ఆర్థిక వివేకం లేని అధికార లాలస
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:26 AM
ఇప్పటికి కనీసం ఒక ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. రూపాయి విలువ బాగా పడిపోయింది, దేశం నుంచి పెట్టుబడి తరలిపోతోంది. దేశీయ ప్రైవేట్ మదుపులు వెనుకబడ్డాయి....
ఇప్పటికి కనీసం ఒక ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. రూపాయి విలువ బాగా పడిపోయింది, దేశం నుంచి పెట్టుబడి తరలిపోతోంది. దేశీయ ప్రైవేట్ మదుపులు వెనుకబడ్డాయి. వినియోగ డిమాండ్ తగ్గిపోయింది. వస్తూత్పత్తి రంగం స్తబ్ధమయింది. సంపన్నులు, అంతగా సంపన్నులు కాని వారి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు వేగంగా పెరుగుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా అగ్రగామి ఐటీ కంపెనీల షేర్ల విలువలు పడిపోతున్నాయి. ఈ బహువిధ సమస్యలన్నిటినీ మార్కెట్ మూడ్ ప్రతిబింబిస్తోంది. ప్రధాన సూచీలు అన్నీ రెండు సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాయో ఇప్పుడూ అక్కడే ఉన్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను అంగీకరించి వాటిని అధిగమించేందుకు అవసరమైన సంస్కరణలకు సత్వరమే శ్రీకారం చుట్టాలని మోదీ ప్రభుత్వానికి పలువురు ఆర్థికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ దినపత్రికలలో ఈ విషయమై వారు వ్యాసాలు రాస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభమైన తరువాత ఆ వ్యాసాలు దాదాపు ప్రతి రోజూ ప్రచురితమవుతున్నాయి. గ్యాస్, ఎరువులు, ఇతర సరుకుల మార్కెట్లపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపించే నిధులు తగ్గిపోయాయి. తత్ఫలితంగా మన విదేశీ మారకద్రవ్య నిల్వలు మరింతగా తగ్గిపోయాయి.
కస్టమ్స్ అధికారులు, పన్ను వసూళ్ల యంత్రాంగంతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించేలా చేయడంతో సహా పలు సంస్కరణ చర్యలను ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఆరోగ్య భద్రత, విద్యపై మరింత ఎక్కువగా ఖర్చు చేయాలని, శ్రమ సాంద్ర వస్తూత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలని, మదుపుదారులకు సమానావకాశాలు సృష్టించాలని, తమకు ప్రీతిపాత్రులైన పెట్టుబడిదారులు మాత్రమే అత్యధిక ప్రాజెక్టులను స్వాయత్తం చేసుకోకుండా నిరోధించాలని, ఎరువుల, విద్యుత్ సబ్సిడీలను తగ్గించాలని, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్షకు స్వస్తి చెప్పాలని, ఆర్థిక వ్యవహారాల సంబంధిత మంత్రిత్వ శాఖలలో అత్యున్నత బాధ్యతల్లో ఉండి తమ విధ్యుక్త ధర్మాలను సమర్థంగా నిర్వహించని రాజకీయవేత్తలు, అధికారుల స్థానంలో బాగా సమర్థులైన, దీక్షాదక్షతలు ఉన్న వారిని నియమించాలని కూడా ఆర్థికవేత్తలు స్పష్టంగా సూచిస్తున్నారు.
మన ప్రముఖ ఆర్థికవేత్తల సిఫారసులు కుల మతాలు, జెండర్, ప్రాంతాలు, రాజకీయ విశ్వాసాలకు అతీతంగా సమస్త భారతీయులకు సంక్షేమం, ఆర్థిక భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వారి సూచనలకు అదనంగా నేనూ నా సొంత సూచన ఒకటి చేయదలిచాను: ఎల్లెడలా వాయు, నీటి కాలుష్యాన్ని పెంపొందిస్తూ నేల సారాన్ని క్షీణింపజేస్తున్న, అడవులను నిర్మూలిస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టాలి.
కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులను అంగీకరించి, వాటి అమలుకు పటిష్ఠ చర్యలు చేపడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం వ్యతిరిక్తంగా ఉంటుందని ఈ కాలమిస్టు విశ్వసిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో అతి ముఖ్యులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలను ప్రేరేపిస్తున్న ఉద్దేశాలు, సంకల్పాలు ఏమిటో నిశితంగా పరిశీలిస్తే ఆ సమాధానం సరైనదని స్పష్టమవుతుంది.
