Share News

అర్ధ సత్యాల ఆర్థికశాస్త్రం మీద మార్క్సు విమర్శ!

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:32 AM

‘పెరిగిన ఇళ్ళ అమ్మకాలు’/ ‘విద్యుత్తు వాహనాల విక్రయాలు 3 లక్షలు దాటొచ్చు’ / ‘పెంపుడు కుక్కల ఆహారం మార్కెట్లోకి విడుదల’/ ‘110 కోట్ల భారీ బడ్జెట్టు సినిమా’/ ‘ఒక్క మే నెలలోనే 700 కోట్ల డాలర్ల విలువ గల చమురు...

అర్ధ సత్యాల ఆర్థికశాస్త్రం మీద మార్క్సు విమర్శ!

‘పెరిగిన ఇళ్ళ అమ్మకాలు’/ ‘విద్యుత్తు వాహనాల విక్రయాలు 3 లక్షలు దాటొచ్చు’ / ‘పెంపుడు కుక్కల ఆహారం మార్కెట్లోకి విడుదల’/ ‘110 కోట్ల భారీ బడ్జెట్టు సినిమా’/ ‘ఒక్క మే నెలలోనే 700 కోట్ల డాలర్ల విలువ గల చమురు దిగుమతులు’. ఈ వార్తల్లో వున్న ఇళ్ళూ, వాహనాలూ, కుక్కల ఆహారమూ, సినిమా, చమురూ–అన్నీ ‘సరుకులే!’. వీటిని అమ్మితే వచ్చేది ‘డబ్బు’. పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రం అంతా సరుకులూ–డబ్బూ చుట్టే తిరుగుతుంది. కానీ, ఆర్థిక శాస్త్రవేత్తలు కొందరు వాటి గురించి తప్పుగానూ, కొందరు అరకొరగానూ అర్థం చేసుకుని పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలలో ఉన్న శాస్త్రాన్ని ‘రాజకీయ అర్థ శాస్త్రం’ (‘పొలిటికల్ ఎకానమీ’) అనడం 17వ శతాబ్దంలో మొదలై, దాదాపు 250 ఏళ్ళ తర్వాత, ‘ఆర్థిక శాస్త్రం’ (‘ఎకనామిక్స్’) అనే పేరు స్థిరపడింది.

ఆర్థిక శాస్త్రం అన్నా ‘అర్థ శాస్త్రం’ అన్నా ఒకటే! ఈ రాజకీయ ఆర్థిక శాస్త్రం, 19వ శతాబ్దంలో మార్క్సు రంగప్రవేశం చేసేవరకూ, అనేక పరిమితులతో, చాలా సార్లు తప్పులతో ఉండేది. అందుకే మార్క్సు, ‘రాజకీయ అర్థశాస్త్రం మీద విమర్శకు ఒక చేర్పు’ అని 1859లో రాశాడు. మార్క్సూ ఎంగెల్సుల రచనలు అనేకం తెలుగులోకి వచ్చాయి గానీ, ఈ రచన మాత్రం ఇప్పుడే అనువాద రూపంలో మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే, తెలుగునాట కమ్యూనిస్టు పార్టీ అంటూ మొదలైన 100 సంవత్సరాల తర్వాత ఎ.గాంధీ ద్వారా అందింది. దీనికి గాంధీ క్లుప్తంగా పెట్టిన పేరు: ‘కార్ల్ మార్క్స్ 1859 అర్థ శాస్త్ర విమర్శ’. జర్నలిస్టుగా, అనువాదకుడిగా, పీకాక్ క్లాసిక్స్ ప్రచురణల ఎడిటర్‌గా, ఎ.గాంధీ చాలా మందికి తెలుసుననుకుంటున్నాను. 77 ఏళ్ళ వయసులో, కంటిచూపు సమస్య తీవ్రంగా ఉన్నా, ఎంతో శ్రమపడి, గాంధీ ఈ అనువాదాన్ని తీసుకొచ్చారు.

ఈ పుస్తకంలో, మార్క్సు రాసిన మొట్టమొదటి వాక్యం: ‘‘మొదటి చూపుకి, పెట్టుబడిదారీ సమాజ సంపద అపారమైన సరుకుల పోగులా కనిపిస్తుంది. ఆ సంపదని కొలిచే యూనిట్ ఒక సరుకు.’’ పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రం మీద మార్క్సు చేసిన పరిశోధన అంతా ఈ సరుకు గురించీ, డబ్బు గురించీ మొదలవుతుంది. మార్క్సు ఈ పుస్తకంలో, క్రీస్తు పూర్వం నాటి అరిస్టాటిల్ నించీ మొదలు పెట్టి, తన కంటే కొద్దికాలం ముందు వరకూ ఉండిన ఆర్థిక శాస్త్రవేత్తల రచనలను, అనేక డజన్ల రచనలను, విమర్శనాత్మకంగా పరిశీలించాడు.


