Share News

చేసింది మహాపచారం!

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:14 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారా? తమ రాజకీయ ప్రత్యర్థులను సెంటిమెంటుతో కూడిన అంశాలపై టచ్‌ చేస్తూ తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం...

చేసింది మహాపచారం!

ఉభయ తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారా? తమ రాజకీయ ప్రత్యర్థులను సెంటిమెంటుతో కూడిన అంశాలపై టచ్‌ చేస్తూ తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం ధర్మానికి, న్యాయానికి ప్రతీకలమని చెప్పుకొంటున్న మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డిలపై నిందలు వేస్తున్నారా? నీతి నిజాయతీలకు తాము నిలువెత్తు నిదర్శనమని భావించుకునే ఈ ఇరువురితో పెట్టుకొని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అంత ఈజీగా లభించదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి– మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్య ముదురుతున్న జగడం విషయానికి వద్దాం. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్‌ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్‌ చేయడమేనని భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ఏమి చేసినా అది లోక కల్యాణం కోసమేనని బీఆర్‌ఎస్‌ నాయకులు బలంగా నమ్మారు. ప్రజలను నమ్మింపజూశారు. ఎందుకంటే కేసీఆర్‌, జగన్‌రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తారు. శిఖర సమానులుగా తాము భావించే కేసీఆర్‌కు విచారణల పేరిట నోటీసులు ఇచ్చే సాహసాన్ని అంగుష్ఠ మాత్రుడైన రేవంత్‌రెడ్డి చేయడం ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్‌ అనే వాస్తవాన్ని విస్మరించి ఆయననే విచారిస్తారా? ఎంత ధైర్యం అంటూ మండిపడుతున్నారు. ఆత్మగౌరవం కేసీఆర్‌ అండ్‌ కోకు మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్‌ అండ్‌ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? ఇదెక్కడి వింత వాదన అని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ను విచారణకు పిలవడం ఇదే మొదటిసారి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ గతంలో ఆయనను విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కిపడలేదు. కేసీఆర్‌కు సంఘీభావంగా రోడ్డు మీదకు రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిలించాల్సిన అవసరాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు గుర్తించారు. ఏ చిన్న అవకాశం లభించినా ఆ దిశగా ఎత్తులు వేశారు. ఇప్పుడు టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావలసిందిగా కేసీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావును ఇదే కేసు విషయమై ఇదివరకే విచారించారు. ఇప్పుడు కేసీఆర్‌ వంతు వచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంటును రగిలించకపోతే మునిగిపోతామని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ను టచ్‌ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్‌ చేయడమేననే పల్లవిని అందుకున్నారు.


