Share News

శక్తిని సృష్టించాం.. నియంత్రించగలమా?

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:45 AM

అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో 1945 జూలై 16. ‘ట్రినిటీ’ పేరిట తొలి అణు పరీక్ష జరిగింది. ప్రకృతిలో దాగి ఉన్న అపారమైన శక్తిని మనిషి అర్థం చేసుకోవడమే కాకుండా దాన్ని తన చేతుల్లోకి తీసుకోగలడని...

శక్తిని సృష్టించాం.. నియంత్రించగలమా?

అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో 1945 జూలై 16. ‘ట్రినిటీ’ పేరిట తొలి అణు పరీక్ష జరిగింది. ప్రకృతిలో దాగి ఉన్న అపారమైన శక్తిని మనిషి అర్థం చేసుకోవడమే కాకుండా దాన్ని తన చేతుల్లోకి తీసుకోగలడని నిరూపితమైన క్షణమది. అణుశక్తి మానవ నాగరికత అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరిచింది. అదే సమయంలో ప్రమాదకరమైన అణ్వాయుధ పోటీకి నాంది పలికింది. 1945 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేలాది అణు పరీక్షలు జరిగాయి. వాటి ప్రభావం పరీక్షా కేంద్రాలకే పరిమితం కాలేదు. రేడియేషన్‌, పర్యావరణ కాలుష్యం, మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు... మనిషి సృష్టించిన మహాశక్తి మరో ముఖాన్ని చూపించాయి.

1991 ఆగస్టు 29న కజకిస్థాన్‌లోని సెమిపలాటిన్స్క్‌ అణు పరీక్షా కేంద్రాన్ని మూసివేశారు. 1949 నుంచి 1989 మధ్య అక్కడ 456 అణు పరీక్షలు జరిగాయి. వాటి ప్రభావంతో స్థానిక ప్రజలు, భూభాగం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కేంద్రం మూసివేతను పురస్కరించుకుని 2009లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 29ని ‘అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం’గా ప్రకటించింది. ఇది కేవలం గతాన్ని గుర్తుచేసుకునే రోజు కాదు. అణుశక్తి మానవత, దానవతను గుర్తుచేసుకోవడంతో పాటు.. అణు పరీక్షలు నిలిపివేసి, అణ్వాయుధ రహిత ప్రపంచం దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే రోజు. ఎందుకంటే శక్తిని సృష్టించడం ఒక విజయమైతే.. దాన్ని నియంత్రించగలగడం అంతకుమించిన విజయం.

ప్రతి గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణ మనిషి సామర్థ్యాన్ని పెంచింది. అగ్నిని అదుపులోకి తెచ్చాం. చక్రాన్ని కనిపెట్టాం. ఆవిరి శక్తిని ఉపయోగించుకున్నాం. విద్యుత్తును వినియోగించుకున్నాం. అణుశక్తిని విప్పాం. ఇప్పుడు కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్నాం. సాంకేతిక శక్తి పెరిగే కొద్దీ దాని ప్రభావం కూడా పెరుగుతోంది. వేల కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులు, డ్రోన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సైబర్‌ దాడులు భౌతిక సరిహద్దులను దాటి కీలక వ్యవస్థలను ప్రభావితం చేయగలవు. మరి అంతటి మహాశక్తి మన చేతుల్లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునే మనిషి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడన్నదే అసలు ప్రశ్న. మరింత స్పష్టంగా చూస్తే సాంకేతికంగా ఎదిగిన ప్రతి నాగరికత.. చివరకు తానే సృష్టించిన శక్తితో ప్రమాదంలో పడుతుందా?

