ఆనాటి ధన్‌ఖడ్ వెనుక అసలు కథ..
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:19 AM
భారతదేశ పురోభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు దేశంలో రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులు... ముఖ్యంగా అమెరికాలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్..
భారతదేశ పురోభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు దేశంలో రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులు... ముఖ్యంగా అమెరికాలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే కూడా తాజాగా ఇలాంటి ఆరోపణలే చేశారు. సాల్వే వంటి వారి వ్యాఖ్యలను, ఆరోపణలను తేలికగా తీసి పారేయకూడదు. మన దేశ అంతర్గత వ్యవహారాలలో విదేశీ శక్తుల జోక్యంపై ఆరోపణలు వినిపించడం కొత్త కాదు. దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎలాంటి అలజడి ఏర్పడినా, వాటి వెనుక విదేశీ శక్తుల పాత్ర ఉందని ఆరోపించేవారు. భారతదేశం బలమైన శక్తిగా ఎదగడాన్ని అమెరికా వంటి దేశాలు సహజంగానే జీర్ణించుకోలేవు. తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతూ, తమ పెద్దన్న పాత్రను భారతదేశం అంగీకరించాలని అమెరికా కోరుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో హరీశ్ సాల్వే వంటి వారి ఆరోపణలను కొట్టిపారేయలేము. ‘సర్’కు వ్యతిరేకంగా ఓట్ చోరీ పేరిట కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలకు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కొంతకాలం క్రితం శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో జెన్–జీ ఉద్యమాలు రావడం, ప్రభుత్వాలు పతనం కావడం తెలిసిందే. జనాభా పరంగా చైనాతో పోటీపడుతూ ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఈ కారణంగా భారతదేశంలో తమకు అనుకూల ప్రభుత్వాలు ఉండాలని, ప్రభుత్వాల విధానాలు తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని విదేశీ శక్తులు కోరుకోవడం సహజం.
ధన్‌ఖడ్ రాజీనామా వెనుక...
హరీశ్ సాల్వే ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఒక ఏడాది వెనక్కు వెళ్లాలి. అప్పుడు భారత ఉప రాష్ట్రపతిగా ఉండిన జగదీప్ ధన్‌ఖడ్ ఉన్నపళంగా రాజీనామా ఎందుకు చేశారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? విదేశీ శక్తులతో ఆయన చేతులు కలిపారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరచి ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసే ప్రయత్నాలు జరిగాయా? ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే తెర వెనుక ఏం జరిగిందో తెలుస్తుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌వర్మను అభిశంసించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన విభేదాల వల్ల జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారని అప్పట్లో అందరూ భావించారు. సదరు ప్రచారాన్ని మీడియా కూడా నమ్మింది. అయితే తెర వెనుక జరిగింది మరొకటి అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని బలహీనపరచడానికి అమెరికాలోని కొన్ని శక్తులు ప్రయత్నించాయి. తమ ప్రయత్నాలకు ఊతం ఇచ్చి ముందుకు తీసుకువెళ్లేది ఎవరా? అని ఆరా తీశారు. ఈ క్రమంలో అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, అనిల్ అంబానీలను ఆ శక్తులు ఎంచుకున్నాయట! ఈ ఇరువురూ ప్రధాని మోదీని ఏం చేయగలరు? అన్న ప్రశ్న రావడం సహజం. 2024 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ లభించలేదు. దీంతో బిహార్‌లోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నరేంద్ర మోదీకి ఏర్పడింది.