నా అవగాహన ప్రకారం, ప్రధానమంత్రిని మూడు ఆకాంక్షలు ప్రభావితం చేస్తున్నాయి. మొదటిది.. సాధ్యమైనంత వరకు పదవిలో కొనసాగడం. మోదీ ఇప్పటికే 75 సంవత్సరాలు పైబడిన వయసులో ఉన్నారు. అంత వయసు ఉన్న నాయకులను పార్టీ ‘మార్గదర్శక్ మండల్’కు పంపాలని ఆయనే స్వయంగా సిఫారసు చేశారు. వయసు పెరుగుతున్నా అధికారం నుంచి వైదొలిగేందుకు మోదీ సిద్ధంగా లేరు. సార్వత్రక ఎన్నికలలో వరుసగా నాలుగో పర్యాయం కూడా విజయం సాధించాలనే పట్టుదల మోదీలో ప్రగాఢంగా ఉన్నది. తాను బహిరంగంగా విమర్శిస్తూ, రహస్యంగా అసూయపడుతున్న జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించడమే మోదీ అభిమతం. తన వ్యక్తి పూజను మరింతగా ప్రోత్సహించడం మోదీ రెండో ఆకాంక్ష. ప్రభుత్వ ధనాన్ని భారీ మొత్తంలో ఇందుకు వెచ్చిస్తున్నారు. పెట్రోల్ పంపులు, విమానాశ్రయాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లు ఇంకా డజన్ల కొద్దీ వేర్వేరు ప్రదేశాలలో సర్వే సర్వత్రా మోదీ బొమ్మ కనిపిస్తూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రదేశాలన్నిటిలోనూ మోదీ మీకు దర్శనమిస్తూనే ఉంటారు. ప్రధానమంత్రి స్వాతిశయానికి అవధులు లేవు. సదా ప్రజల దృష్టిలో ఉండాలని, సకల జనుల చేత ఆరాధింపబడాలని ఆయన ప్రగాఢంగా కోరు కుంటారు. ఎలాగైనా సరే ‘హిందూ రాష్ట్ర’ను సృష్టించడం ఆయన మూడో ఆకాంక్ష. పన్నెండేళ్ల క్రితం 2014లో ‘సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్’కు కృషి చేస్తానని ప్రధానమంత్రి వాగ్దానం చేశారు. అయితే ఇచ్చినంత వేగంగానే ఆయన ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయన తనను తాను హిందువుల నాయకుడుగా మాత్రమే నివేదించుకుంటున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో ఆయన పూజలు, సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ అమృతోత్సవాలు మొదలైనవి అందుకు ఉదాహరణలు.
నరేంద్ర మోదీ మూడు ఆశయాలలో అమిత్ షా రెండిటిని పూర్తిగా పంచుకుంటున్నారు: తనకు మరింతగా రాజకీయ అధికారం, హిందూ మెజారిటేరియనిజంను ప్రోత్సహించడం. ఎన్నికల కార్యకలాపాలలో ఆయన అంతకంతకూ ఎక్కువ సమయాన్ని గడపడం, ప్రభుత్వ వ్యవహారాలపై పెరుగుతున్న ఆయన ప్రభావం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: అమిత్ షా ఇంకెంత మాత్రం తననుతాను మోదీ విధేయ అనుయాయిగా కాకుండా మోదీకి అనివార్య రాజకీయ వారసుడుగా భావించుకుంటున్నారు. మోదీ వలే అమిత్ షా కూడా హిందూ రాష్ట్రను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఆశిస్తున్న హిందూ రాజ్యంలో ఇతర మతాల వారు... ముఖ్యంగా ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా మాత్రమే ఉంటారు. హిందూ రాష్ట్ర స్వప్న సాకారానికి అమిత్ షా తన బాస్‌కంటే ఎక్కువగా కృషి చేస్తున్నారు. ముస్లింలను నిందించడం ఆయనకొక నిత్య వ్యాపకం.
తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుని, విస్తరింపజేసుకోవడమే మోదీ, షాల పరమ ధ్యేయం. ఈ లక్ష్యం పైనే వారు తమ మనసును కేంద్రీకరించారు. పరస్పర సంబంధమున్న నాలుగు పరస్పర రీతుల్లో వారు ఆ లక్ష్యసాధనలో సఫలమయ్యారు. మొదటిది.. సంఘటిత హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం. ముస్లిం మైనారిటీలు తమపై పెత్తనం చేసే రోజులు వస్తాయనే భయభ్రాంతులను హిందువులలో సృష్టిస్తున్నారు. తద్వారా వారిలో 60శాతం మంది బీజేపీకి ఓటు వేస్తే ఆ పార్టీ ఓట్ల వాటా ఇంచుమించు 45శాతంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ ఓటు బ్యాంకు సరిపోతుంది. రెండోది.. మహిళలు, రైతులు మొదలైన సామాజిక వర్గాలకు క్రమబద్ధంగా నగదు చెల్లింపులు చేయడం. ఈ చెల్లింపుల సొమ్ము స్వల్పమే అయినా ప్రభుత్వం తమకు ఏదో ఒకటి చేస్తుంది కదా అనే సంతృప్తి ఓటర్లలో కలుగుతుంది. మూడోది.. ప్రభుత్వ సంస్థలపై పూర్తి నియంత్రణ సాధించి తమ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఉపయోగించడం. ఇప్పటికే ఎన్నికల సంఘం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ విధంగా దుర్వినియోగమవుతున్నాయి. నాల్గవది.. ఎంపిక చేసుకున్న పెట్టుబడిదారులను ప్రోత్సహించడం. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందిన ఆ కుబేరులు బీజేపీకి ఆర్థిక వనరులు సమకూర్చుతారు.