ఈ పుస్తకంలో ప్రధానమైన విషయాల్ని చాలా క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు. (1) సరుకుకి రెండు లక్షణాలుంటాయి. ఒకటి– ఉపయోగపు విలువ; ఇంకోటి మారకం విలువ. ప్రతీ సరుకు ఏదో ఒక ఉపయోగాన్ని ఇస్తుంది. అది దాని ఉపయోగపు విలువ. ప్రతీ సరుకూ ఇంకో సరుకుతో మారుతుంది. ఒక సరుకుని ఇచ్చి ఇంకో సరుకుని తీసుకోగలం. దానికి కారణం, ప్రతీ సరుకులోనూ ఉండే మారకం విలువ. సరుకులు మారకం అవుతున్నాయంటే, వాటి మధ్య ‘విలువ’ అనే సమాన లక్షణం ఉందని అర్థం. (2) మారకం విలువ అంటే, ఒక సరుకు తయారు చేయడానికి పట్టిన శ్రమ కాలం. విలువ అంటే శ్రమే. (3) విలువకి ఉన్న జనరల్ రూపం ‘డబ్బు’. ప్రపంచ ధనంగా ఉన్న బంగారం కూడా ఒక సరుకే. బంగారాన్ని తయారు చెయ్యడానికి పట్టే శ్రమ కాలమే దాని మారకం విలువ. (4) మార్క్సు పూర్వపు ఆర్థికవేత్తల పొరపాటు దృష్టిలో, వస్తువులకు, వాటి శరీర ధర్మాలు ఎలా ఉంటాయో, ‘విలువ’ కూడా అంతే సహజంగా ఉంటుంది. అరిస్టాటిల్ వంటి మేధావి కూడా, రెండు వస్తువుల మధ్య ‘విలువ’ అనే సమాన లక్షణం ఉండబట్టే, అవి మారకం అవుతాయని అస్పష్టంగానైనా గ్రహించాడు గానీ, విలువ అంటే, ‘శ్రమే’ అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. (5) మారకాలలోకి వెళ్ళని వస్తువులు కూడా శ్రమలతో తయారైనప్పటికీ, విలువలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే, ఆ వస్తువుల్ని తయారు చేసిన మనుషులు, వాటిని తామే ఉపయోగించుకుంటారు గానీ, ఇతరులతో మారకం చేసుకోరు. (6) డబ్బు అనేది, సరుకు విలువకి ఒక జనరల్ రూపం. అందుచేత, అది విలువ కొలతగా కూడా ఉంటుంది. దానికి వేరు వేరు దేశాలలో, వేరు వేరు పేర్లు ఉంటాయి. పేర్లు వేరైనా, దేశాల మధ్య జరిగే సరుకుల మారకాల సంబంధాలన్నీ డబ్బు సంబంధాలే. (7) ఈ పుస్తకం లోనే ఒకచోట మార్క్సు అన్నట్టు: ‘‘ఒకరితో ఒకరికున్న ఈ (పెట్టుబడిదారీ) ప్రపంచ జీవుల సంబంధాలు, మౌలికంగా సరుకు యజమానుల మధ్య ఉండే సంబంధాలే తప్ప వేరు కావు. సరుకులు మత, రాజకీయ, జాతీయ, భాషాపరమైన అడ్డంకుల్ని పట్టించుకోవు. ధరే వాటి సార్వత్రిక భాష. డబ్బే వాటి బంధం....(సరుకుల యజమానుల ప్రకారం) ఈ యావత్తు ప్రపంచం కలిసిపోయేది, మార్కెట్టులోనే, అంటే, ప్రపంచ మార్కెట్టులోనే!’’


ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని పదాల్నీ, ఇంగ్లీషులో ఉన్న పెద్ద పెద్ద వాక్యాల్నీ తెలుగులోకి తేలికైన పద్ధతిలో తేవడం చాలా కష్టమైన పని! కొత్త కోణంలో, ఆర్థిక విషయాల్ని చెప్పే ఈ పుస్తకాన్ని కొన్ని ఫుట్ నోట్లతో, వివరణలతో ఇచ్చివుంటే, ఎక్కువ మంది పాఠకులకు తేలికయ్యేది. మొత్తం మీద, ఎంతో క్లిష్టమైన సిద్ధాంత గ్రంథాన్ని, తనకి చేతనైనంత వరకూ, గాంధీ శ్రమపడి అనువాదం చేశారు. ‘మంచిపుస్తకం’ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం ఈ పుస్తక పరిచయసభ జరుగుతుంది.

బి.ఆర్. బాపూజీ

ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 12:32 AM