మనిషి ఆవిష్కరణ వేగం పెరుగుతున్న కొద్దీ దానికి తగిన చట్టాలు, నైతిక ప్రమాణాలు, భద్రతా వ్యవస్థలు, అంతర్జాతీయ నియమాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలి. లేకపోతే సాంకేతికత మనిషి చేతిలో సాధనంగా కాకుండా.. మనిషి నియంత్రించాల్సిన శక్తిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటిదాకా మనం నాగరికత అభివృద్ధిని ప్రధానంగా శక్తితో కొలిచాం. ఇక మరో ప్రమాణాన్ని కూడా చేర్చాల్సిన సమయం వచ్చింది. మన చేతుల్లోకి వచ్చిన శక్తిని ఎంత బాధ్యతగా నియంత్రించగలుగుతున్నాం? బహుశా అదే నిజమైన నాగరికతకు కొలమానం కావచ్చు.


సెమిపలాటిన్స్క్‌ పరీక్షా కేంద్రం మూసివేయడం, అణు పరీక్షలపై అంతర్జాతీయ వ్యతిరేకత పెరగడం, సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ) వంటి ప్రయత్నాలు.. మనిషి తాను సృష్టించిన ప్రమాదానికి పరిమితులు విధించేందుకు ప్రయత్నించాడని చూపిస్తున్నాయి. సీటీబీటీ ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాకపోయినా అణు పరీక్షలపై అంతర్జాతీయ ప్రమాణాన్ని బలోపేతం చేయడంలో అది కీలక పాత్ర పోషించింది. శక్తిని సృష్టించిన నాగరికత దానికి పరిమితులు విధించగలదనే నమ్మకం. అదే మన ఆశ. ఆగస్టు 29 కేవలం అణు పరీక్షల చరిత్రను గుర్తుచేసే రోజు కాదు. మనిషి ప్రకృతిలోని అపారమైన శక్తిని తన చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచీ ప్రతి కొత్త సాంకేతిక విప్లవం ఒకే ప్రశ్నను మరింత తీవ్రంగా మన ముందుకు తెస్తోంది: మనం సృష్టించిన శక్తి మన భవిష్యత్తును నిర్ణయిస్తుందా లేక ఆ శక్తి భవిష్యత్తును మనమే నిర్ణయించగలమా?

పశ్చిమాసియాలో ఇటీవలి సంఘర్షణల చరిత్ర ఒక పాఠం చెబుతోంది. సాంకేతికంగా అనుసంధానమైన ప్రపంచంలో ఒక ప్రాంతీయ సంక్షోభం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలదనేదే ఆ పాఠం. అణుయుగం మరో పాఠం చెబుతోంది.. శక్తి పెరిగిన కొద్దీ మానవ తప్పిదానికి చెల్లించే మూల్యం కూడా పెరుగుతుంది. అధునాతన కృత్రిమ మేధస్సు మానవాళి భవిష్యత్తు గురించి హెచ్చరిస్తోంది – మనిషి సృష్టించే శక్తి మరింత వేగంగా పెరగవచ్చు. అందుకే రాబోయే తరాలకు మనం ఇవ్వాల్సిన గొప్ప సాంకేతిక వారసత్వం మరింత శక్తిమంతమైన యంత్రాలు మాత్రమే కాదు. శక్తిని నియంత్రించే తెలివి, బాధ్యత, నైతికత. ప్రతి అభివృద్ధి చెందిన నాగరికత ఎదుర్కొనే ఒక పరీక్ష కావచ్చు. ఆ పరీక్షలో అసలు ప్రశ్న ‘మనిషి ఎంత శక్తివంతుడయ్యాడు?’ కాదు. ‘తన చేతుల్లోకి వచ్చిన శక్తిని తానే ఎంత బాధ్యతగా నియంత్రించగలిగాడు?’ ఆ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానమే.. మానవ నాగరికతకు తదుపరి అధ్యాయం ఉంటుందా.. లేక విశ్వంలోని మరో నిశ్శబ్ద నాగరికతగా మిగిలిపోతుందా అన్నదాన్ని నిర్ణయించవచ్చు.

అర్ధ శ్రీనివాస్ పటేల్ (ఐఐఎస్‌)

(నేడు అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం)

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 01:45 AM