కేసీఆర్‌ అంటే ఏమనుకుంటున్నారు? శిఖర సమానుడైన ఆయనను విచారణకు పిలవడం ఏమిటి? అని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. అయితే చట్టానికి ఎవరూ అతీతులు కారనుకోండి! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ అండ్‌ కో కూడా ఈ మాటలు వాడేవారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందా? లేదా? అంటే జరిగిందన్న విషయం బహిరంగ రహస్యం. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తప్పుబడుతూ కేసీఆర్‌ సొంత పత్రికలో శుక్రవారంనాడు ఒక కథనాన్ని ప్రచురించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసీఆర్‌ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్‌ ఎలా బాధ్యుడవుతారని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్‌ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైలుపై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెబుతారు. ఇప్పుడు సిట్‌ విచారణలో కూడా కేసీఆర్‌ దోషి అని తేల్చడం సులువు కాదు. కేసీఆర్‌తో పాటు అప్పుడు చక్రం తిప్పినవారు తాము కోరుకున్న ఫోన్‌ నంబర్లను ఊరూ పేరూ రాయకుండా నక్సలైట్లతో ముడిపెట్టి సంబంధిత కమిటీల నుంచి ఆమోదం పొందారు. ఈ కారణంగా ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేమి సంబంధం అని కేసీఆర్‌ అండ్‌ కో హూంకరిస్తున్నారు. ఈ కేసులో కేసీఆర్‌ను నేరుగా ఇరికించడం దాదాపు అసాధ్యం. ఈ ధీమాతోనే కేసీఆర్‌నే విచారణకు పిలుస్తారా అని బీఆర్‌ఎస్‌ నాయకులు హూంకరిస్తున్నారు. పనిలో పనిగా ఆత్మగౌరవం నినాదం అందుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు గానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం పాలనలో రజాకార్లను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకులు చేతబట్టి నక్సలైట్‌ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైన కేసీఆర్‌కు ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మొదటిసారిగా కష్టం వచ్చింది. ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు యాగీ చేస్తున్నవారంతా కేసీఆర్‌ పాలనలో ఎంతో మంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మరచిపోతున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి నాడు ప్రగతిభవన్‌కు వచ్చిన గద్దర్‌ను లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణ కోసం ఆయన గజ్జెకట్టి గళం విప్పలేదా? ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఇలా ఎంతో మందికి అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్‌ దొర పోకడల వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతిందని భావించిన తెలంగాణ సమాజం గత ఎన్నికల్లో ఆయనను ఓడించింది. నాటి తమ దొర పోకడలను మరచిపోయి ఇప్పుడు కేసీఆర్‌ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని నిందిస్తున్నారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్‌ అంటేనే తెలంగాణ అని, తెలంగాణపై ఆయనకు మాత్రమే పేటెంట్‌ ఉందని, ఇతరులకు ఆత్మగౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ కాలం నాటి పరిస్థితులను, వాతావరణాన్ని మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి తప్పులను, కేసీఆర్‌ పోకడలను తప్పుబట్టిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రించేవారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం కావస్తున్నా ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్లీ పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రా వాళ్లు, ఆంధ్రా పెత్తనం అని మళ్లీ మొదలెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆంధ్రా తొత్తు అని నిందిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును వాడుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంటు మళ్లీ పండుతుందో లేదో తెలియదు గానీ, భారత రాష్ట్ర సమితి యంత్రాంగం అంతా అదే పనిలో నిమగ్నమై ఉంది. ఏ చిన్న అవకాశం లభించినా తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం తాము పెంచి పోషిస్తున్న సోషల్‌ మీడియా కూలీలను ప్రయోగిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో ఒక ఆచారం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంత మంది వారి ఇళ్లకు వెళ్లి తమ ఇంట్లో వాళ్లు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం గానీ, ఇతరత్రా అనుబంధం గానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలి డబ్బులు తీసుకొని వెళ్లిపోతారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ వాళ్లు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పనిచేస్తున్నారు. కేసీఆర్‌ అండ్‌ కోకు ఏ కష్టం వచ్చినా తెలంగాణకు కష్టం వచ్చినట్టుగా ఈ సోషల్‌ మీడియా కూలీలు ప్రచారం చేస్తున్నారు. ఈ కూలీలు పెట్టే పోస్టులు, వీడియోలు చూసి కేసీఆర్‌ అండ్‌ కో మురిసిపోతూ తెలంగాణ సమాజం అంతా అదే భావనతో ఉందన్న భ్రమల్లోకి వెళుతున్నారు.


టార్గెట్‌ రేవంత్‌!

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు నోటీసులు జారీ అయినప్పటికీ తెలంగాణలో గాలి స్తంభించలేదు. జనం ఎక్కడా రోడ్ల మీదకు రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసీఆర్‌ అండ్‌ కోకు ద్వేషం ఉందని చెప్పి ప్రజలంతా రేవంత్‌రెడ్డిని ద్వేషించాలని, ద్వేషిస్తారు అని భావించడం అవివేకం అవుతుంది. అయితే కేసీఆర్‌ అండ్‌ కో కేవలం తెలంగాణ సెంటిమెంటును మాత్రమే నమ్ముకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలను కూడా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి పొగలు రాజేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. రేవంత్‌రెడ్డి పట్ల కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని, నాయకత్వ మార్పు జరుగుతుందని సోషల్‌ మీడియాలో తమ కూలీలతో ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. నైనీ కోల్‌ బ్లాక్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. కేసీఆర్‌ సొంత మీడియా భట్టి తరఫున వకాల్తా పుచ్చుకొని అనేక కథనాలు వండి వార్చింది. భట్టి నివాసంలో నలుగురు మంత్రులు సమావేశమై ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జట్టు కట్టారని ప్రచారం చేశారు. గడచిన కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ సొంత మీడియా పోకడలను గమనిస్తే రేవంత్‌రెడ్డిని గద్దె దించడమే వారి అభిమతంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు పెరిగి రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే సందు దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడ చొరబడుతూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహించే పనిని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఒరిజినల్‌ కాంగ్రెస్‌కు చెందినవాళ్లంతా రేవంత్‌రెడ్డిపై అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్తగా చేరినవారే అనడంలో సందేహం లేదు. అయితే వివిధ కారణాల వల్ల తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన నాయకులు లేకుండా పోయారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులు ఎదగకుండా అడ్డుకున్నారు. జైపాల్‌రెడ్డి వంటి వారు కూడా అప్పట్లో నిస్సహాయులుగా మిగిలిపోయి ఢిల్లీకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాలం కలసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్‌ ముఖ్యమంత్రి అవడానికి కేసీఆర్‌ మాత్రమే కారణం. దొరతనాన్ని విడిచిపెట్టి, కాస్తంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కొంచెం చేరదీసినా గత ఎన్నికల్లో కేసీఆర్‌ మళ్లీ గెలిచి ఉండేవారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా– ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పంపిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటి? అని కేసీఆర్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోవడం వల్లనే తంటా అంతా. కేసీఆర్‌ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి అంతటితో సంతృప్తి చెందకుండా విచారణల పేరిట కేసీఆర్‌ అండ్‌ కోను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ఉభయ పక్షాల మధ్య వైరం పతాక స్థాయికి చేరింది. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా కేసీఆర్‌ అండ్‌ కో ముప్పేట దాడి మొదలెట్టింది. రేవంత్‌రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కేసీఆర్‌ అండ్‌ కో తమ వద్ద ఉన్న అస్త్రశస్ర్తాలు అన్నింటినీ వినియోగిస్తున్నందున మునిసిపల్‌ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మునిసిపల్‌ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగితే రేవంత్‌రెడ్డి మరింత బలపడతారు. అప్పుడు కేసీఆర్‌ అండ్‌ కోను మరింత ఉక్కిరి బిక్కిరికి గురిచేస్తారు. ఈ విషయం తెలుసు కనుకే మున్సిపల్‌ ఎన్నికల్లోనే తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ ముమ్మరం చేసింది. కేసీఆర్‌ అంతటివాడు.. ఇంతటివాడు అని బీఆర్‌ఎస్‌ నాయకులు మురిసిపోతూ ఉండవచ్చు గానీ చట్టం ముందు అందరూ సమానులే. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ సిట్‌ విచారణను ఎదుర్కోవలసిందే. విచారణకు పిలిచినంత మాత్రాన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లదు. ప్రజల్లో సానుభూతి కూడా ఏర్పడదు. కేసీఆర్‌ను జైలుకు పంపితే మాత్రం సానుభూతి ఏర్పడవచ్చు. బహుశా అందుకే కాబోలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.


