఎంతమంది రైలెక్కుతున్నారు? అయితే విమానం లేదా భారీ కాన్వాయ్‌లు వేసుకొని తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, అధికారులు వారాంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కోసం అమరావతి, హైదరాబాద్‌, బెంగళూరులో ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఉంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభుత్వాలలో దుబారాకు అంతే ఉండదు.


మండుతున్న ఇంధనం

ఇంధనం వాడకంలో పొదుపు పాటించాలని ఇప్పుడు చెబుతున్నారుగానీ దేశంలో ఇంధన వినియోగం అమాంతం పెరిగిపోవడానికి కారణం ఎవరు? మన దేశంలో వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్రాండెడ్‌ కార్ల ఉత్పత్తిదారులు తమ షోరూంలను మన దేశంలో తెరుస్తున్నారు. ప్రస్తుత ధోరణి కొనసాగితే మన దేశ జనాభాతో వాహనాల సంఖ్య కూడా పోటీ పడుతుంది. ఈ కారణంగా దేశంలో చమురు వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరిగి మన రూపాయి బలహీనపడుతోంది. ఒకప్పుడు ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అప్పు పుడుతోంది కదా అని అలా వెళ్లి ఇలా బండి కొనుగోలు చేస్తున్నారు. వెహికల్‌ లోన్‌ ఇస్తాం, ఏసీ కొనాలనుకుంటున్నారా? మీ ఇంట్లో రిఫ్రిజరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌ వంటివి లేవా? అయితే అప్పు ఇవ్వడానికి మేం రెడీ! అని బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తుంటారు. దీంతో కొని పడేస్తే పోలా అని ప్రజలు మొగ్గుచూపుతున్నారు. వాహనం కొనడానికి అప్పు దొరుకుతోంది కనుక దాన్ని నడపడానికి ఎంత ఖర్చవుతుందని లెక్కలు వేసుకోవడం లేదు. ఆదాయ–వ్యయాలకు పొంతన లేకున్నా... దాని నుంచి బయటపడలేని పరిస్థితి ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడింది. ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు ఖర్చులు పెంచుకుంటూ పోవడం వల్ల ఎంత జీతం వస్తున్నా చాలని పరిస్థితి. ఈఎంఐలకు సరిపడా జీతం రావడం లేదన్న అసంతృప్తి ఉద్యోగులలో ఉంటోంది.


పొరుగు వాడి ముందు ఎక్కడా తగ్గకూడదన్న ధోరణి ఏర్పడటంతో ఖర్చుల విషయంలో పోటీపడుతున్నారు. గతంలో ఆదాయాన్నిబట్టి ఇంటి బడ్జెట్‌ ఉండేది. ప్రభుత్వాలు కూడా ఆదాయానికి అనుగుణంగానే బడ్జెట్‌లకు రూపకల్పన చేసేవి. ఇప్పుడు ఇటు ప్రజలు, అటు పాలకులు కూడా అప్పులను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్‌లను రూపొందించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఏ అనర్థాలకు దారితీస్తుందో అని ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఆలోచించడం లేదు. అప్పు తీర్చడం ఎలా? అని ఆలోచించకుండా ఇప్పుడు అప్పు పుడుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నాం. హైదరాబాద్‌లో ఔటర్‌ రింగు రోడ్డుపై కూడా సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే పరిస్థితి ఏర్పడుతోందంటే వాహనాల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అలా వెళ్లి ఇలా వాహనంతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది మరి. వినిమయతత్వం అనే విష వలయంలో ఇప్పుడు మన దేశం చిక్కుకుంది. అతి వినియోగం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతోంది. దీంతో సంక్షేమ పథకాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి నెలనెలా సమకూరే జీఎస్టీ ఆదాయం పెరుగుతోంది అని మురిసిపోతున్నాం. అయితే, ఈ మెరుపుల వెనుక అప్పులు పెరుగుతూ ఉన్నాయని మరచిపోతున్నాం. ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఈ అప్పుల విష వలయంలో చిక్కుకోవడంవల్ల సంపాదించే కుటుంబ పెద్ద అకాల మరణంపాలైతే ఆయా కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.


ఇవేం ‘పనులు’...

