Share News

‘డచ్‌ రోగం’ ముదిరేనా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:39 AM

ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అపారమైన ఖనిజ నిల్వలకు చిరునామా భారతదేశం. దేశ సజీవ, నిర్జీవ సహజ వనరుల్లో (అటవీ సంపద, ఖనిజం= మినరల్‌, ముడి ఖనిజం= ఓర్‌) అత్యధిక శాతం...

‘డచ్‌ రోగం’ ముదిరేనా?

ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అపారమైన ఖనిజ నిల్వలకు చిరునామా భారతదేశం. దేశ సజీవ, నిర్జీవ సహజ వనరుల్లో (అటవీ సంపద, ఖనిజం= మినరల్‌, ముడి ఖనిజం= ఓర్‌) అత్యధిక శాతం వింధ్య పర్వతాలకు దిగువనున్న దక్షిణాపథంలో (దక్కన్‌ ద్వీపకల్పం, తమిళనాడు, కేరళ, కర్ణాటక భూభాగాలతో సహా శ్రీలంక, మాల్దీవుల వరకు) విస్తరించి ఉందన్న విషయం తెలిసిందే. శతాబ్దాల నుంచి చారిత్రకంగా కదంతాల్‌ స్థితిలో కొనసాగుతున్న ‘గోండ్వానా’ ఆదివాసీల నివాస ప్రాంతంగా, వారిని సంఘటితం చేసిన మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా 45 ఏళ్ళకు పైగా ఉన్నందున... ఈ విలువైన సహజ వనరులు, మానవ వనరులు దేశీయ, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం కాలేదు.

2026 మార్చి నాటికి దక్షిణాపథంలో మావోయిస్టు తీవ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా అనేక రూపాల్లో సాయుధ ఆపరేషన్లను కేంద్రం నిర్వహించింది. వాటికి పరాకాష్ఠగా ‘ఆపరేషన్‌ కగార్‌’ కేంద్రంగా ‘డిసిసివ్‌ డికేడ్‌: ఎండింగ్‌ లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజం’ అనే సైనిక వ్యూహాన్ని కేంద్రం వేగంగా చేపట్టడంతో మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో అంత్య దశకు చేరుకుంది. దాంతో గణనీయమైన స్థాయిలో మానవ వనరులు, సహజ వనరులు దేశ, విదేశీ మార్కెట్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటి వాణిజ్యం (స్వదేశీ, విదేశీ) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని, వాణిజ్యం వివృతమై, అపార సంపదలు సమాజంలోకి విదేశీ మారక నిల్వల రూపంలో ప్రవహిస్తాయన్న పాలకుల స్వప్నం సాకారమవుతుందా?

స్వాతంత్ర్యానంతరం తొలి ౩ దశాబ్దాలు కొనసాగిన ‘హిందూ వృద్ధిరేటు’ అనే ఆర్థిక బాలారిష్టంలో కూరుకుపోయి, గణనీయమైన నిర్మాణాత్మక పరిణామానికి ఇండియా ఆర్థిక వ్యవస్థ నోచుకోలేదు. తొలినాళ్ళలో ప్రభుత్వరంగ ఉద్యోగుల భారీ నియామకం వల్ల వ్యవసాయం, వస్తూత్పత్తి పారిశ్రామిక రంగాల అభివృద్ధి క్రమం పెద్దఎత్తున కుంటుపడింది. ఆ తరువాత 1980– 2015 కాలంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 7–8 దేశాల్లో ఒకటిగా నిలిచింది. 1980లలో ప్రారంభమై ఇండియాలో సేవా రంగం– ఐటీ అపార వృద్ధి; అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకు నైపుణ్యం ఉన్న ఉద్యోగుల వలసలు; మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, ఇంగ్లండ్‌ తదితర దేశాలకు అనిపుణ, అర్ధనిపుణ కార్మికుల వలసల కారణంగా దేశంలోకి విదేశీ మారక ద్రవ్యం ప్రవహించింది. దీంతో దేశీయ కరెన్సీ బలపడి, ఇండియా ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్‌లో ఖరీదైనవిగా మారి, వాటి డిమాండ్‌ తగ్గడంతో వాణిజ్యం దెబ్బతింది. పర్యవసానంగా వ్యవసాయం, వస్తూత్పత్తి రంగాలు కుదేలై, దిగుమతులు పెరిగాయి. సేవల రంగం, అధిక వేతనాలిచ్చే ప్రభుత్వ రంగాల కారణంగా శ్రమశక్తి వనరుల లభ్యత దేశీయ మార్కెట్‌లో కొరవడింది. దాంతో వస్తూత్పత్తి రంగం నష్టదాయకంగా మారడమే కాకుండా, ఉపాధి అవకాశాలు గణనీయంగా సన్నగిల్లాయి.


