అది మన ఆత్మగౌరవ సంకేతం!
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:43 AM
అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను బయటి దేశాలవారే ఎక్కువగా పొందుతున్నారనే ఉద్దేశంతో ఆ పథకాలపై ఆధారపడి జీవిస్తున్న వలసదారుల లెక్కలు తీసింది ట్రంప్ ప్రభుత్వం. ఈ లెక్కల...
అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను బయటి దేశాలవారే ఎక్కువగా పొందుతున్నారనే ఉద్దేశంతో ఆ పథకాలపై ఆధారపడి జీవిస్తున్న వలసదారుల లెక్కలు తీసింది ట్రంప్ ప్రభుత్వం. ఈ లెక్కల ఆధారంగా ఏకంగా 75 దేశాల పౌరులకు కొత్తగా అమెరికా రావడానికి అవసరమైన వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ దేశమైనా సొంత పౌరుల కోసమే ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తుంది. కానీ నిబంధనల్లో లొసుగుల్ని వాడుకుంటూ ఆ ప్రయోజనాల్ని ఇతరులు గరిష్ఠంగా కాజేస్తోంటే ఎవ్వరైనా ఏం చేస్తారో ట్రంప్ కూడా అదే చేశారు. గమనించాల్సిన అంశం ఏంటంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు, రష్యా వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. భారత్ మాత్రం ఈ జాబితాలో లేదు. అమెరికాలో అడుగుపెడుతున్న భారతీయులు తమ నైపుణ్యాలు, సామర్థ్యాల మీద ఆధారపడి బతుకుతున్నారే తప్ప, అమెరికా ప్రభుత్వపు దయాదాక్షిణ్యాల మీద కాదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
ట్రంప్ నిర్ణయం కొందరికి కంటగింపుగా కనిపించవచ్చు. అధికారికంగా వీసా ప్రాసెసింగ్ నిలిపివేయకుండా కేవలం వీసాలు తిరస్కరిస్తూ వచ్చినా ఇంత చర్చ జరిగేది కాదు. కానీ ట్రంప్ తాను ఆయా దేశాలను వెలివేస్తున్నట్టు స్పష్టం చేయదల్చుకున్నారు కనుకనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఆయా దేశాలకు చెందిన వలసదారులు అక్కడి సంక్షేమ పథకాలన్నింటినీ హైజాక్ చేసేస్తుండటం ఆ తీవ్ర నిర్ణయానికి దోహదం చేసింది. ఈ జాబితాలో అమెరికాతో పోటీపడగల అగ్రదేశం అని చెప్పుకునే చైనా నుంచి చిన్న దేశాల వరకు అనేకం ఉన్నాయి... మనం తప్ప! అమెరికాలోని భారతీయుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే అంశం అది. అమెరికన్లు కూడా మనల్ని గౌరవించి తీరాల్సిన సంగతి ఇది. అమెరికన్ వ్యవస్థకు భారతీయులు కంట్రిబ్యూట్ చేస్తున్నారే తప్ప, అమెరికా నుంచి వారు తీసుకునే విధంగా లేరు. ఇందుకు భారతీయుల జీవన విధానంలోని క్రమశిక్షణ, ఆర్థిక వనరుల నిర్వహణ, తమ కాళ్లపైనే తాము నిలబడాలనుకునే ధోరణి ఒక కారణం.
భారతీయ వలసదారులు ఎక్కువగా నైపుణ్య ఆధారిత, ఉన్నత వేతనాలు గల రంగాల్లోనే ఉన్నారు. సాంకేతిక, వైద్య, ఇంజనీరింగ్, పరిశోధన, వ్యాపార రంగాల్లో పనిచేస్తున్నారు. ఇవి స్థిరమైన ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు. కాబట్టి ప్రభుత్వ సహాయం, పథకాలను అర్థించే స్థితిలో భారతీయులు లేరు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, 2023 నాటికి అమెరికాలో సుమారు 52 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అమెరికాలోని అన్ని ప్రధాన వలస సమూహాల్లో భారతీయుల కుటుంబాల సగటు ఆదాయం అత్యధికం. 2023లో ఆసియా–అమెరికన్ కుటుంబాల సగటు ఆదాయం సుమారు లక్షా అయిదు వేల డాలర్లుగా ఉన్నా, భారతీయుల ఆదాయం దానికన్నా ఎక్కువ. భారతీయుల నేతృత్వంలోని కుటుంబాల సగటు వార్షిక ఆదాయం లక్షా యాభై వేల డాలర్లకు పైగా ఉంది. ఇది అమెరికా జాతీయ సగటును మాత్రమే కాదు, ఇతర వలసదారుల సగటును కూడా దాటింది. ఈ అధిక ఆదాయం కారణంగా భారతీయులు స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు భారీగా పన్నులు చెల్లిస్తున్నారు. ఆర్థికంగా చూస్తే, వారు వ్యవస్థ నుంచి తీసుకునేదాని కంటే ఎక్కువగా అందిస్తున్నారు. అందుకే భారతీయ అమెరికన్లను ‘నికర కంట్రిబ్యూటర్లు’గా ఆర్థిక నిపుణులు పిలుస్తున్నారు.
వలస విధానాలు ఎలా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానికి భారత్ మంచి ఉదాహరణ. నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం, విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన వలస మార్గాలు సమాజాన్ని బలపరుస్తాయి. ఆర్థిక వ్యవస్థను నిలబెడతాయి. ఇటు సొంత దేశాన్ని, అటు వలస వెళ్లిన దేశాన్ని కూడా గౌరవప్రద స్థితిలో ఉంచుతాయి. అమెరికాలో భారతీయ వలసదారులు ఎక్కువగా సంపాదిస్తున్నారు, ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నారు, అక్కడి ప్రభుత్వ సహాయంపై తక్కువగా ఆధారపడుతున్నారు. అన్ని దేశాల వీసా ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం ఒక రకంగా అమెరికాలోని భారతీయులకు సానుకూలాంశం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాధారిత గ్రీన్ కార్డుల జారీ విషయంలో ఇది ఎన్నారైలకు కలిసొచ్చే సంగతి. ఈ దేశాల వీసాలు ఆగిపోవడం వలన, ఈ ఏడాది సెప్టెంబరు నాటికి కొత్తగా యాభై వేలకు పైగా గ్రీన్ కార్డ్ స్లాట్స్ ఖాళీ అవుతాయి. ఈ 75 దేశాలకు చెందినవారు గ్రీన్ కార్డ్ స్లాట్స్‌ను వినియోగించుకోలేరు. ఆ పరిణామం భారత్ వంటి దేశాల వారు త్వరగా గ్రీన్ కార్డులు పొందే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
కృష్ణమోహన్ దాసరి
పాత్రికేయుడు, డల్లాస్
ఈ వార్తలు కూడా చదవండి..
తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
For More National News And Telugu News