రెండు దశాబ్దాలకు పథకం!
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:17 AM
దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోందా? లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఉభయ తెలుగు రాష్ర్టాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగబోతున్నదా? 2029 ఎన్నికల నాటికి..
దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోందా? లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఉభయ తెలుగు రాష్ర్టాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగబోతున్నదా? 2029 ఎన్నికల నాటికి ఈ పెంపు ప్రక్రియ పూర్తి అవుతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఇండీ కూటమి శతవిధాలా ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కృతనిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపునకు ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు కూడా సుముఖంగా లేనందున జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని రాష్ర్టాలలోనూ 50 శాతం సీట్లను పెంచాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అయితే ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం. నియోజకవర్గాల పెంపు, మహిళల రిజర్వేషన్లు యథాతథంగా ఆమోదం పొందాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ప్రకటించాలి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం మోదీ ప్రభుత్వం ఈ దిశగా చేసిన ప్రయత్నం విఫలమైంది. మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు సమకూరని కారణంగా బిల్లు వీగిపోయింది. ఆ సమయంలో జెన్–జీ ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలో ఉన్నందున మోదీ ప్రభుత్వం పట్టుదలకు పోకుండా పార్లమెంటు సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా వాయిదా వేసి, మూడింట రెండు వంతుల మెజారిటీ సమకూర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. తెర వెనుక ప్రయత్నాలు ఫలించడంతో ఇండీ కూటమిలోని పార్టీలు చీలిక పేలికలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభించి సంబంధిత బిల్లు ఆమోదం పొందడం కోసం కేంద్రం రంగం సిద్ధం చేసుకుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లులు వీగిపోవాలంటే 180 మందికి పైగా సభ్యుల మద్దతు అవసరం. ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు చీలిపోవడం, డీఎంకే పార్టీ కాంగ్రెస్‌కు దూరమవడంతో బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య 150కి మించదన్న అభిప్రాయం ఉంది. ఇదే అదనుగా భావిస్తున్న మోదీ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. నియోజకవర్గాల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకంత పట్టుదలగా ఉంది? అదే సమయంలో బిల్లులను అడ్డుకోవాలని ఇండీ కూటమి... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు భావిస్తోంది? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని రాష్ర్టాలలో ఎంపీ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఎవరికీ నష్టం జరగదు అన్న వాదన ఉంది. ఇది నిజం కూడా! జనాభా ప్రాతిపదికన అయితే దక్షిణాది రాష్ర్టాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తంకావడంతో కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి అన్ని రాష్ర్టాలలో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లులో సవరణ ప్రతిపాదించడానికి సిద్ధపడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మేరకు పార్లమెంటులో ప్రకటించారు. అయినా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బిల్లును వ్యతిరేకించింది. తాము బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఇండీ కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడానికి కారణం లేకపోలేదు. నియోజకవర్గాల పెంపు జరగాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ ప్రక్రియను పాలక పక్షాలు తమకు అనుకూలంగా మలచుకోవడం సహజం.
