ఐశ్వర్యం నీడలో అప్పుల బతుకులు!
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:34 AM
సంపద పోగుపడుతోంది, సామాన్యుల సంక్షేమం సన్నగిల్లుతోంది! వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం శాతాలు మొదలైన స్థూల ఆర్థిక సూచికలు భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యదాయకంగా, పురోగమన పథంలో ఉన్నదని మనకు విదితం...
సంపద పోగుపడుతోంది, సామాన్యుల సంక్షేమం సన్నగిల్లుతోంది! వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం శాతాలు మొదలైన స్థూల ఆర్థిక సూచికలు భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యదాయకంగా, పురోగమన పథంలో ఉన్నదని మనకు విదితం చేస్తాయి. సగటు కుటుంబ బడ్జెట్‌ను పరిశీలించండి. స్థూల ఆర్థిక సూచికలు ఆవిష్కరిస్తున్న దృశ్యానికి భిన్నమైన వాస్తవ చిత్రం మనకు కనపడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏమంత శ్రేయోదాయకంగా లేదు. సంపద సృష్టికర్తలైన అత్యధిక ప్రజలకు నిజమైన సంక్షేమం లభించడం లేదు. గత పన్నెండు సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న సంపద, వ్యక్తిగత కొనుగోలు శక్తి– ఒక వ్యక్తి తన ఆదాయంతో సమకూర్చుకోగల సరుకులు, సేవలు– మధ్య అతి ముఖ్యమైన లంకె తెగిపోయింది.
అనేక వృత్తులు, ఉద్యోగాలలో వాస్తవ వేతనాలు (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసినవి) పెరగలేదు. అసంఖ్యాక శ్రామిక కుటుంబాలు తమ జీవన వ్యయాలకు రుణాలు తీసుకోవల్సిన అగత్యంలో ఉన్నాయి. ఇదొక నిష్ఠుర నిజం. క్రెడిట్ కార్డు రుణాలపై ఆధారపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అంతకంటే ముఖ్యంగా పదే పదే ఆ రుణాలు తీసుకోవడమూ పెరుగుతోంది. బంగారు ఆభరణాలు మొదలైన స్త్రీ ధనాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడమూ విరివిగా జరుగుతోంది. స్తంభించిన వేతనాలు, పెరుగుతున్న వినియోగ వ్యయాలకు మధ్య అంతరాన్ని పూడ్చుకునేందుకు రుణాలు చేయడం తప్పనిసరి అయిపోయింది. వర్తమాన జీవన వాస్తవమిది. మన సమాజంలో ఇప్పుడు వేతన–రుణ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నది ఆ కఠోర వాస్తవం స్పష్టం చేస్తోంది. వేతనాలు వస్తున్నాయి. అవి సరిపోవడం లేదు. అప్పులు చేయడం అనివార్యమవుతోంది. విశేషమేమిటంటే అవి సులభంగా లభిస్తున్నాయి. వాటిని తీర్చడమే సమస్యవుతోంది. వేతన ఆదాయం జీవన వ్యయాలకు సరిపోకపోవడమే అందుకు కారణం. తత్ఫలితంగా శ్రామిక శ్రేణులు అపాయకరమైన ఆర్థిక దుస్థితిలోకి జారిపోతున్నాయి.
భారతీయ కార్మికుల ఆర్థిక ఇక్కట్లకు ధరల పెరుగుదలను కారణంగా చూపడం సమంజసం కాదు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాలకు అంతరాయం కలగడంతో ధరలు పెరిగిన మాట నిజమే. అయితే మనుగడకు రుణాలు తీసుకోవల్సిన అగత్య మేర్పడడానికి కారణం అది మాత్రమే కాదు. జాతి సంపద సృష్టి అవుతున్న, పంపిణీ జరుగుతున్న తీరు తెన్నులే ఆ అసంగత పరిస్థితికి కారణాలని చెప్పి తీరాలి. ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా పురోగమిస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు సదా ఊర్ధ్వ దిశలో ఉంటున్నాయి. అయితే పెరుగుతున్న జాతి సంపద, దానిని సృష్టించడంలో కీలకపాత్ర వహిస్తున్న శ్రామిక శ్రేణులకు సక్రమంగా, న్యాయబద్ధంగా పంపిణీ అవుతుందా? లేదు అనేదే కచ్చితమైన సమాధానం.
