Share News

ప్రాకృతిక కవితా నేత్రుడు

ABN , Publish Date - May 11 , 2026 | 01:10 AM

కొలనులు, నదులు, కొండలు, నింగి, నేల, పువ్వులు, జలపాతాలు, వెన్నెల, ఋతువులు, ఉదయ సాయంసంధ్యలు – ఇటువంటి అన్నింటి అందచందాలు, సౌకుమార్యాల తీయందనాలు ఆబగా గుండెలలో...

ప్రాకృతిక కవితా నేత్రుడు

కొలనులు, నదులు, కొండలు, నింగి, నేల, పువ్వులు, జలపాతాలు, వెన్నెల, ఋతువులు, ఉదయ సాయంసంధ్యలు – ఇటువంటి అన్నింటి అందచందాలు, సౌకుమార్యాల తీయందనాలు ఆబగా గుండెలలో నిండించుకుని సహజ కవిత్వాలు పండించిన కవి – కవికొండల వేంకటరావు. ప్రాకృతిక వస్తువులు కవుల్ని ఆకర్షించడం, వారు కవిత్వాలు వెలయించడం అనూచానంగా వస్తున్నదే. కానీ ఎన్ని రాసినా ఏమి రాసినా వస్తుతాదాత్మ్యంతో పరవశించి, నాగరిక జానపదునిగా రసవత్‌ సృజన చేసిన మహానుభావుడు కవికొండల.

గురజాడ ‘ప్రకృతి పుస్తకాన్ని పఠించండి’ అని ప్రవచించేవారు. గురజాడ ప్రభావితులు, వారసులు ఎందరున్నా వారిలో నండూరి సుబ్బారావు, గరిమెళ్ళ సత్యనారాయణ, బసవరాజు అప్పారావు, కవికొండల వేంకటరావు వారి వారి ప్రత్యేకతలతో ముఖ్యులయ్యారు. ఇంటి పేరులోనే కవి శబ్దం ఉన్న వేంకటరావు ఆంధ్రా వర్‌డ్స్‌వర్త్‌గా అన్వర్థనాములయ్యారు. జానపద కవితా రహస్య తత్త్వవేత్త అవడమే కాదు, తన పాటలతో, గేయాలతో జనాన్ని ఉవ్విళ్ళూరించారు.

కవికొండల తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తాలూకా శ్రీరంగపట్నంలో 1892 జూలై 20వ తేదీన శేషమాంబ – నరసింహం దంపతులకు జన్మించారు. రాజమండ్రిలో ఉన్నత విద్యాభ్యాసం జరిగింది. నరసాపురంలో టైలరు పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం. 1915లో చెన్నపురిలో బి.ఎస్‌. పట్టా చేపట్టాక రాజమండ్రిలో ఎక్కువ కాలం న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగించారు. వీరేశలింగం పరోక్ష స్ఫూర్తితో గోదావరీ మండల సంఘసంస్కరణ సమితి అధ్యక్షులుగా సేవ చేయడమే కాదు; న్యాయవాదిగా సంఘసంస్కరణాప్రియులకు ఉచితంగా కేసులు వాదించిన ఆదర్శవ్యక్తి కవికొండల. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలు ఒ.జె. కూల్డ్రే దొర ఒక సాంస్కృతిక కేంద్రంగా భాసించేవారు. ఆయన ‘సౌత్‌ ఇండియన్‌ అవర్స్‌’ అనే తన గ్రంథాన్ని శిష్యులు కవికొండలతోపాటు దామెర్ల వెంకటరావు, అడివి బాపిరాజులకు అంకితమిచ్చారు. 1940లో కవికొండల ‘వెన్నెల’ మాసపత్రికను నడిపారు. తాను పెంచిన తీగ పెల్లగించబడితే చూసి కలవరపడి విలవిల్లాడే సుకుమారతత్త్వం ఆయనది. రాజమండ్రి, నరసాపురం, గుంటూరులతో ఆయన జీవితం ముడిపడింది. 1952లో ఆయన షష్టి పూర్తి ఉత్సవం వైభవోపేతంగా వారి స్థిర నివాసం రాజమండ్రిలో జరగడమే కాదు; కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ జరగడం ఆయన రసజ్ఞ ప్రజాభిమానానికి చిహ్నం.