2009 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో కొంత భాగాన్ని ఇతర నియోజకవర్గాలలో కలిపేశారు. అలా చేయడం ద్వారా 2009 ఎన్నికల్లో పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన అన్ని సందర్భాలలో ఇదే విధంగా జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొంత కాలం క్రితం అసోంలో లోక్‌సభ నియోజకవర్గాలను ప్రత్యేకంగా పునర్విభజన చేశారు. నాటి పునర్విభజనను భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మలచుకుంది. సమీప భవిష్యత్తులో అసోంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోలేని విధంగా నియోజకవర్గాల రూపురేఖలను మార్చివేశారు. అసోంలోని ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం ఇందుకు నిదర్శనం. ఆ రాష్ట్రంలోని మెజారిటీ ముస్లింలు అందరినీ ఈ నియోజకవర్గంలో కలిపివేశారు. ఈ కారణంగా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ మెజారిటీ ఎంతో తెలుసా? ఏకంగా 10 లక్షలా 12 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. అయితే ఇంత మెజారిటీ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ సంతోషించలేని పరిస్థితి ఎదురైంది. అప్పటి వరకు వివిధ లోక్‌సభ నియోజకవర్గాలలో ఓటర్లుగా ఉండిన ముస్లింలను ధుబ్రి నియోజకవర్గంలో కలపడం వల్ల మెజారిటీ విషయంలో రికార్డులు బద్దలు కొట్టినప్పటికీ కాంగ్రెస్‌కు దక్కాల్సిన మరో ఆరు లోక్‌సభ సీట్లలో పార్టీ ఓడిపోయింది. ‘సర్’కు వ్యతిరేకంగా ఓట్ చోరీ అంటూ పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అసోంలో జరిగిన పునర్విభజనను పట్టించుకుని పోరాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదేమో? ధుబ్రి నియోజకవర్గం ఏర్పాటులో ఎదురైన చేదు అనుభవంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తంగా నియోజకవర్గాల పెంపు నిర్ణయాన్నే వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసలు అంతరంగం ఇదే! అయితే ఆ విషయాన్ని పార్టీ బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. ధుబ్రి నియోజకవర్గంలో అంత మెజారిటీ రావడానికి ముస్లింలు అందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేయడమే కారణం. ఈ విషయం బయటకు చెప్పుకొంటే కాంగ్రెస్ పార్టీపై ముస్లింల పార్టీ అనే ముద్ర పడే అవకాశం ఉంది. మెజారిటీ హిందువులు పార్టీకి దూరమవుతారు. జమ్మూ కశ్మీర్లో కొన్ని నియోజకవర్గాల పునర్విభజన కూడా ఇలాగే చేశారట. అసోం–జమ్మూ కశ్మీర్ ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలుచేస్తే సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదన్న భయం ఆ పార్టీ నాయకులను వేధిస్తోంది. ఈ కారణంగానే ఏదో ఒక అభ్యంతరం చెప్పి నియోజకవర్గాల పెంపును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం నియోజకవర్గాల సంఖ్యను పెంచడంతో పాటు పునర్విభజనను తమకు అనుకూలంగా చేపట్టి పార్టీ విజయావకాశాలను పటిష్ఠం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండీ కూటమిలోని పార్టీలను చీల్చి పార్లమెంటులో అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బీజేపీ పెద్దలు దాదాపుగా సఫలమయ్యారు. ఎలాగైనా బిల్లును అడ్డుకోవాలనుకుంటున్న ఇండీ కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 180కి పైగా సభ్యుల మద్దతును సమీకరించుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసింది. ఈ చర్య కారణంగా దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకే పార్టీ కాంగ్రెస్‌కు దూరమైంది.
27 మంది సభ్యులున్న డీఎంకే పార్టీ నియోజకవర్గాల పెంపు బిల్లుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇండీ కూటమిలోని బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటైన తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది. మెజారిటీ ఎంపీలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరో బలమైన సమాజ్‌వాదీ పార్టీ నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నందున నియోజకవర్గాల పెంపును ఆ పార్టీ వ్యతిరేకించ లేకపోతోంది. నియోజకవర్గాల పెంపును మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టినందున ఈ బిల్లును వ్యతిరేకిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు తమకు దూరమవుతారన్న భయం సమాజ్‌వాదీ పార్టీని వెంటాడుతోంది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న ముస్లింల ఓట్లను చీల్చడానికి అసదుద్దీన్ఒవైసీ రంగంలోకి దిగారు. ఆయన కాన్షీరాం వారసుడుగా చెప్పుకొంటున్న చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలిపి కొత్త కూటమికి పురుడు పోశారు. ఈ కూటమి సమాజ్‌వాదీ పార్టీకి వచ్చే ఓట్లను చీలుస్తుందన్న అభిప్రాయం ఉంది. ముస్లింలు, దళితుల ఓట్లను చీల్చడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పెద్దలు ప్రణాళిక రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లను దూరం చేసుకునే సాహసానికి సమాజ్‌వాదీ పార్టీ ఒడిగట్టలేదు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్న బీజేపీ పెద్దలు నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళలకు లోక్‌సభలో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం పొందడానికి రంగం సిద్ధం చేయనున్నారు.