వేతన అంతరాలు సుదీర్ఘకాలం కొనసాగితే దాని ప్రభావం స్థూల ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుందనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. వేతనాలు బెత్తెడుగా ఉండిపోవడం, వ్యయాలు బారెడు కావడం వల్లే భారతీయ కుటుంబాల నికర పొదుపు మొత్తాలు రికార్డు స్థాయిలో తగ్గిపోతున్నాయి. స్థూల జాతీయ వినియోగ ఆదాయం (జీఎన్‌డీఐ)లో 7 నుంచి 8శాతంగా ఉండే ఈ పొదుపు మొత్తాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5.2శాతానికి తగ్గిపోయాయి. అయితే స్థిర, చరాస్తులు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు 2014లో 3శాతం నుంచి 2023లో 5.7శాతానికి పెరిగాయి. ఫలితంగా చెల్లించవలసిన అప్పుల మొత్తాలు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. కోవిడ్ ఉపద్రవంలో కుదేలయిన దేశ ఆర్థిక వ్యవస్థ ఆ తరువాత బాగా కోలుకున్నదనడంలో సందేహం లేదు. అయితే ఈ ఆర్థిక పునరుద్ధరణ వేతనాల నైష్పత్తిక పెరుగుదల వల్ల కాకుండా కార్పొరేట్ లాభాల పెరుగుదల వల్లే అన్నది ఒక చేదు సత్యం.
2014–25 సంవత్సరాల మధ్య అనియత కార్మికుల వాస్తవ వేతనాల వార్షిక పెరుగుదల రేటు 1.5శాతం కంటే తక్కువగా ఉన్నది. ఈ వేతన అణచివేతకు తోడు పట్టణ ప్రాంతాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడడంతో శ్రామిక శ్రేణుల జీవన పరిస్థితులు మరింత అధ్వానమయ్యాయి. పైగా 2018–19 సంవత్సరం నుంచి తిరోగమన వలసలు (ఉద్యోగాలు హరించుకుపోవడం, ఉపాధి అవకాశాలు మృగ్యమవడంతో పట్టణాలు, నగరాలకు వలసలు వచ్చినవారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోవడం) పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే వ్యవసాయేతర రంగాల నుంచి వ్యవసాయరంగ ఉపాధులకు లక్షలాది శ్రామికులు తిరిగి వెళ్ళిపోతున్నారు.
వేతనాల పెరుగుదలకు ప్రత్యామ్నాయంగా రుణలబ్ధి అవకాశాలు ఇతోధికంగా పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి అదెంతవరకు ఉపకరిస్తుంది? సమాధానం స్పష్టమే. వేతనాలు పెరగకపోయినా రుణలబ్ధి అవకాశాలు ఇతోధికమవడంతో వినియోగదారు రుణాల స్వభావం మౌలికంగా మారిపోయింది. కుటుంబ రుణాలు ఇతోధికంగా పెరిగిపోవడం కంటే శ్రామిక ప్రజలు తమ జీవన వ్యయాల కోసం గణనీయంగా ఆ రుణాలపై ఆధారపడుతున్న పరిస్థితే బాగా కలవరపరుస్తోంది. ఇది దేశానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ అత్యవసర రుణాలు దేశ ప్రగతికి ఆటంకమవుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయంగా భారతీయ కుటుంబాలు తమకు డబ్బు అవసరమయినప్పుడు గృహాలు, పొలాలు, బంగారం మొదలైన వాటిని తనఖా పెట్టడం పరిపాటి. దీనివల్ల వారి తక్షణావసరాలు తీరడంతో పాటు స్థిర, చరాస్తుల రూపంలో భద్ర భవిష్యత్తును సమకూర్చుకునేందుకు కూడా దోహదం జరిగేది. మనుగడ కోసమే రుణాలు తీసుకోవలసిరావడం పరిస్థితులను సంక్లిష్టం చేస్తోంది. సురక్షితం కాని వ్యక్తిగత రుణాలు, వినియోగదారు రుణాల వార్షిక పెరుగుదల రేట్లు ఇటీవలి సంవత్సరాలలో 22 నుంచి 25శాతానికి పెరిగాయని ఆర్థిక సుస్థిరతపై ఆర్బీఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) నివేదికలు వెల్లడించాయి. క్రెడిట్ కార్డులపై రుణాలు తీసుకోవడం, ఆభరణాలు మొదలైనవి తాకట్టు పెట్టి అప్పులు చేయడమనేది బాగా పెరిగిపోయింది. అయితే ఈ రుణాలు తిరిగి చెల్లించడం అంత చురుగ్గా జరగడం లేదు. ఫలితంగా వెండి, బంగారు ఆభరణాలకు సంబంధించి, చెల్లించని రుణాల మొత్తం రూ. 3.38 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్బీఐ నివేదికలు వెల్లడించాయి. ఏటా ఈ రుణ బాకీల మొత్తం భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నది.