కేసీఆర్‌.. జగన్‌ సేమ్‌ టు సేమ్‌!

‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అనే విధానం అన్ని వేళలా పనిచేయదు. కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇదే విధానాన్ని నమ్ముకున్నారు. చంద్రబాబు–రేవంత్‌రెడ్డి మధ్య గురుశిష్యుల బంధం ఉందో లేదో తెలియదు గానీ కేసీఆర్‌–జగన్‌రెడ్డి ఒకే మాట–ఒకే బాటగా సాగుతున్నారు. ఇరువురి ఎత్తుగడల మధ్య ఎన్నో సామీప్యతలు ఉంటున్నాయి. ప్రభుత్వాలపై ఎదురుదాడి చేయడంలో కూడా ఇరువురూ పోటీపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను మరచిపోయి బుకాయిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ కావడంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్‌ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్‌ తేల్చిందని జగన్‌ అండ్‌ కో ఊదరగొడుతున్నారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాలేదు. జగన్‌రెడ్డి హయాంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కొవ్వు అవశేషాలు కనిపించాయని ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు సిట్‌ విచారణ నివేదికలో అంతకంటే దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని తేలింది. ఆవులు లేవు.. నెయ్యి ఉత్పత్తి కాలేదు. పామాయిల్లో కొన్ని కెమికల్స్‌ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని సిట్‌ విచారణలో నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతికంగా కెమికల్‌ కాక్టెయిల్‌ అంటారు. జంతువుల కొవ్వు కలిపి ఉంటే ఆ దేవదేవుడికి అపచారం చేసినవాళ్లు మాత్రమే అయ్యేవారు. ఇప్పుడు అంతకంటే మహా దారుణానికి ఒడిగట్టారని స్పష్టమైంది. రసాయనాల మిశ్రమం వల్ల భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడారు. దీన్ని ఏమనాలి? ఈ పరిస్థితికి కారకులెవరు? జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిపోయిందని జబ్బలు చరుచుకుంటున్న జగన్‌ అండ్‌ కో కెమికల్స్‌ వాడటాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఈ పాపానికి ఒడిగట్టిన భోలే బాబా వంటి దిక్కుమాలిన సంస్థలు నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందడానికి వీలుగా నిబంధనలు సవరించింది ఎవరు? వారిపై తీసుకోబోయే చర్యలు ఏమిటన్నది ఇప్పుడు ముఖ్యం. ఢిల్లీ లిక్కర్‌ పాలసీని సవరించడం ద్వారా అవినీతికి ఆస్కారం కల్పించారన్న కారణంగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ప్రాతిపదికన తిరుమలలో నెయ్యి సరఫరా విధానాన్ని సడలించి నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేసే అవకాశం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి. తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగిన పాపానికి బాధ్యులందరూ శిక్ష అనుభవించాలి. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలి. సిట్‌ అధికారులు తమకు క్లీన్‌చిట్‌ ఇచ్చారని ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్న జగన్‌ అండ్‌ కోకు నివేదికలోని పూర్తి వివరాలు వెల్లడవుతున్న కొద్దీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ పరిస్థితి. జరిగిన పాపంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి నేరుగా సంబంధం ఉందని చెప్పడం సహేతుకం కాదు. అయితే జరగరాని ఘోరం జరిగింది. నేరుగా సుప్రీంకోర్టుకే బాధ్యత వహించాల్సిన సిట్‌ అప్పట్లో ఏం జరిగిందో స్పష్టంగా చెబుతున్నందున ఇందులో శషభిషలకు తావులేదు. సిట్‌కు దురుద్దేశాలు ఆపాదించే అవకాశం కూడా లేదు. నాటి పాలక మండలి, అప్పటి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనడంలో సందేహం లేదు. నెయ్యి టెండర్ల నిబంధనలను మార్చుతున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా వారించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అప్పుడూ ఇప్పుడూ ఈవోగా ఉన్న సింఘాల్‌ అన్నింటికీ తలూపడం ఏమిటి? జగన్‌ అండ్‌ కో చేసుకుంటున్న ప్రచారం కాసేపు పక్కన పెడదాం. సిట్‌ పూర్తి నివేదికను, దాంతోపాటు సిట్‌ అధికారులు ప్రభుత్వానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలి. ఈ పాపానికి ఒడిగట్టినవారు ఎవరు? వారు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారు? అన్నది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఈలోగా అకారణంగా నిబంధనలను సడలించిన వారిని గుర్తించి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకొనే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఈ వ్యవహారం భగవంతునికి, భక్తులకు మధ్య ఉన్న విశ్వాసానికి సంబంధించినది. ఆ దేవదేవుని సన్నిధిలోనే అవినీతి, అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఉపేక్షించడం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అపచారం చేసినట్టుగానే భావించాలి.