మోదీ అష్టవర్ష ప్రణాళిక!
జెన్–జీ ఉద్యమాలు ఊపందుకోవడం, వామపక్ష భావజాలం ఉన్నవారు క్రియాశీలం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందన్న భావన ఏర్పడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయి పరిస్థితులు అలా ఉండబోవని చెబుతున్నారు. ఓట్ చోరీ ఉద్యమాన్ని మాత్రమే నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుండగా 2034 వరకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలపై దృష్టి కేంద్రీకరిస్తారని చెబుతున్నారు. 2029లోనే జమిలి ఎన్నికలకు బీజం వేస్తారని తెలుస్తోంది. లోక్‌సభతో పాటు ప్రధాన రాష్ర్టాల శాసనసభలకు 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. 2029 తర్వాత కాల పరిమితి ముగిసే రాష్ర్టాల శాసనసభలకు 2034ను దృష్టిలో పెట్టుకొని మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరుపుతారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ర్టాలకు 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ర్టాల శాసనసభల కాలపరిమితి 2032తో ముగుస్తుంది. జమిలి ఎన్నికల ప్రక్రియను 2034 నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నందున ఈ రాష్ర్టాలకు 2032లో ఎన్నికలు నిర్వహిస్తారు గానీ, ఆయా శాసనసభల కాల పరిమితిని 2034లో ముగిసేలా చట్టం రూపొందిస్తారు. మొత్తంమీద ఏ రాష్ర్టానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2034లో మాత్రం లోక్‌సభతో పాటు అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే జమిలి ఎన్నికల ప్రక్రియ 2034 నాటికి తుది దశకు చేరుతుంది. అదే జరిగితే 2034 తర్వాత చట్టసభల ఎన్నికలు జరిగిన వంద రోజుల్లో అన్ని రాష్ర్టాలలో స్థానిక సంస్థల ఎన్నికలూ పూర్తయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఏ రాష్ట్రంలో అయినా చట్టసభల సభ్యులు రాజీనామా చేసినా లేదా మరణించినా ఖాళీ అయ్యే ఆ స్థానాల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది. అలాంటి సందర్భాలలో ఖాళీ ఏర్పడిన స్థానంలో అంతకు ముందు ఏ పార్టీ గెలిచి ఉంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తినే నామినేట్ చేసేలా వెసులుబాటు కల్పిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద మరో ఎనిమిదేళ్ల రాజకీయాలకు ప్రధాని మోదీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలు తీసుకురావడం ద్వారా భారతీయ జనతా పార్టీ మరో రెండు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగేలా ప్రధాని మోదీ పావులు కదుపుతున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ప్రధాని మోదీ ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

తెలుగు రాష్ట్రాలు @ 2029
లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ర్టాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెంచబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుతారా? లేక లోక్‌సభ నియోజకవర్గాల వలె శాసనసభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచుతారా! అన్నది త్వరలో స్పష్టమవుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం పేర్కొన్న విధంగా అయితే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెరగనుండగా తెలంగాణలో 175 వరకు పెరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో పాటు పునర్విభజన కూడా జరుగుతుంది కనుక దీనిపై ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎంతో ఆశతో ఉన్నారు. 2009లో రాజశేఖర రెడ్డి వలె ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఇరువురు ముఖ్యమంత్రులు పావులు కదుపుతున్నారు. ప్రధాని మోదీ జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నందున తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు ఆలస్యంగా జరిగే అవకాశం లేకపోలేదు. 2028 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలను ఆరు నెలలు ముందుగానే జరిపించుకున్నారు. 