టీడీపీ, జేడీయూతోపాటు చిరాగ్ పాశ్వాన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వాళ్లు సహకరిస్తే ప్రధాని మోదీ ప్రభుత్వం పతనం అవుతుందని, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయవచ్చునని ఆ శక్తులు అంచనాకు వచ్చాయి. పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అని ఆరా తీసిన సదరు శక్తులకు అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కనిపించారట! రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఆయన అయితే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపడం సులువు అవుతుందన్న నిర్ణయానికి వచ్చిన విదేశీ శక్తులు ఆయనను సంప్రదించగా ఓకే చెప్పారట. ధన్‌ఖడ్‌ను కలిసే ముందు ఆయా రాజకీయ పార్టీలతో ప్రాథమిక చర్చలు జరిపే బాధ్యతను అనిల్ అంబానీకి అప్పగించారట! అయితే, అనిల్ అంబానీ కొంత మేరకు మాత్రమే తన పాత్రను పోషించగలిగారు. వ్యాపార పరంగా దెబ్బతిన్న అనిల్ అంబానీని ప్రధాన రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకోలేదు. అనిల్ అంబానీ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. జేడీయూ అధినేత నితీశ్‌కుమార్, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను మాత్రమే అనిల్ అంబానీ కలుసుకోగలిగారని చెబుతున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న జేడీయూ నేత నితీశ్‌కుమార్ కూడా అనిల్ అంబానీ ప్రతిపాదనలను సీరియస్‌గా తీసుకోలేదు. ఇక కేజ్రీవాల్ వంటి వారు జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసినట్టు అప్పట్లోనే వార్తలొచ్చాయి. అమెరికాలోని శక్తులు మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోతున్నాయని ఉప్పందుకున్న కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మరింత సమాచార సేకరణలో పడ్డాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏదో జరగబోతోందని తెలుసుకున్న చంద్రబాబు, నితీశ్‌కుమార్, చిరాగ్ పాశ్వాన్ వంటివారు విషయాన్ని ప్రధాని మోదీని కలిసి వివరించినట్టు తెలిసింది. అప్పటికే నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించుకున్న ప్రధాని మోదీ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎవరెవరు కలుసుకున్నారో ఆరా తీశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి లోకేశ్‌ను కూడా ఆరా తీశారు. తాను అప్పుడే కాదు – ఎప్పుడూ జగదీప్ ధన్‌ఖడ్‌ను కలవలేదని ఆయన కేంద్ర పెద్దలకు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరి సహకారం తీసుకోవాలని అనుకున్నారో వారందరూ తెర వెనుక జరుగుతున్న కుట్రల గురించి ప్రధాని మోదీకి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధన్‌ఖడ్, అనిల్ అంబానీ పాత్రను కేంద్ర పెద్దలు ధ్రువీకరించుకున్నారు. ధన్‌ఖడ్‌పై ఉన్న పాత ఈడీ కేసులను తిరగదోడారు. అనిల్ అంబానీపై ఈడీ విచారణ వేగవంతం కావడం అప్పుడే జరిగింది. దీని వెనుక ఇంత కథ నడిచిన విషయం బయటి ప్రపంచానికి తెలియదు. రొటీన్‌గా ఈడీ విచారణ జరుగుతోందని మాత్రమే అంతా భావించారు. ప్రధానికి నమ్మకమైన మిత్రులుగా ఉన్న చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ను కదపడం ద్వారా ఈ కుట్ర వెనుక ఉన్నవారు పప్పులో కాలేశారు. తెర వెనుక జరిగిన దాన్ని రూఢీ చేసుకున్న తర్వాత కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయవలసిందిగా జగదీప్ ధన్‌ఖడ్‌కు హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలకు అనుగుణంగా రాజీనామా చేసి వెళ్లిపోకపోతే ఏం జరుగుతుందో కూడా ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఖిన్నుడైన ధన్‌ఖడ్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా రాష్ట్రపతి భవన్‌కు నేరుగా వెళ్లి రాజీనామా సమర్పించి అధికారిక వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన జరిగి ఏడాది దాటుతున్నా ఉప రాష్ట్రపతి అంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారో అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు ధన్‌ఖడ్ గానీ ఇప్పటికీ చెప్పలేదు. తెరవెనుక ఏం జరిగిందో కొద్ది మందికే తెలుసు. అలా తెలిసిన వాళ్లు ఇన్నాళ్లకు అసలు సంగతి నాకు చెప్పారు.