QR-Bar.jpg

తప్పు చేసి ఎదురుదాడి..

తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా కేసీఆర్‌ అండ్‌ కో ఎదురుదాడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడి కూడా జగన్‌ అండ్‌ కో ఎదురుదాడి చేస్తోంది. మేం అంతటివాళ్లం, ఇంతటివాళ్లం, మమ్మల్నే తప్పుపడతారా? అంటే కుదరదు. మమ్మల్ని ఏమైనా అంటే మా సోషల్‌ మీడియా కూలీలతో ఎదురుదాడి చేయిస్తామని దబాయించినా లాభం లేదు. ప్రజలు అమాయకులు కారు.. అన్నీ గమనిస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదు. ఎదురుదాడితో ఎంతో కాలం నిజాలను దాచిపెట్టలేరు. రెండు రాష్ర్టాలలోనూ గత ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. ప్రజల నమ్మకాన్ని తిరిగి చూరగొనే ప్రయత్నం చేయాల్సిన వాళ్లు కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం చేయడం నేటి రాజకీయాలలో సరికొత్త ట్రెండ్‌. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కృత్రిమ అసమ్మతిని రాజేసే ప్రయత్నాలను కేసీఆర్‌ అండ్‌ కో చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలను జగన్‌ అండ్‌ కో చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌ అండ్‌ కో హనీ ట్రాప్‌ వంటి కుయుక్తులకు కూడా పాల్పడుతోంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ విషయంలో జరిగింది ఇదే. ఆ ఇరువురి మధ్య అనైతిక సంబంధం ఉండటం నిజం. ఎక్కడో తేడా వచ్చి బజారున పడ్డారు. కూటమి అధినేతలకు వెరపు ఉన్నందున ఇలాంటి సందర్భాలలో వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అదే జగన్‌రెడ్డి హయాంలో చర్యల ఊసే ఉండేది కాదు. పైగా ఎదురుదాడి చేసేవారు. అనైతిక చర్యలకు పాల్పడిన వారికి ప్రోత్సాహకాలు ఉండేవి. ఏది ఏమైనా ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షాల కుయుక్తుల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిపైనే ఉంటుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని రీతిలో సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయించడంలో ప్రతిపక్షాలు ఆరితేరినందున ప్రభుత్వాలే జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా అయితే ప్రభుత్వం వల్ల ప్రతిపక్షాలకు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు తెలుగునాట సీన్‌ రివర్స్‌ అయింది. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధినేతలకు ఈ విషయం అర్థమవుతోందా?

ఆర్కే

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 07:43 AM