ప్రభుత్వాల విషయానికి వస్తే... పాలకులు వస్తూ పోతుంటారు. వారికి వ్యక్తిగతంగా పోయేది ఏమీ ఉండదు. ప్రజలను పొదుపు నుంచి దూరం చేసిన రాజకీయ పార్టీలు సంక్షేమం పేరిట ప్రజలను మూకుమ్మడిగా సోమరిపోతులుగా మార్చివేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని పన్నులు కడుతుండగా... ఆ పన్నుల ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంతోపాటు మద్యం విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయడం హైలెట్‌! ప్రజలను సోమరులుగా చెయ్యడమే కాకుండా వారిని తాగుబోతులుగా మార్చివేస్తున్న పాపం రాజకీయ పార్టీలది కాదా? సాధారణంగా మనం నిద్ర లేచిన తర్వాత ఏ కాఫీయో టీనో తాగుతాం. ఇప్పుడు తెలుగునాట ఉదయాన్నే మందు తాగేవారు కూడా కనిపిస్తున్నారు. రాత్రి పొద్దు పోయేవరకూ ఆ మత్తులోనే ఉంటున్నారు. ఈ పరిణామాన్ని అభివృద్ధి చెందడం అని అందామా? తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని లారీల్లోకి ఎక్కించడానికి హమాలీలు లభించడం లేదు. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. పండించిన పంట కల్లాల్లోనే ఉండిపోతోంది. గతంలో ఉత్తరాది రాష్ర్టాల నుంచి హమాలీ పనులు చేసే వాళ్లు వచ్చేవారు. ఇప్పుడు వాళ్లు కూడా తగ్గిపోయారు. ఫలితంగా హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు అల్లాడిపోతున్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం గురించి గొప్పగా చెబుతోంది.


ఉపాధి లభించనప్పుడే కదా ఉపాధికి హామీ ఉండాలి? పని ఉన్నా చేయడానికి మనుషులే దొరకనప్పుడు ఉపాధికి హామీ ఏమిటి? ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా? ఈ పథకాన్ని వ్యవసాయంతో ముడిపెట్టి రైతులను ఆదుకుంటే రైతు భరోసా వంటి పథకాల అవసరం ఉండదు కదా? ఈ ధోరణుల పట్ల సమాజంలో అంతర్లీనంగా అలజడి ఉంది. ఎవరో కష్టపడి సంపాదించి పన్నులు కడుతుంటే ఇంకెవరో దానధర్మాలు చేయడం ఏమిటి? అది కూడా అపాత్రదానం! ఈ దేశంలో అంబానీ, అదానీ వంటి వారికి వ్యాపారాల అభివృద్ధికి బ్యాంకులు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తాయి. అది కూడా అతి తక్కువ వడ్డీకి. మరి బ్యాంకులకు లాభాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించుకుంటే, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు ఉన్నారు కదా! ఈ వర్గాల నుంచే అధిక శాతం వడ్డీ వసూలు చేస్తుంటారు. ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులకు జనాన్ని అలవాటు చేశారు కనుక ప్రస్తుతానికి బ్యాంకులు లాభాల పంట పండిస్తున్నాయి.


మోదీ ఏం చేస్తారో!

ప్రధానమంత్రి చెబుతున్న పొదుపు విషయానికి మళ్లీ వద్దాం! పొదుపు ఎక్కడ నుంచి ప్రారంభించాలి? ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పొదుపు చర్యల వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కగలమా? ఆర్థిక స్వావలంబన నుంచి దేశాన్ని, ప్రజలను దూరం చేసి ఇప్పుడు పొదుపు చేయమంటే సాధ్యమేనా? ఒకప్పుడు రాష్ర్టాలలో చిన్న మొత్తాల పొదుపు సంస్థలు ఉండేవి. ప్రజలను పొదుపు వైపు ప్రోత్సహించేవారు. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండేవి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా ఫోన్లు చేసి రెచ్చగొడుతూ అప్పులిస్తూ పొదుపు చేయమంటే ఎలా? మీరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు, సంక్షేమం పేరిట ప్రతి నెలా డబ్బు పంచుతాం అని చెబుతూ ఉత్పత్తి పెంచడం సాధ్యమేనా? శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రఖ్యాత కవి శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’లో అద్భుతంగా వివరించారు. ఆ శ్రమ సంస్కృతికి మనం దూరమవుతున్నాం. చైనా ఉత్పత్తులు ప్రపంచ దేశాలలో పోటీ పడటానికి కారణం ఏమిటో ఆలోచించాలి కదా? అక్కడ ఒక సగటు మనిషి చేసే ఉత్పత్తి మన దేశంలోకంటే రెండింతలు ఉంటుంది. ఈ కారణంగా అక్కడి ఉత్పత్తుల ధర తక్కువగా ఉంటోంది. మన అర్థరహితమైన సంక్షేమ పథకాల వల్ల పని సంస్కృతి మాయమవుతోంది. రాజకీయ పార్టీలు ఈ ప్రమాదాన్ని గుర్తించకుండా పొదుపు మాటలు చెప్పడంవల్ల ప్రయోజనం ఉండదు. ఆదాయంతో పొంతన లేకుండా అప్పులు చేసి ఖర్చు పెట్టడం వల్ల కుటుంబాలే కాదు– ప్రభుత్వాలు కూడా దివాలా తీస్తాయి. సంక్షేమ పథకాలను ప్రకటించడంలో రాజకీయ పార్టీలు పోటీపడటం వల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. తెలుగు రాష్ర్టాలే ఇందుకు నిదర్శనం. ఏ విషయంలోనైనా సమతూకం పాటించాలని అంటారు. అభివృద్ధి – సంక్షేమం విషయంలో ఈ సూత్రం వర్తించదా? ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి.


