Share News

కాళేశ్వరం విలువ ఇప్పటికైనా తెలిసిందా?

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:19 AM

ఎల్‌నినో హెచ్చరికలతో మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చిన రేవంత్ ప్రభుత్వం వర్షాలు కురవడం ప్రారంభం కాగానే ముందు జాగ్రత్తగా మొన్న ఎల్లంపల్లిలో ఐదు పంపులు, నందిమేడారంలో ఐదు పంపులు...

కాళేశ్వరం విలువ ఇప్పటికైనా తెలిసిందా?

ఎల్‌నినో హెచ్చరికలతో మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చిన రేవంత్ ప్రభుత్వం వర్షాలు కురవడం ప్రారంభం కాగానే ముందు జాగ్రత్తగా మొన్న ఎల్లంపల్లిలో ఐదు పంపులు, నందిమేడారంలో ఐదు పంపులు, గాయత్రి పంప్ హౌజ్ దగ్గర ఐదు పంపులు ఆన్ చేసి గోదావరి వరద నీళ్లను ఎత్తిపోస్తూ మిడ్ మానేరుకు తరలించడం ప్రారంభించింది. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? ఇదే కాదు, రివర్స్ పంపింగ్ విధానంలో ఎస్సారెస్పీ నింపుతామంటున్నారు. ఈ రివర్స్ పంపింగ్‌తో నీళ్లు ఎత్తిపోయడానికి కేసీఆర్ ప్రాజెక్టు చివరి దశలో ఎంతో వ్యూహాత్మకంగా ప్రతిపాదించి నిర్మించిన రామారం, రాజేశ్వరరావుపేట పంప్‌హౌజ్‌లు, వరద కాలువ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మిడ్ మానేరు నిండాక ఆ నీళ్లను మళ్లీ పంపుల ద్వారా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ నింపుతామని రేవంత్ ప్రభుత్వమే చెప్తోంది. ఈ రిజర్వాయర్లన్నీ కాళేశ్వరంలో భాగంగా నిర్మించినవి కాదా? అంతెందుకు మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తరలిస్తామని, మూసీని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి రేవంత్ ప్రభుత్వం టెండర్లు కూడా ఆహ్వానించింది. మరి ఈ మూసీకి తీసుకువస్తామన్న నీళ్ల తొలి గలగలలు మొదలయ్యేది కాళేశ్వరం నుంచి కాదా?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కాళేశ్వరంలో అంతర్భాగం మాత్రమే. కేవలం ఆ మూడు బ్యారేజీలే కాళేశ్వరం కాదు. లక్ష కోట్లు ఖర్చు అయ్యాయి అంటున్న కాళేశ్వరంలో ఈ మూడు బ్యారేజీలకు అయిన ఖర్చు రూ.10వేల కోట్ల లోపే. కాళేశ్వరంలో అంతర్భాగమైన 95శాతం ప్రాజెక్టులను వాడుకుంటూ, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎలా అంటారు? రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్‌రెడ్డి– కేసీఆర్‌పై కోపంతో రాష్ట్రానికి వరదాయిని అయిన కాళేశ్వరాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారు.

మేడిగడ్డలో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగిన మాట వాస్తవమే. ప్రభుత్వం దానికి మరమ్మతులు చేసి బ్యారేజీని పునర్వినియోగంలోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచించాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం ప్రాజెక్టును అపఖ్యాతిపాలు చేస్తూ రాష్ట్రానికి నష్టం చేయకూడదు. అధికారంలోకి వచ్చి 30 నెలలైనా మేడిగడ్డలో దెబ్బతిన్న బ్లాక్‌కు మరమ్మతులు ఎందుకు చెయ్యట్లేదు?


ఇటీవలే విడుదలైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వార్షిక నివేదిక ప్రకారం– పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట అయిన డయాఫ్రమ్ వాల్ కూలిపోతే మళ్లీ కట్టాల్సి వచ్చింది. కాఫర్ డ్యామ్‌కు ఎన్నోసార్లు మరమ్మతులు చేశారు. ఇంకా చాలా పనులు మళ్లీ మళ్లీ చేయాల్సి వచ్చిందని, ఈ పునరుద్ధరణ పనులకే దాదాపు 10వేల కోట్ల దాకా ఖర్చు అయిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇంత జరిగినా తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నట్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా పోలవరంలో వైఫల్యాలు, పునరుద్ధరణ పనులు రాజకీయపరమైన అంశం కాలేదు!

