Share News

సామాజిక న్యాయంపై కనిపించని కుట్ర

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:47 AM

ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్షను నివారించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గత నెల 13న జారీ చేసిన కొత్త నిబంధనలు తీవ్ర అలజడికి దారితీశాయి. వాటిపై నెలకొన్న...

సామాజిక న్యాయంపై కనిపించని కుట్ర

ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్షను నివారించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గత నెల 13న జారీ చేసిన కొత్త నిబంధనలు తీవ్ర అలజడికి దారితీశాయి. వాటిపై నెలకొన్న వివాదం ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం గురించి ఎంతమాత్రం కాదు. నిజ జీవిత పర్యవసానాలతో కూడిన రాజకీయ ప్రహసనమది. ఆరంభం నుంచి ముగిసే వరకు ఆ నాటకంలోని ప్రతి సన్నివేశం కూడా ద్వేష భావంతో నిండివున్నది. తొలుత పాటించిన వైఖరికి విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది యూజీసీ. సామాజిక న్యాయం పట్ల ఉదాసీనత చూపే పాలనా వ్యవస్థ ఉన్నత విద్యా సంస్థలలో వివక్షను రూపుమాపేందుకు ఉద్దేశిస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఆ తరువాత ఆ నిబంధనలకు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాన్ని ఉత్పత్తి చేశారు. పాలకులకు విధేయులు అయినవారు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పూనుకున్నారు. ఆధిపత్యాన్ని చలాయించేవారే తాము వేధింపులకు గురవుతున్నామని ఆక్రోశించారు. అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానం రంగప్రవేశం చేసింది. వివక్ష నివారణకు నిబంధనలు రూపొందించి అమలుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానమే తీరా అవి జారీ అయిన తరువాత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేవనే అభిప్రాయంతో వాటి అమలుపై స్టే విధించింది. యూజీసీ నిబంధనల అమలును సుప్రీంకోర్టు నిలిపివేయడం సాంకేతికంగా ఒక చిన్న విషయమే కావచ్చుకానీ పౌరులు, ప్రభుత్వం మధ్య రాజ్యాంగంలో పొందుపరచిన ఒక సున్నితమైన సామాజిక ఒప్పందాన్ని ఉల్లంఘించే న్యాయ నిర్ణయమది.

యూజీసీ నిబంధనలపై వివాదం విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సామాజిక వివక్ష ఉందా లేదా అనే విషయంపై కాదు. ఉందనేది ఒక తిరుగులేని వాస్తవమని ఇటీవలే ప్రచురితమైన ఎన్‌.సుకుమార్‌ పుస్తకం ‘Caste Discrimination and Exclusion in Indian Universities: A Critical Reflection’ ధ్రువీకరించింది. ఆ అంశంపై ప్రస్తుతమున్న సమాచారంతో పాటు తాను స్వయంగా నిర్వహించిన సర్వే, విద్యార్థుల వ్యక్తిగత అనుభవాలు, సంస్థాగతమైన విశ్లేషణల ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్ష వ్యవస్థాగతమైనదని సుకుమార్‌ నిరూపించారు. సంప్రదాయిక కుల పరపతి ఎలా ఆధునిక అవకాశాలకు ఆలంబన అవుతుందన్న విషయమై ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త సతీశ్‌ దేశ్‌పాండే ప్రతిపాదన ఆధారంగా వ్యక్తిగత మేధా విజయాలకు అది దోహదం చేస్తున్న తీరుతెన్నులను సుకుమార్‌ వివరించారు.


