Share News

తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా?

ABN , Publish Date - May 20 , 2026 | 02:10 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ఇంటింటికీ రకరకాల కానుకలు పంపించేవాడు. ప్రతి సందర్భంలోనూ స్వీట్లు, తినుబండారాలు, పండుగల సమయంలో మగవారికి రేమాండ్ దుస్తులు, మహిళలకు..

తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ఇంటింటికీ రకరకాల కానుకలు పంపించేవాడు. ప్రతి సందర్భంలోనూ స్వీట్లు, తినుబండారాలు, పండుగల సమయంలో మగవారికి రేమాండ్ దుస్తులు, మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసేవాడు. పెళ్లయిన ప్రతి జంటకూ బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండిమెట్టెలు బహూకరించేవాడు. ఇక ఎన్నికల సమయంలోనైతే సరే సరి. ఒక ట్రక్కునే ప్రత్యేకంగా ఉపయోగించి డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టారని వార్తలు వచ్చాయి. అయితేనేం గత ఎన్నికల్లో ఆయన 43వేల ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలయ్యారు.

ప్రజలు తలుచుకుంటే తమను ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే వారు లొంగిపోయే అవకాశాలు లేవని చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ విషయం తెలిసినప్పటికీ దేశంలో రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలను ప్రలోభపెట్టేందుకు, ఓట్లను కొనుగోలు చేసేందుకు నానా యత్నాలు చేస్తుంటారు. దీని వల్ల ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుల పట్ల ఏహ్య భావం ఏర్పడడడం మినహా మరేదీ జరగదు. నాయకులు తమ ఓట్లను కొనుగోలు చేస్తున్నారంటే, వారు రాజకీయాల్లో ఉండి ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారో అన్న సందేహాలు ప్రజలకు తప్పక ఏర్పడుతుంది. ఇదంతా మనను దోచుకున్న సొమ్మే కదా.. అన్న అభిప్రాయం చాలా మందిలో ఉన్నది.

ఇటీవల తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే భారీ ఎత్తున డబ్బులు పంచిపెట్టాయి. ప్రతి నియోజకవర్గానికీ రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పంచిపెట్టారన్నది ఒక అంచనా. రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కవర్లలో డబ్బులు ఉంచి ఈ పార్టీలు నగదును పంచిపెడుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రసారం చేసినా సరే ఎన్నికల కమిషన్ పెద్దగా పట్టించుకోలేదు. భారీ ఎత్తున డబ్బు పంచిపెడుతున్నారని ‘అరప్పోర్ ఇయ్యాక్కమ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే తమకు ఏ మాత్రం డబ్బులు పంచిపెట్టని సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా 15 మంది డీఎంకే మంత్రులు మట్టికరిచారు. నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన ఒక డీఎంకే నేతను ఒక ఆటో డ్రైవర్ ఓడించాడు. మరోచోట ఒక కారు డ్రైవర్ కొడుకు గెలిచాడు. చాలా చోట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించిన టీవీకె అభ్యర్థులు కనీసం 20 నియోజకవర్గాల్లో అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ధనబలం లేకుండా ఎన్నికలు జరిగి ఉంటే విజయ్ ప్రభంజనం వీచేదని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.


ఇటీవలి కాలపు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక రాష్ట్రంలో ప్రజల నుంచి ఓట్లు కొనుగోలు చేయకుండా గెలిచిన ఘనత విజయ్‌కి దక్కింది. విజయ్ నిజానికి రాష్ట్రమంతటా ప్రచారం చేయలేదు. చాలా చోట్ల ఆయన కటౌట్లు, హోలోగ్రామ్‌లు, డూప్‌లతో ప్రచారం చేయించారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఆయన చాలా ర్యాలీలు రద్దు చేసుకున్నారు. టీవీకే అభ్యర్థులు కూడా చాలా చోట్ల పెద్దగా ప్రచారం చేయనేలేదు. కొన్ని చోట్ల డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు వారికి డబ్బులు ఇచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారని సమాచారం. చాలా నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాలకు కూడా టీవీకే అభ్యర్థులు వెళ్లలేదు. తాము గెలిచామని టీవీ ప్రసారాలలో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. విజయ్ సభలకు భారీ ఎత్తున జనం హాజరైనప్పటికీ పార్టీ యంత్రాంగం లేకపోవడం, స్థానిక సమీకరణ సరిగా జరగకపోవడం, నిధుల కొరత, అనుభవం లేని అనామక అభ్యర్థులతో టీవీకే విజయం సాధించడం కష్టమని చాలా మంది భావించారు. అనేక నియోజకవర్గాల్లో చిన్న వ్యాను, రెండు ఆటోరిక్షాలు, కొద్ది మంది పిల్లలు ఈలలు వేస్తూ ముందు వెళుతుండగా అభ్యర్థులు ప్రచారం సాగించారు. చాలా చోట్ల విద్యార్థులు, మహిళలే ఇంటింటికి వెళ్లి స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ప్రచారానికి చిన్నమొత్తాల్లో చందాలు సేకరించారు. కొన్ని నియోజకవర్గాల్లో టీవీకే పోస్టర్లు కూడా లేవు. టీవీకే అభ్యర్థులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లినా వారిని జనం గుర్తు పట్టేవారు కాదు.