‘కాక్రోచ్’ పుట్టుక వెనుక...
ఇప్పుడు హరీశ్ సాల్వే వంటి వారి ఆరోపణలతో విదేశీ శక్తుల పాత్ర మళ్లీ చర్చనీయాంశం అయింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ తొలుత ఆందోళన చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం కూడా కాకతాళీయంగా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు అని యథాలాపంగా వాడిన పదం ఆ పార్టీ ఆవిర్భావానికి కారణం అవడం ఆశ్చర్యం కలిగించక మానదు. అప్పుడు అమెరికాలో ఉన్న అభిజీత్ దీప్కే సరదాగానో, సీరియస్‌గానో తెలియదుగానీ బొద్దింకల బొమ్మలతో కాక్రోచ్ జనతా పార్టీ పోస్టులు పెట్టడంతో గంటలు, రోజుల వ్యవధిలోనే వాటి వ్యూస్ కోట్ల సంఖ్యకు చేరాయి. ఇంత భారీ సంఖ్యలో వ్యూస్ రావడం వెనుక పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయన్న వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి. నిజానికి ఒకప్పుడు ఆప్‌లో పనిచేసిన అభిజీత్ దీప్కే గురించి ఎక్కువ మందికి తెలియదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొంత మందికి రాత్రికి రాత్రే ప్రాచుర్యం లభిస్తుంది. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు దీప్కే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో క్రెడిట్ కాక్రోచ్ జనతా పార్టీకే దక్కింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు వెనకబడ్డాయి. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయమై ‘ఇండి’ కూటమి ముందు వరుసలో ఉండి ఆందోళన చేస్తోంది. నీట్ వ్యవహారానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆందోళన విషయంలో కఠినమైన వైఖరితో వ్యవహరిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు దిగకుండా నిర్బంధాలు విధించారు. ఆ పార్టీకి చెందిన ముఖ్యులను అరెస్టు చేశారు. దీంతో ఓట్ చోరీ వ్యతిరేక ఉద్యమంలో సీజేపీ పాత్ర పరిమితంగానే ఉంది. అయితే, సీజేపీ లేని కొరత కనిపించకుండా మొత్తం షోను రాహుల్‌గాంధీ హైజాక్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో మొదలైన కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఇండి’ కూటమి ఆందోళనలకు సీజేపీ సంఘీభావం ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. సీజేపీ అవసరం లేకుండా కూటమి నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ రాహుల్‌గాంధీకి ఇటీవలి వరకు మీడియాలో అంతగా ప్రచారం లభించేది కాదు. ఓట్ చోరీ గురించి రాహుల్‌గాంధీ గతంలో ఎంతగా గొంతు చించుకున్నప్పటికీ జాతీయ మీడియాలో ప్రాధాన్యం లభించలేదు. ఇన్నాళ్లకు రాహుల్‌గాంధీ ఆందోళనలు ప్రధాన జాతీయ పత్రికల్లో పతాక శీర్షికన కనిపిస్తున్నాయి. మీడియా వైఖరిలో ఈ మార్పు రావడానికి కారణమైన రాహుల్‌గాంధీని అభినందించాల్సిందే.

ఇందిర నోట అదే మాట...