దేశంలోని కొన్ని ఉత్కృష్ట ఉన్నత విద్యాసంస్థలలో దళిత విద్యార్థులు ఏ విధంగా నిందలు, దుర్భాషల నెదుర్కొంటున్నదీ సుకుమార్ పేర్కొన్నారు. అగ్రకులాలకు చెందిన విద్యార్థులు తమ సహచర విద్యార్థులు అయిన దళిత సామాజికులను ‘కోటా సంతానం’, ‘కేటగిరీ వాలా’, ‘సర్కారీ దమాద్‌’, ‘సర్కారీ బ్రాహ్మిణ్‌’, ‘సద్దూస్‌’ లేదా ‘బెహెన్జీ’ అని, ఇంకా చెప్పలేని మాటల్లో ఎత్తి పొడుస్తుంటారని సుకుమార్‌ తెలిపారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, మూల్యాంకనాలు, పరిశోధనా పర్యవేక్షణలు, పాలనా వ్యవహారాలు, క్రమశిక్షణా యంత్రాంగాలలో సర్వత్రా కుల ఆధారిత వివక్ష పరివ్యాప్తమై ఉంది. పది విశ్వవిద్యాలయాలలో 600 మంది విద్యార్థినీ విద్యార్థులతో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా సుకుమార్ ఈ వాస్తవాలు వెల్లడించారు. వైవాలు, ఇంటర్వ్యూలలో తాము వివక్షకు గురవుతున్నామని మూడింట రెండువంతుల మంది విద్యార్థులు వెల్లడించారు. ఆ వివక్షకు ప్రాథమిక కారకులు అధ్యాపకులే అని 60శాతం మంది విద్యార్థులు నిర్ధారించారు. అంతే శాతం మంది దళిత పరిశోధక విద్యార్థులు తాము పర్యవేక్షణాపరమైన దోపిడీకి గురవుతున్నామని తెలిపారు. మరి ఓబీసీల విషయంలో ఈ వివక్ష ఎలా ఉందని మీరు ప్రశ్నించవచ్చు. మన విశ్వవిద్యాలయాలలో ఆ విద్యార్థుల అనుభవాలు ఆ ఉన్నత విద్యా సంస్థలు ప్రజాస్వామిక నెలవులుగా లేవు అని మాత్రమే స్పష్టం చేస్తున్నాయి.

ఈ వివక్షను అరికట్టేందుకు 2012లో యూజీసీ జారీ చేసిన నిబంధనలను రూపొందించడంలో ఆ సంస్థ సభ్యుడిగా నేనూ పాలుపంచుకున్నాను. ఆ తొలి నిబంధనలను అమలుపరిచేందుకు నిర్దేశించిన సంస్థాగత ఏర్పాట్లు సంతృప్తికరంగా లేవు. వాటితో పోల్చితే ఇటీవలి కొత్త నిబంధనలు సంస్థాగత ఏర్పాట్ల విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి. వివక్షను ఇవి విస్తృత ప్రాతిపదికన నిర్వచించాయి. వేధింపులు, వ్యక్తిగతంగా బాధించడం, వ్యతిరేకత చూపించడం మొదలైనవి కూడా వివక్ష కిందకు వస్తాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రత్యక్ష, పరోక్ష వివక్షలు అన్నిటినీ రూపుమాపడమే కొత్త నిబంధనల లక్ష్యంగా ఉన్నది.

కొత్త నిబంధనలు ప్రశస్తమైనవి అనడంలో సందేహం లేదు. సమస్యల్లా వాటిని ఆచరణలోకి తీసుకురావడమే. ఇదిగో, ఈ విషయంలోనే సంకల్పం కొరవడుతోంది. 2012లో యూజీసీ జారీ చేసిన నిబంధనలు కాగితాల మీదనే ఉండిపోయాయి. వాటి గురించి విద్యార్థులకు తెలియనే తెలియదు. మరి 2026లో జారీ అయిన కొత్త నిబంధనల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందా?


ఈ వ్యవహారం ఒక న్యాయ వివాదం కాదు. ఒక న్యాయ వివాదంగా అది రూపొందకూడదు. విద్యా సంస్థల్లో వివక్షకు వ్యతిరేకంగా యూజీసీ జారీ చేసిన పాత నిబంధనలు, కొత్త నిబంధనలు రెండూ కూడా రాజ్యాంగం నుంచి స్ఫూర్తి పొందినవే. ‘కులం, సంప్రదాయం, మతం, భాష, జాతి, జెండర్‌, వైకల్యం’ ఆధారంగా ఎటువంటి వివక్ష చూపడానికి వీలులేదని పాతవీ, కొత్తవీ రెండూ స్పష్టం చేశాయి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు సంభావ్య వివక్ష నుంచి రక్షణ కల్పించాలని పాత నిబంధనలు నిర్దేశించాయి. ఆ సామాజిక వర్గాలకు తోడుగా ఓబీసీలకు కూడా అటువంటి రక్షణ కల్పించాలని కొత్త నిబంధనలు పేర్కొన్నాయి. గమనార్హమైన వాస్తవమేమిటంటే 2019లో రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వి (విశ్వవిద్యాలయాలలో వేధింపులు, మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు)ల మాతృమూర్తులు దాఖలు చేసిన ఒక కేసులో సర్వోన్నత న్యాయస్థానం నిర్దిష్ట ఆదేశాల మేరకు కొత్త నిబంధనలను యూజీసీ జారీ చేసింది. జస్టిస్‌ (ఇప్పుడు సీజేఐ) సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చీలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్‌ 15, 2025న ఆ ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల పట్ల వివక్ష నివారణకు ఒక కమిటీ నేర్పాటు చేయాలని, ఆ కమిటీలో 50శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే సభ్యులుగా ఉండాలని, కమిటీ చైర్మన్‌ కూడా ఆ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తే ఉండాల’ని సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. ఆ సిఫారసుల మేరకు యూజీసీ కొత్త నిబంధనలు జారీ చేసింది. తాము సిఫారసు చేసిన నాలుగు నెలల అనంతరం అదే ధర్మాసనం యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనలు రాజ్యాంగబద్ధంగా లేవంటూ వాటి అమలుపై స్టే విధించింది. ఈ స్టే ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు చెప్పిన కారణాలు ఈ తరహా వివక్షల విషయమై సర్వోన్నత న్యాయస్థానం దీర్ఘకాలంగా అనుసరిస్తున్న వైఖరికి అనుగుణంగా లేవని న్యాయశాస్త్ర కోవిదుడు గౌతమ్‌ భాటియా అభిప్రాయపడ్డారు.


ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్షను రూపుమాపేందుకు యూజీసీ జారీ చేసిన నిబంధనలపై రగులుతోన్న ఆందోళన నిస్సందేహంగా ఒక రాజకీయ పోరాటం. దానికి కారకులైనవారు తమ అసలు లక్ష్యాలను దాచిపెట్టారు. ఎన్నికలలో విజయాన్ని సాధించిపెట్టే ఒక సామాజిక సంకీర్ణాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మించుకున్నది. తన ప్రధాన ఓటు బ్యాంకు అయిన అగ్రకులాల హిందువులను సంఘటితపరచడంతో పాటు హిందూ సమాజంలోని మిగతా సామాజిక వర్గాలపై గణనీయమైన పట్టు సాధించడం ద్వారా ఆ సామాజిక సంకీర్ణం సాధ్యమయింది. ఆ క్రమంలో కింది స్థాయి హిందూ సామాజిక వర్గాలు అయిన దళితులు, బహుజనులకు పలు రాజకీయ, ఆర్థిక రాయితీలు కల్పించింది. కుల గణన డిమాండ్‌ను ఆమోదించడం కూడా వాటిలో ఒకటి. తమ రాజకీయ అధికారాన్ని, ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు దళిత, బహుజనులకు అటువంటి రాయితీలు కల్పించడం తప్పనిసరి అని బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకు అయిన అగ్రకులాల హిందువులు భావించారు, సహించారు. ఎన్నికలలో బీజేపీ వరుసగా తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. ఎడతెగని ప్రచారోధృతితో తన భావజాలానికి విస్తృత ఆమోదాన్ని కూడా సాధిస్తోంది. ఈ కారణంగా దళితులు, బహుజనులకు ఇస్తోన్న రాయితీలు అనవసరమని, అవి ఇవ్వకపోయినా తమ రాజకీయ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురుకావనే సునిశ్చిత విశ్వాసానికి బీజేపీ మద్దతుదారులు అయిన అగ్రకులాల హిందువులు వచ్చారు. ఏది ఎలా జరిగినప్పటికీ ఓబీసీలకు కల్పిస్తున్న ప్రయోజనాల విషయమై అగ్రకులాల హిందువులకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఫలితంగా బీజేపీ నిర్మించిన సామాజిక సంకీర్ణం బీటలువారడం ప్రారంభమయింది. ఈ విచ్ఛిన్నాన్ని, లేదూ అనైక్యతను దాచిపెట్టేందుకు బీజేపీ చాలా కష్టపడుతోంది.

భారత రాజ్యాంగం ప్రవచించిన సామాజిక న్యాయ భావనపై ప్రచ్ఛన్న దాడులు జరుగుతున్నాయి. యూజీసీ నిబంధనలు అందుకొక సందర్భం మాత్రమే. ఆ అవకాశాన్ని సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకున్నాయి. వాటి అసలు లక్ష్యం రిజర్వేషన్ల సదుపాయాన్ని పూర్తిగా కూల్చివేయడమే. వివిధ రంగాలలో ఓబీసీల పురోగతి ఆ శక్తులకు తొట్రుపాటు కలిగిస్తోంది. కులగణన డిమాండ్‌ ఆ శక్తులను కలవరపరుస్తోంది. ఫలితంగానే యూజీసీ నిబంధనలపై వివాదం నెలకొన్నది. ఈ వివాదంతో– తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కృతనిశ్చయంతో ఉన్నవారు, రాజకీయ అధికారాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి మధ్య ఒక సామాజిక సమరం పునః ప్రారంభమయింది. ఈ పోరాటం మన రిపబ్లిక్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 01:47 AM