తమిళనాడు ఎన్నికలు పార్టీలు ధనబలంతో, కండబలంతో, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి రావాలని చూసేవారికి గుణపాఠం కావాలి. ఎన్నికల బాండ్ల పేరుతో కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు సేకరించడం, నిధులు ఇచ్చిన వారికి రాజ్యసభ సీట్లు కేటాయించడం, చివరకు వారి సంస్థలను ప్రారంభించడం వంటి తిప్పలు పడేవారికి కనువిప్పు కలిగించాలి. అక్రమంగా నిధులు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలకు క్విడ్ ప్రోకోగా ప్రాజెక్టులు కేటాయించాల్సి రావడం, ఆ ప్రాజెక్టుల్లో అవకతవకల్ని విస్మరించడం, ఓట్లు కొనుగోలు చేసినవారు మళ్లీ ఆ నష్టం భర్తీ చేసేందుకు మళ్లీ అవినీతికి పాల్పడడం వంటి దుర్లక్షణాల ద్వారా మొత్తం వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి భారత రాజకీయ, అధికార వ్యవస్థలో ఈ ఎన్నికల అవినీతి కీలక పాత్ర పోషిస్తోంది. చట్టసభల్లో అవినీతిపరులు, కార్పొరేట్లు, సంపన్నులు అధికంగా కనపడుతున్నారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. దేశ జీడీపీలో 20 నుంచి 50శాతం మేరకు ఉన్న నల్లధనం ఈ ఎన్నికల వ్యవస్థలో భాగమయిందనడంలో సందేహం లేదు.


నిజానికి ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెబుతుండగా, ఆచరణలో ఈ మొత్తం ఒక్క పూటకు ఎన్నికల వ్యయానికి సరిపోదని నేతలు అంటున్నారు. 2024 సార్వత్రక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా రూ.10వేల కోట్ల నల్లధనం స్వాధీనం చేసుకున్నప్పటికీ వాస్తవానికి రూ.1.35 లక్షల కోట్లు ప్రవహించిందని, ఇది 2020లో అమెరికా ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఎంతో ఎక్కువ అని ఒక అంచనా. దేశంలో ప్రతి ఓటరుకూ సగటున రూ.1500 ముడుపులు చెల్లిస్తున్నారని సెంటర్ ఫర్ మీడియా స్డడీస్ ఎప్పుడో అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ నియమించే ఎన్నికల పరిశీలకులు ఈ మొత్తం ప్రహసనంలో విదూషకులులా మారారనడంలో అతిశయోక్తి లేదు. ఈ పరిశీలకులు ఎన్నికల అక్రమాలను అరికట్టడం కన్నా ఏ పార్టీని గెలిపించాలన్న అంశంపైనే దృష్టి కేంద్రీకరించారన్నదే తాజా సత్యం.

తమిళనాడు ప్రజలు ఈ అక్రమ, అవినీతి విషవలయానికి స్పందించారని కనపడుతోంది. విజయ్ పార్టీ నుంచి గెలిచిన 107 మంది ఎమ్మెల్యేల్లో 93 మంది తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించినవారు. వారిలో సగం మంది 40–45 మధ్య వయస్సున్నవారు. తమిళనాడులో యువత, దళితులు ఏ దిశన ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, వారికి బూటకపు అస్తిత్వ నినాదాలు, సిద్ధాంతాల పట్ల ఆసక్తి లేదని కూడా అనుకోవడానికి వీలుంది. వారికి కావల్సింది ఒక్కటే వ్యవస్థలు సరిగా పనిచేయడం. తాము చెల్లిస్తున్న డబ్బుకు తగ్గట్లుగా సమర్థమైన సేవలు లభించడం, ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా రెవిన్యూ విభాగాలు సరిగా పనిచేయడం, విద్యుత్ కోతలు, ఆలస్యాలు లేకుండా ఉండడం. రాజకీయ పార్టీలు ఊదరగొట్టే నినాదాలు చేయడం, వారి దృష్టిని మళ్లించేందుకు భావోద్వేగాలను, కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం కంటే వ్యవస్థల్ని యువత మనోభావాలకు తగ్గట్లుగా మార్చినప్పుడే ఈ దేశం అధునాతనంగా, ఆదర్శ రాజ్యంగా మారుతుందనడంలో సందేహం లేదు.


అవినీతి అధికంగా ఉన్న 182 దేశాల సూచికలో మన దేశం 91వ స్థానంలో ఉన్నప్పటికీ వ్యవస్థల్లో లుకలుకల్ని అరికట్టేందుకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో పనిచేసినట్లు కనపడడంలేదు. ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి సారించే రాజకీయ పార్టీలకు వ్యవస్థల బాగోగులపై ఆసక్తి ఉండదు. తమిళనాడులో వలే దేశ వ్యాప్తంగా యువతరాన్ని నవ రాజకీయ చైతన్యం ఆవహిస్తే తప్ప మార్పు ఆగమించే అవకాశాలు లేవు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి...

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 02:10 AM