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీధి పోరాటాలు జరగడం కొత్త కాదు. దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జనతా పార్టీ పురుడుపోసుకున్న సమయంలో కూడా ఇలాంటి ఆందోళనలు మరింత విస్తృతంగా జరిగాయి. అప్పట్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగాయి. నాటి ఆందోళనల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆరోపించేవారు. ‘పార్లమెంటులో తేల్చుకోవాల్సిన విషయాలను వీధుల్లోకి తీసుకురావడమేమిటి? ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించాలని మొరార్జీదేశాయ్ వంటి వారు పిలుపు ఇవ్వడమేమిటి?’ అని అప్పట్లో ఇందిరాగాంధీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. నాటి ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇప్పుడు నిర్బంధకాండ అమలు చేస్తున్నారని నేడు అదే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒప్పు అయినది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తప్పు అవుతుందన్న నానుడికి ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. అయితే జగదీప్ ధన్‌ఖడ్ ఉదంతంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా విదేశీ శక్తులు... ముఖ్యంగా అమెరికా పాత్ర ఏమైనా ఉందా? అన్న అనుమానాలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి. విదేశీ శక్తులతో ధన్‌ఖడ్ చేతులు కలిపింది నిజమా? కాదా? అన్నది స్పష్టమైతేగానీ ఇప్పుడు సీజేపీకి విదేశీ నిధులు అందుతున్నాయన్న ఆరోపణలకు విశ్వసనీయత చేకూరదు. ధన్‌ఖడ్‌తో ఉన్నపళంగా ఎందుకు రాజీనామా చేయించారో కేంద్ర పెద్దలు ఇప్పటికైనా ప్రజలకు తెలియజేయాలి. ఆయన విదేశీ శక్తులతో చేతులు కలపడం నిజమని తేలితే... దానివల్ల కేంద్ర పెద్దలకు రాజకీయంగా ప్రయోజనమే కలుగుతుంది కదా? అది కాకుండా మరేదో కారణం ఉండి ఉంటే అదేంటో తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇందిరాగాంధీ విషయంలో విదేశీ హస్తం అనేది హాస్యాస్పదంగా మారింది. ఇప్పుడా పరిస్థితి లేదు. చుట్టూ ఉన్న దేశాల్లో అలజడి సృష్టించి ప్రభుత్వాల మార్పునకు కారకులై, ఆయా దేశాలను మనకు దూరం చేసిన వాళ్లు... ఇప్పుడు హరీశ్ సాల్వే ఆరోపిస్తున్నట్టుగా చేయరన్న గ్యారెంటీ ఏముంది? ఏది ఏమైనా ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి నిజాలు నిగ్గు తేలాల్సిందే. రాహుల్‌గాంధీ ప్రభృతులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడాన్ని అభినందించాలి. ఓట్ చోరీ అంశంపై సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లాలని ‘ఇండి’ కూటమి నేతలు భావించడం సమర్థనీయం కాదు. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయడానికి బలప్రదర్శన అవసరం లేదు. అలా చేయడం న్యాయస్థానాలను ప్రభావితం చేయాలనుకోవడమే అవుతుంది. ఈ మంచి చెడులను కాసేపు అటుంచితే, ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఆందోళనలకు తాత్కాలిక విరామం లభించవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా అసలేం జరిగిందో సుప్రీంకోర్టు విచారణలో స్పష్టమవుతుంది. నిజంగానే ఓట్ చోరీ జరిగి ఉంటే అందుకు కారకులైన వారిని కఠినాతి కఠినంగా న్యాయస్థానం శిక్షించాలి. ఓట్ చోరీ నిజం కాని పక్షంలో ఆందోళనలు చేసిన వారందరూ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి.
జగన్ పిడకలవేట...