శ్రామిక కుటుంబాలు అధిక వడ్డీలతో సమకూర్చుకుంటున్న స్వల్పకాలిక రుణాలను తమ తక్షణావసరాలకు వినియోగించుకుంటున్నాయి. ఈ రుణాలను అవి తమ భావి ఆర్థిక స్తోమత భరోసాతోనే తీసుకుంటున్నాయనేది గమనార్హం. రేపో, మాపో లేదా ఆ తరువాతో తప్పకుండా అప్పు తీర్చగలమనే విశ్వాసంతోనే శ్రామిక కుటుంబాలు ఇలా రుణగ్రస్తమవుతున్నాయి. ఇదొక అవివేక వ్యవహారం. ఎందుకని? ఈ తరహా రుణాలు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను నిర్లక్ష్యం చేయడమే, సందేహం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే శ్రామిక కుటుంబాల శ్రేయస్సుకు ఈ రుణాలు తోడ్పడవు. అప్పు చేసి పప్పు కూడు లాంటి ఈ రుణాలు, ఆదాయం పెరుగుదలతో సమకూరే ఆర్థిక భద్రతను ఇవ్వలేవు. ఒక స్థిరమైన సామాజిక భద్రతా వలయాన్ని సమకూర్చవు. ఇటువంటి సులభ రుణాల వల్ల శ్రామిక కుటుంబాల ఆర్థిక నష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ కఠోర సత్యంతో పాటు వాస్తవ వ్యవసాయ వేతనాల వార్షిక పెరుగుదల 1శాతం కంటే తక్కువగా ఉందనే యథార్థాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవల్సి ఉన్నది. ఈ వాస్తవాలు స్పష్టం చేస్తున్నదేమిటి? దేశ ఆర్థిక వ్యవస్థ ఒక తీవ్ర సంక్షోభం ముంగిట ఉందనే కాదూ?
దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో ఉన్నదని స్థూల ఆర్థిక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. నిజమే. అయితే ఆ వృద్ధి సమరీతిలో లేదు. ఈ అసమాన వృద్ధి నుంచి సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి మనం పురోగమించాలి. ఇది జరగాలంటే సరఫరా సంబంధిత ప్రోత్సాహకాల (కార్పొరేట్ పన్ను కోతలు, మూలధన రాయితీలు వగైరా)కు స్వస్తి చెప్పాలి. వాటికి బదులుగా శ్రామిక శ్రేణులకు శ్రేయస్సును సమకూర్చే విధానాలకు ప్రాధాన్యమివ్వాలి. ఇది తప్పనిసరి. కార్పొరేట్ సంస్థలకు సమకూర్చిన లబ్ధి పారిశ్రామిక ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించిందే కానీ, శ్రామిక శ్రేణుల వేతనాలలో వాస్తవ పెరుగుదలకు దోహదం చేయలేదు. తప్పనిసరి వినియోగ వస్తువులు, నిత్యావసర సేవలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను హేతుబద్ధీకరించాలి. ప్రాథమిక మానవ అవసరాలను తీర్చే ఆ సరుకులు, సేవలు శ్రామిక కుటుంబాలతో సహా సమస్త అల్పాదాయ వర్గాల వారికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. శ్రామిక శ్రేణులపై పన్నుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రగతిశీల ప్రత్యక్ష పన్నులపై మరింతగా ఆధారపడేందుకు ప్రభుత్వం సుముఖత, సంసిద్ధత చూపాలి. ఇందులో భాగంగా శ్రమ–సాంద్ర సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమలను పునశ్శక్తిమంతం చేయాలి. భారీ ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగాన్ని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింప చేసినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ సకల జనులకు శ్రేయోదాయకంగా పురోగమిస్తుంది. విస్మరించకూడని, తక్షణమే చేపట్టవలసిన మరో చర్య జాతీయ కనీస వేతనం పెంపుదల. ఇది లక్షలాది కార్మికులకు ఆర్థిక భద్రతను సమకూర్చుతుంది. ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థ పురోగతి వేగవంతమవుతుంది. ఆరోగ్య భద్రత, విద్యారంగాలకు బడ్జెట్ కేటాయింపులను విధిగా పెంచి తీరాలి. విద్యా వైద్యరంగాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నాయి. ఆ నష్టాలను భరించడం తమకు మోయలేని భారమని అనేక రాష్ట్రాల పాలకులు సణుగుతున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వమే ఆ నష్టాలను భరించేందుకు ముందుకు రావాలి. ఇది జరిగితే ఆరోగ్య భద్రత, పిల్లల విద్యా సదుపాయాల విషయంలో కుటుంబాలకు ఆర్థికభారం తగ్గుతుంది. తమ ఆదాయాన్ని ఇష్టానుసారం వ్యయం చేయగల వెసులుబాటు వాటికి లభిస్తుంది. ఇటువంటి మార్పుతో మనుగడ కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నుంచి శ్రామిక కుటుంబాలు బయటపడతాయి.
దీపాంశు మోహన్
అర్థశాస్త్ర ఆచార్యులు
శ్రిసోనియా సుబ్రమణియం పరిశోధకురాలు
జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం
(హిందుస్థాన్ టైమ్స్)
ఈ వార్తలు కూడా చదవండి..
చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్
నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
For More National News And Telugu News