అధికారంలో ఉన్నవాళ్లు చేసే అప్పులను ఎవరు తీర్చాలి? ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో గ్రహిస్తున్నారా? ఉచితాలకు అలవాటుపడిన ప్రజలు పని సంస్కృతికి దూరం అవుతున్నారు కదా! రేపు ప్రభుత్వాలకు కూడా అప్పు పుట్టని పరిస్థితి ఎదురై ఉచితాలు కొనసాగించలేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటి? అంతిమంగా ఈ పరిస్థితి సమాజంలో అశాంతికి దారితీయదా? ప్రజలపై పన్నుల భారం పెంచుకుంటూ పోవడం మంచి ప్రభుత్వాలు చేసే పని కాదు కదా? ఇప్పుడు మన దేశంలో కనిపిస్తున్న మెరుపులు కూడా పైపై పూతలే. పరిస్థితి మేడిపండు చందంగా మారకముందే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలు మేల్కొనాలి. ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని చెప్పడం బాగానే ఉందికానీ ప్రభుత్వాలు కూడా దుబారా పథకాలకు స్వస్తి చెప్పాలి కదా! ఎన్నికల రాజసూయ యాగంలో తిరుగులేని శక్తిగా ఉంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ దిశగా ఆలోచించడం అవసరం. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా దుబారా ఖర్చులను నివారించగలిగితే ఆర్థిక స్వావలంబన మన చేతుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల పరిణామాలతో సంబంధం లేకుండా తలెత్తుకొని జీవించిన దేశం మనది. ఒకవైపు అభివృద్ధి చెందామని చెబుతూనే మరోవైపు అంతులేని సంక్షేమ పథకాలు దేనికి? ఈ రెండింటిలో ఏది నిజం? ఏది అవసరం? మొత్తంగా మన దేశ గమనాన్ని సమీక్షించి తగు నిర్ణయాలు అవి తాత్కాలికంగా కఠినంగా అనిపించినా తీసుకోవాల్సిన అవసరం లేదా? అత్యంత శక్తిమంతుడిగా అవతరించిన ప్రధాని మోదీ హయాంలోనే ఇవి జరగాలి. హిపోక్రసీకి దూరంగా అన్ని రాజకీయ పార్టీలను కట్టడిచేసే విధంగా కఠిన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని నిజమైన అభివృద్ధి బాట పట్టించగలిగితే ప్రధాని మోదీ శాశ్వతంగా కీర్తించబడతారు. ఈ దిశగా అడుగులు వెయ్యకుండా కేవలం ప్రకటనలు, హామీలకే పరిమితమైతే ప్రజల్లో విశ్వాసం ఏర్పడదు. అప్పు సంస్కృతి నుంచి దేశాన్ని, ప్రజలను దూరం చేయగలిగితే పశ్చిమాసియా వంటి యుద్ధ పరిస్థితులు ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. ఇప్పుడు మనకు కావాల్సింది సంకల్ప బలం మాత్రమే. అది ప్రధాని మోదీలో ఉంటుందనీ, ఉండాలనీ ఆశిద్దాం!

Updated Date - May 17 , 2026 | 01:32 AM