కవికొండల మాతృదేశభక్తి, రాష్ట్రభక్తి, గాంధీ భావజాలానురక్తితో ఎన్నో రచనలు చేశారు. ఉన్న ఊరును మరచిపోకపోవడమే కాదు; శ్రీరంగపట్నంలో తానుండే వీధిని ఒక పుస్తకానికి ముఖపత్రంగా వేసుకున్న సత్తెకాలపు మనిషి ఆయన. ఒక కొండ – ఎదుట కొలను – అందులో వికసించే ఉత్పల పుష్పాలు – ఈ ముఖచిత్రాన్ని తన పుస్తక ధారావాహికల్లో వేసుకున్నవారు. ఆయనను ‘కొండకొలను వికసితోత్పల కవి’ గానూ సంబోధించేవారు. తీక్ష్ణంగా కవిత్వం రాసే ఆయన చమత్కారి కూడా. ‘‘ఏ వూరు వెడతావు ఉడుత!/ మా వూరెడతాను బుడుత/ మీ వూరెక్కడే ఉడుతా/ మింటి కొబ్బరిచెట్టు బుడుత!’’ వంటివి ఇందుకు ఉదాహరణలు. ‘‘రవికాననిచో కవిగాంచును’’ అనే వాక్యాన్ని ‘‘రవిక ఆననిచో కవి కాంచును’’ అని తొలుత విరిచి చెప్పింది కవికొండలే! ఆంగ్ల కవిత్వంతో రచన ఆరంభించి తెలుగు కవిత్వంలో శాశ్వతకీర్తిని ఆర్జించారు. మూడు వందల చిన్న కథలు రాయడం వలన ‘కథక చక్రవర్తి’ అని మెచ్చులందారు. వ్యక్తులకు కాక ప్రాంతాలకే తన కృతులు అంకితమిచ్చిన వైచిత్ర్య గుణమాయనది. ‘త్రయి’ పుస్తకాన్ని చెన్నపట్టణానికి, ‘తిరువళిక్కి’ని రాయపురం ప్రశాంత సముద్రానికి అంకితమిచ్చారు. ‘విజనసదనం’, ‘ఇనపకోట’ వంటి నవలలు రాశారు. ఆయన జ్ఞాన విస్తృతికి ‘తెనుగుదనం’ వ్యాస సంపుటి దర్పణం.

ఆయన స్వతంత్రించి కొత్త దారులు తొక్కడం వల్ల అద్భుత ప్రయోగాలు విలక్షణ శైలులు కేళాకుళుల్లా (ఫౌంటెన్స్‌) నింగిని ముద్దుపెట్టుకున్నాయి. అవ్యక్త వ్యక్తీకరణలయ్యాయి. ఆయన నటరాజనృత్య దృష్టితో ‘శివరాత్రి ప్రభ’ అనే కవిత రాయగా అది శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పైనే ప్రభావం చూపింది. అత్యాధునిక కవిత్వ ఖండికా అన్నంతగా దేశం చూపును తన పైకి తిప్పుకుంది. ‘‘జగన్నాథుని రథచక్రాలు శ్రీశ్రీ సొంతాస్తే అనుకున్నా కవికొండల శివరాత్రిప్రభకు అది ఎంత ఋణపడి వుందో శ్రీశ్రీయే చెప్పాలి; చెప్పాడు కూడా’’ అన్నారు కె.వి. రమణారెడ్డి. ‘‘శివరాత్రిప్రభ భావనలోను, గమనంలోను కవికొండల ఆవరించిన వైశాల్యం ఇంతట్లో ఎవరూ అందుకోలేరు’’ అని మహాకవి శ్రీశ్రీ అనడంలో ఎన్నో అంశాలు నిక్షిప్తమై గుప్తమై ఉండడాన్ని మనం భావించుకోవాలి.