2019లో జరగాల్సిన ఎన్నికలను 2018 చివరిలో జరిగేలా ముందుకు జరిపించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగితే రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయంతో కేసీఆర్ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం శాసనసభ ఎన్నికలపై పడకూడదన్న ఉద్దేశంతో అప్పట్లో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్య కేంద్రీకృతం అయినందున భారత రాష్ట్ర సమితి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీన్నిబట్టి కేసీఆర్ అంచనా సరైనదేనని భావించాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు జరిగే నష్టం ఏమీ ఉండదు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా అసెంబ్లీకి 2029లోనే ఎన్నికలు జరపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభ్యంతరం ఉండకపోవచ్చు. తెలంగాణ అసెంబ్లీకి 2029లోనే ఎన్నికలు జరుగుతాయని, ముఖ్యమంత్రిగా తనకు మరో ఆరు నెలలు అదనంగా అధికారంలో కొనసాగే అవకాశం లభిస్తుందని కొంత కాలం క్రితం రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టం కూడా త్వరలో ఆమోదం పొందితే తెలంగాణలోనూ 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. అయితే పొడిగించబోయే ఆరు నెలల కాలానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తారా? లేక గడువు ముగియగానే రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్నది ఇప్పుడే చెప్పలేం.
ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సహకరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. 2018లో ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిపించుకొని రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆ తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు సృష్టించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి ఆర్థిక వనరులు సమీకరించుకోలేని పరిస్థితి కల్పించారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా అండదండలు అందించారు. ఈ అనుభవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో కూడా తమ రాష్ట్రంతో పాటే 2029లోనే ఎన్నికలు జరగాలని కచ్చితంగా కోరుకుంటారు. ఏ కారణం వల్లనైనా ఆశించిన విధంగా తెలంగాణలో ఎన్నికలు ఆలస్యం కాకుండా 2028లోనే జరిగి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రం వద్ద తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణలో ఎన్నికలను ఆరు నెలలు ఆలస్యంగా జరిపేలా కృషి చేసే అవకాశం లేకపోలేదు. ఇరువురు ముఖ్యమంత్రుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ నిర్ణయం కేంద్రం చేతిలో ఉన్నందున ప్రధానమంత్రి ఏం చేయబోతున్నారు అనే దాన్నిబట్టి ఎన్నికలు ఎప్పుడు ఉండేది ఆధారపడి ఉంటుంది. ఈ పర్యాయమైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బలమైన ఆకాంక్ష భారతీయ జనతా పార్టీ పెద్దల్లో ఉంది. ఇందుకు అవసరమైన కార్యాచరణను వచ్చే ఏడాది నుంచి అమలుచేయబోతున్నారు. క్రమంగా బలపడుతున్న భారత రాష్ట్ర సమితిని ఎన్నికల నాటికి బలహీనపరచడం కోసం బీజేపీ పెద్దలు వ్యూహ రచనలో నిమగ్నమై ఉన్నారు. ఆరు నెలలు ఆలస్యంగా ఎన్నికలు జరిపిస్తే రాజకీయంగా తమకు ప్రయోజనకరం అని భావిస్తే బీజేపీ పెద్దలు అందుకు మొగ్గు చూపకుండా ఎలా ఉంటారు? లోక్‌సభతో పాటు శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరిగి నియోజకవర్గాల పునర్విభజన జరిగే పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత మేలు జరుగుతుంది. అదే జరిగితే ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. పునర్విభజనతో పాటు ఎన్నికలు 2029లోనే జరిగితే ప్రధాన పోటీ మళ్లీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్యే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంటుందని ఒక అంచనా. లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరగడం కేసీఆర్‌కు సహజంగానే ఇష్టం ఉండదు. అయితే ప్రస్తుతానికి ఆయన కేంద్ర పెద్దలను ప్రభావితం చేయగల స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లోనా లేక 2029లోనా అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆయన వైఖరి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
ఆర్కే
ఇవి కూడా చదవండి...
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్