1990లలో ప్రపంచీకరణ విధానాలను వేగంగా అమలు చేయడం వల్ల దేశంలోకి ప్రత్యక్ష విదేశీ అర్థ మదుపులు(ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత మదుపులు, ప్రవాసీలు పంపే ధనం... పర్యవసానంగా విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడంతో ఇండియా కరెన్సీ విలువ క్షీణత నెమ్మదించింది. దేశంలో అవసరాలకు మించిన కరెన్సీ ఆర్థిక వ్యవస్థలో ప్రవహించడంతో అనేక ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా మనది గ్రామీణ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో భారీ స్థాయి ఆర్థిక విధ్వంసక పరిణామాలు చోటుచేసుకోలేదు. అయితే వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయి రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చేతివృత్తులు ధ్వంసం కావడంతో పెద్ద ఎత్తున గ్రామీణ నిరుద్యోగం ప్రబలి, పట్టణాలకు వలసలు కడుతున్నారు. పట్టణాల్లో శ్రామికులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. దేశ అవసరానికి మించి వివిధ రూపాల్లో ప్రవహించిన విదేశీ మారక ద్రవ్యం, ప్రభుత్వరంగ ఉద్యోగాల గణనీయమైన అభివృద్ధి, ఆ తర్వాత ఐటీ రంగం పెరగడం వల్ల దిగుమతులు విపరీతంగా పెరిగి, స్వదేశీ వస్తూత్పత్తి రంగం కుదేలయింది. దాంతో నిరుద్యోగం పెరిగి, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి.

ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం తీవ్రమైన వృద్ధి రేటు సాధించడం వల్ల వస్తూత్పత్తి, ఎగుమతుల రంగాలు క్షీణించాయి. విదేశీ మారక రేటులో దేశీయ ద్రవ్యం విలువ ప్రపంచ మార్కెట్‌ అవసరాలకు మించడంతో ఎగుమతులు ప్రియమై పోటీతత్వం సన్నగిల్లింది. దాంతో స్వదేశీ వాణిజ్య శక్తులు లాభదాయక రంగంపై అధికంగా ఆధారపడ్డాయి, ఇతర రంగాలు దెబ్బతిని, ఉద్యోగాలు ఆవిరై కొనుగోలు శక్తి క్షీణించింది. దీన్ని నిలువరించేందుకు వైవిధ్యభరితమైన, సమతుల్యమైన ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలి. అంతవరకు, ఉత్తర–దక్షిణ భారతం అభివృద్ధి వ్యత్యాసాలు, ఘర్షణలు వంటి ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి రేటు కుంటుపడడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఇలాంటి సంక్షోభాన్ని ‘డచ్‌ రోగం’ అని పిలుస్తారు. ఇండియాలో ప్రధానంగా ద్రవ్య, ఐటీ తదితర సేవల రంగం పునాదిగా ఈ రోగం ఏర్పడింది. ఇది మొదటిసారిగా 1960లలో ఆయిల్‌, గ్యాస్‌ నిల్వలు కనుగొని, వాటి వ్యాపారంపై డచ్‌ (నెదర్లాండ్స్‌) దేశ ఆర్థిక వ్యవస్థ మోహరించడం వల్ల మొదట్లో ఆర్థిక ప్రగతికి లాభదాయకంగా ఉన్న ఏక రంగం కేంద్రిత ఆర్థిక విధానం, కరెన్సీ బలపడి డచ్‌ సరుకులు అంతర్జాతీయ విపణిలో ప్రియమయ్యాయి. ఎగుమతులు దిగనాశిల్లడంతో వస్తూత్పత్తి రంగం కుదేలు కావడం, ఉపాధి ఆవిరవడంతో దేశం త్రీవ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పటి నుంచి ఈ ఆర్థిక రుగ్మతకు ‘డచ్‌ రోగం’ అని పేరొచ్చింది.

నైజీరియా, వెనెజువెలా దేశాల్లో ఆయిల్‌ వ్యాపారం; ఇండియాలో ఫైనాన్స్‌, ఐటీ వంటి సేవల రంగాలలో అభివృద్ధి కారణంగా; ఆస్ట్రేలియాలో మైనింగ్‌ కార్యకలాపాలపై కేంద్రీకరణ; గల్ఫ్‌ దేశాల్లో ఆయిల్‌ వాణిజ్య ఆదాయాల కారణంగా ఆ దేశాలు కూడా ‘డచ్‌ రోగం’ బారిన పడ్డాయి. ‘కగార్‌ యుద్ధం’ పర్యవసానంతో దేశంలో (దక్షిణాపథం దండకారణ్యం) గణనీయమైన స్థాయిలోని సహజ/ శ్రమశక్తి వనరులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ రంగాలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే జాతీయ, ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2007 నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో దాని పరిష్కారంగా మార్కెట్‌/ కార్పొరేట్‌ శక్తులు కొత్తగా అందుబాటులోకి వచ్చిన వనరులు లాభదాయకమని భావించి, ఆ రంగం వైపు మదుపులను పెద్దఎత్తున మళ్లిస్తాయి. దాంతో వస్తూత్పత్తి రంగం భయంకరంగా దెబ్బతిని, నిరుద్యోగం ఎక్కువై ‘డచ్‌ రోగం’ ఇంకా భీకరంగా ప్రబలేందుకు మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమం కూడా దోహదమయ్యే సంభావ్యతను కాదనలేం. సహజ/ శ్రమశక్తి వనరుల వాణిజ్య ఆదాయం విదేశీ మారకద్రవ్యం రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే ప్రవాహం... సహజ వనరుల వాణిజ్య ఆధారిత ‘డచ్‌ రోగం’ ఏర్పడేందుకు దారితీసే ప్రమాదం ఉంది. దాంతో ఇప్పటికే ఉన్న ద్రవ్య, ఐటీ తదితర సేవలరంగ డచ్‌ రోగానికి ఇది జత అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

వెన్నెలకంటి రామారావు

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 01:39 AM