కాళేశ్వరం ఒక సాధారణ నీటిపారుదల ప్రాజెక్టు కాదు. మూడు రకాల ప్లాన్‌లతో దాన్ని నిర్మించారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డికి ఇంకా అర్థం కానట్లుంది. రాష్ట్రంలో ఎంత భారీ వర్షపాతం నమోదైనా కూడా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్‌లు నిండేంత వరద ఉండదు. అప్పుడు వాటిని నింపడానికి నేరుగా మిడ్ మానేరు నుంచే నీటిని ఎత్తిపోయవచ్చు. కింది బ్యారేజీల్లో ఎలాగూ వరద నీరు ఉంటుంది. అలా కాకుండా, సాధారణ వర్షపాతం నమోదైతే, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి నీటిని మిడ్ మానేరు, అక్కడి నుంచి ఎగువన ఉన్న రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయవచ్చు. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితులు ఉన్నట్లు మొత్తానికే వర్షాలు లేకపోయినా, ఎగువ రాష్ట్రాల నుంచి గోదావరికి వచ్చే వరదను మేడిగడ్డ వద్ద ఒడిసిపట్టుకొని పైకి ఎత్తిపోసుకోవచ్చు. ఇలా మూడు రకాలుగా ప్రణాళికలు వేసి నిర్మించిన గొప్ప ప్రాజెక్టు అది. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఏంటనేది వర్షాలు లేనప్పుడే తెలుస్తుందని నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులతో సహా అందరికీ అర్థమవుతోంది.

మాట్లాడితే రేవంత్– ‘కాళేశ్వరం కూలేశ్వరం అయింది, లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి’ అంటున్నారు. ప్రాజెక్టు వ్యయం ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగినట్టు లెక్కల మీద పెరగలేదు. ప్రాణహితకు చేసిన రీ డిజైనింగ్, పెంచిన రిజర్వాయర్ల సామర్థ్యం, నిర్మించిన టన్నెళ్ల వల్ల పెరిగింది. ఇది మళ్లీ మళ్లీ చెప్తున్నా రేవంత్ మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారు. ప్రాణహిత రీ డిజైనింగ్‌లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద అనుకున్న ప్రధాన బ్యారేజీని కిందికి జరిపి మేడిగడ్డ వద్ద నిర్మించారు. దీనివల్ల నీటిని అదనంగా మరో 48 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మార్పు వల్ల గోదావరి నదిపై ఒకే బ్యారేజ్ స్థానంలో 3 ప్రధాన బ్యారేజీలు (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల), 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల భూగర్భ సొరంగాలు అదనంగా నిర్మించాల్సి వచ్చింది. దీనివల్ల బడ్జెట్ పెరిగింది. కేంద్ర జలశక్తి సంఘానికి సమర్పించిన నివేదికలో రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సామర్థ్యాన్ని పెంచింది. కేవలం ఈ ఒక్క నిర్ణయం వల్ల (అదనపు బాహుబలి మోటార్లు, పంపులు, భారీ పైప్‌లైన్లు, సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం) అంచనా వ్యయం మరో రూ.28,151కోట్లు పెరిగింది.


ప్రాజెక్టు పరిధి, రిజర్వాయర్ల సామర్థ్యం (మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటివి) భారీగా పెంచడం వల్ల వేలాది ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, రైతులకు నష్టపరిహారం ఇవ్వడం, ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించడం కోసం వేల కోట్లు అదనంగా ఖర్చయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రధాన రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాత ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌తో పోలిస్తే, కాళేశ్వరం రీ–డిజైనింగ్‌లో జరిగిన అతిపెద్ద మార్పు ఇదే. కొన్ని రిజర్వాయర్ల పరిమాణాన్ని పెంచడమే కాకుండా, కొన్ని కొత్త భారీ రిజర్వాయర్లను కూడా అదనంగా చేర్చారు. మల్లన్నసాగర్ (కొమురవెల్లి) పాత డిజైన్‌లో కేవలం 1.50 టీఎంసీల చిన్న రిజర్వాయర్ మాత్రమే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో దీన్ని ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో రాష్ట్రంలోనే అతిపెద్ద మానవ నిర్మిత నిల్వ జలాశయంగా మార్చారు. పాత ప్లాన్‌లో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రతిపాదనే లేదు. కానీ కాళేశ్వరంలో కొత్తగా 15 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. బస్వాపూర్ రిజర్వాయర్ (నృసింహస్వామి) సామర్థ్యం మొదట కేవలం 0.80 టీఎంసీలు మాత్రమే. దాన్ని కాళేశ్వరంలో 11.39 టీఎంసీలకు పెంచారు. 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని అనుకున్న గంధమల్ల రిజర్వాయర్‌ను రీ–డిజైనింగ్‌లో 9.86 టీఎంసీలకు పెంచారు. ఇంత చేసినప్పుడు ప్రాజెక్టు ఖర్చు పెరగదా?

బోయినపల్లి వినోద్‌కుమార్

కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:19 AM