ఒక్కటి మాత్రం నిజం! కాక్రోచ్ జనతా పార్టీ వంటి సంస్థలపై జెన్–జీ తరానికి నమ్మకం ఏర్పడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీకి నైతిక బలం చేకూరింది. యువతలో ఆత్మస్థైర్యం ఏర్పడింది. అయితే, రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాము కూడా బొద్దింకలమని తాజాగా ప్రకటించుకున్నారు. ఇందుకు స్పందనగా అభిజీత్ దీప్కే జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జగన్‌రెడ్డిని అవినీతిపరుడు అన్నవాళ్లే ఇప్పుడు జెన్–జీ తరం ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్‌రెడ్డి ప్రకటనను స్వాగతించడం ఏమిటో? ఈ దెబ్బతో కాక్రోచ్ జనతా పార్టీ కూడా మూల్యం చెల్లించుకోవలసి రావొచ్చు. రాజకీయాలకు దూరంగా ఉన్నంత వరకే ఏ ఉద్యమానికైనా ప్రజల మద్దతు లభిస్తుంది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా జగన్‌రెడ్డి వంటి వారు చేయి కలిపినా, గొంతు కలిపినా ఆ ఉద్యమాల విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు జెన్–జీకి అవసరమా? నిజానికి రాజకీయ నాయకులకు సంబంధించిన అవినీతి కేసులలో విచారణ వేగవంతం కావాలని సీజేపీ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టాలి. న్యాయ సమీక్షలో జగన్‌రెడ్డి నిర్దోషి అని తేలితే అప్పుడు ఆయన బొద్దింకలకు మద్దతు ఇచ్చినా లేదా సీజేపీ ఆయన మద్దతు తీసుకున్నా ఎవరికీ ఆక్షేపణ ఉండదు. అదటుంచితే జగన్‌రెడ్డి ఇంత హఠాత్తుగా బొద్దింక రూపం సంతరించుకోవాలని ఎందుకనుకున్నారు? ఎన్నికల కమిషన్‌ను ఆయన నర్మగర్భంగా విమర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటి? భారతీయ జనతా పార్టీకీ ఆయనకూ చెడిందా? మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగానే జగన్‌రెడ్డి క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరవుతారా? అదే జరిగితే అవినీతి కేసుల పరిస్థితి ఏమిటి? కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురికారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అవినీతి కేసులకు సంబంధించి ఈడీ కేసులను కూడా రోజువారీ విచారించాలని న్యాయస్థానం తాజాగా నిర్ణయించడం ఈ ఉదంతంలో కీలక పరిణామం. సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులలో రోజువారీ విచారణ జరిగితే జగన్‌రెడ్డికి తిప్పలు తప్పవు. అవినీతి కేసుల నుంచి ఇకపై తనకు రక్షణ లభించదన్న అభిప్రాయానికి జగన్‌రెడ్డి వచ్చినట్టున్నారు. అందుకే రాజకీయంగా నైతిక మద్దతు కోసం బొద్దింకగా మారి ఇతర బొద్దింకలను ముద్దాడాలని అనుకుంటున్నట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినా ఆయనకు ఒనగూరే ప్రయోజనం కనిపించడం లేదు. ఆ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే జగన్ అండ్ కో పై విచారణ జరిపి సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
తన హయాంలో దాఖలైన కేసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలా వ్యవహరించగలదు? ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి రక్షణ లభించని పక్షంలో తన పరిస్థితి ఏమిటి? అన్న ఉద్దేశంతోనే జగన్ తాజా ట్వీట్ చేసి ఉంటారు. జగన్‌రెడ్డి వంటి వారి మద్దతు వల్ల సీజేపీకి ఉన్న విశ్వసనీయత పోదా? అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. జగన్ విషయంలో సాధారణ రాజకీయ పార్టీ తరహాలోనే కాక్రోచ్ జనతా పార్టీ స్పందించడం ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి చర్యల వల్లనే ఆయా ఉద్యమాలు, వాటికి నాయకత్వం వహిస్తున్న వారిపై ప్రజలకు విశ్వాసం పోతుంది. ఇప్పటికే విదేశీ నిధులు అందుతున్నాయని సీజేపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు జగన్‌రెడ్డి వంటి వారిని పక్కన చేర్చుకుంటే వారి ఉద్యమాలకు అవినీతి సొమ్ము అందుతోందన్న ఆరోపణలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అదే జరిగితే సీజేపీని నలిపేయడం ప్రధాని నరేంద్ర మోదీకి చిటికెలో పని. తస్మాత్ జాగ్రత్త!
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News