ప్రణయ కవితలు అద్భుతంగా రాశారు కవికొండల. ‘‘కళ్ళల్లో ముద్దెట్టుతూ/ తెల్లారనీనంటది/ తెల్లారిపోతూంటే/ తానెల్లాగొ అయిపోతది/ ఒక్కళ్ళమైయున్ననూ/ నక్కితానలుసౌతది’’ అనే కవికొండల రసాత్మక వాక్యాలు ఎంకి పాటల స్థాయిలో ఉన్నాయనిపిస్తాయి. ‘‘నది నిండ నీరు ఉన్నదీ/ నావపై పిల్లున్నది/ పిల్లాకు వొళ్ళున్నదీ/ వొళ్ళెల్ల వయసున్నది’’ అనడంలో ఆయన భావుకత సువ్యక్తమవుతోంది. కాలంతో మమేకమైన ఈ కవి ‘‘మండు ఎండాకాలమొక పాట రాలేదు/ వానకాలమ! నీవు పాడింతువానన్ను!/’’ అని ప్రశ్నిస్తారు. వానని కురిపించమనే ఆయన నిస్వార్థ అభ్యర్థన ‘‘చెట్లకొరకే/ పూలకొరకే/ చిగురుజొంపం చెలగుకొరకే/ చిలుకుదేవా! చిన్నవర్షం!’’ వాక్యాల్లో ప్రతిఫలిస్తుంది. రంగుల సొబగులు చిత్రించడంలో ‘‘ఎర్రని సంజలో నల్లని పిల్ల పచ్చగడ్డి కోస్తోందట’’ అంటారు. ‘‘నిశ్శబ్ద వీధిలో నిర్యాణ గీతా’’ల్నీ పలికించారు. ‘‘భానూ దయంపై ప్రియురాలు ఎర్రగానం’’ చేసిందనే ఆయన అభివ్యక్తీకరణం ఎంత ఆధునికం! సంకోచరహితంగా స్వతంత్ర ఆలోచనా విధానంతో ఆయన వందల గేయాలు ఎన్నో కైత పొత్తాలుగా రసజ్ఞ చిత్తాలను లోగొన్నాయి. వస్తు స్వీకరణలో వైవిధ్యాలతోపాటు భావ సౌందర్యాలూ సమున్నతంగా ఉంటాయి. గోదావరి శాఖ వైనతేయంని ప్రేయసిగా, కడలిని ప్రియునిగా అభివర్ణిస్తూ కవికొండల రాసిన ‘విలాసినీ వైనతేయం’ కావ్యం ఆయన ఊహాశాలీనతకు శిఖరాయమాన దర్పణం!

గుంటూరులో తన చిన్నకూతురి ఇంట్లో 1969 జూలై 4వ తేదీన కవికొండల కన్ను మూశారు. కానీ ఆయన కవిత్వ నేత్రాలు చూసి హృదయంతో రాసిన అఖండ ప్రాకృతిక కవితలు మనకు ఎదవిందులు చేస్తూనే ఉంటాయి. కవికొండల వెంకటరావు అనగానే ‘శివరాత్రి ప్రభ’ తోపాటుగా ఠకీమని గుర్తొచ్చేది– గడ్డిపూల గురించి రాసిన ‘దాక్కొని ఉంటాయి’ అనే కవిత.

పాఠకుడు, విమర్శకుడు, శ్రోతలు గణించదగ్గవారే. కానీ రచనవేళల్లో వారిని దృష్టిలో పెట్టుకుని రాస్తే కొండొకచో కృతకత్వం వస్తే రావచ్చు. అలాకాక వస్తువు, కవి అభిముఖమై తాదాత్మ్యం చెందినప్పుడే విలక్షణ ప్రతిభాప్రకాశ ఆవరణలు జనిస్తాయి. కవికొండల విషయంలో ఈ అంశం ఫలించడం వలన అభివ్యక్తి నూతనత్వమో శైలీనూతనత్వమో విలక్షణంగా వచ్చాయి. సామాన్యంగా మనం నిర్లక్ష్యం చేసే గడ్డిపూలపై కవిత అలా వచ్చింది: ‘‘దాక్కొని వుంటాయి దారంట/ గడ్డినిరుక్కుని వుంటాయి/ తలపులరాని పూలు/ పిలువగబోని పూలు/ గ్రుక్కెడు వాననీళ్ళకు ఫక్కున నవ్వుతాయి/... లెక్కకు రావో లక్ష/ చిక్కవు మాలను గ్రుచ్చ/ ఒక్కడ నడుస్తువుంటే/ చుక్కలు పొడుస్తువుంటే/ మక్కువ కూర్చోమంటాయి...’’ ఇలా సాగుతుంది ఈ గేయం.


కవికొండలకు ఒక శైలి ఉంది; ఆయనదంటూ ఓ కాలమూ ఉంది. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే ‘‘ప్రజలకు ఇంత సన్నిహితుడైన తెలుగు కవి ఈ యుగంలో లేడు’’ అని సత్య ధ్రువపత్రాన్ని ప్రకటించారు. చిన్నారి పువ్వులను తొక్కడం కంటే గుడ్డివాడవడమే మేలు అన్న సుకుమార హృదయం కవికొండలది. ‘‘కొండల్లో నా గుండియ వుంది/ చెట్లలో నా గొంతు వుంది’’ అనే ఆయన కవితాభిభాషణం ఆయన కవిత్వానికే ఒక భూషణం. ప్రాకృతిక కవిత్వంలో ఆయన అఖండ ప్రజ్ఞాధురీణుడు. పాల కడలి కెరటాల వంటి ఆయన కవితలు మనకెప్పుడూ రసక్షీరాన్నపు విందులే!

సన్నిధానం నరసింహశర్మ

92920 55531

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 01:10 AM