జూన్ 2013లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను, 14 రాష్ట్రాల లోను అధికారంలో ఉన్నది. అప్పట్లో బీజేపీ కేవలం నాలుగు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్నది. 2014 నుంచి మూడు సార్వత్రక ఎన్నికలను వరుసగా గెలిచిన బీజేపీ ఇప్పుడు 22 రాష్ట్రాలలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ కేవలం ఐదు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పతనానికి కారణమేమిటి? పార్టీ నాయకత్వ అవివేకమే, బీజేపీ దశ తిరగడానికి ప్రధాన కారణం మోదీ–షాలు అనుసరించిన విజయసూత్రం: హిందూత్వ, సంక్షేమ సహాయాలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మరీ ముఖ్యంగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. దేశ రాజకీయాలలో మోదీ–షా ద్వయానికి తిరుగులేని ప్రాబల్యం లభించడం, పత్రికా స్వాతంత్ర్యం అణచివేత, గోది మీడియా ప్రభావశీలత పెరుగుదల ఏకకాలంలో జరిగాయి. టెలివిజన్ విషయంలో స్వేచ్ఛను అణచివేయడమేగాక న్యూస్ యాంకర్లను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పారు. ఆ యాంకర్ మహానుభావులు ప్రతిపక్షాలను అదేపనిగా తప్పుపట్టడమే కానీ ప్రభుత్వ జవాబుదారీతనాన్ని రవ్వంత కూడా ప్రశ్నించే పాపానికి పోరు.
ఇదిలా ఉండగా దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం మరింతగా దిగజారిపోతోంది. గల్ఫ్ యుద్ధంతో పెరిగిన చమురు ధరలు ఇంకా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో మన ఆర్థికవేత్తలు ప్రతిపాదిస్తున్న సంస్కరణలు చాలా ముఖ్యమైనవేగాక అత్యవసరమైనవి కూడా. ప్రభుత్వానికి వాటిని అమలుపరిచే సంకల్పం ఉన్నదా అన్నది ప్రశ్న. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో (పుకార్లు నిజమైతే) రాజకీయ పార్టీలతో సంబంధం లేని వృత్తి నిపుణుడు అయిన ఆర్థికవేత్త ఒకరు మంత్రి అయ్యేందుకు అవకాశమున్నది. అయితే ఆర్థిక నిపుణులు సూచిస్తున్న సంస్కరణలు సార్థకంగా అమలుపరుస్తారా? నరేంద్రమోదీ, అమిత్ షా గురించి మనకు తెలిసిన దాన్నిబట్టి సహజంగానే కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి: ఆశ్రిత పక్షపాతాన్ని వారు ఎలా వదులుకుంటారు? స్వేచ్ఛా వాణిజ్య పోటీని ఎలా ప్రోత్సహిస్తారు? ప్రభుత్వ సంస్థలను మరింత సమర్థమైనవిగా, నిష్పాక్షికంగా ఎలా చేస్తారు? విధేయుల స్థానంలో నిపుణులను నియమిస్తారా? హిందూత్వవాదులు చట్టబద్ధ పాలనను ఉల్లంఘించకుండా ఎలా జాగ్రత్త వహిస్తారు?.. వీటన్నిటినీ తమ రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాలకు హాని కలిగించని రీతిలో ఎలా చేస్తారు? చేయగలరు? సంస్కరణల తక్షణ ఆవశ్యకత గురించి సహేతుకంగా వాదించిన ఆర్థికవేత్తలను నేను అభిమానిస్తున్నాను, అభినందిస్తున్నాను. దేశం మేలు కోరి, వారు తమ నైతిక కర్తవ్యాన్ని ప్రశస్తంగా నిర్వహించారు. అయితే వారి అర్థవంతమైన సూచనలు చెవిటివాని ముందు శంఖం ఊదిన చందమే కావచ్చు సుమా!
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News