చర్చించే సంస్కృతిని కాలరాసింది ఎవరు?
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:46 AM
రెండు దశాబ్దాల నాటి మాట. 2007 డిసెంబర్లో ఒక రోజు ఢిల్లీ విమానాశ్రయంలోని లాంజ్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ కూర్చుని ఉండగా, అదే లాంజ్‌లో ఉన్న రాహుల్‌గాంధీ ఆయనను...
రెండు దశాబ్దాల నాటి మాట. 2007 డిసెంబర్లో ఒక రోజు ఢిల్లీ విమానాశ్రయంలోని లాంజ్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ కూర్చుని ఉండగా, అదే లాంజ్‌లో ఉన్న రాహుల్‌గాంధీ ఆయనను చూడగానే వచ్చి నమస్కరించారు. ‘ఆడ్వాణీజీ, మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని పరిచయం చేసుకుని మాట్లాడే అవకాశం నాకు లభించలేదు’ అన్నారు. రాహుల్ తనను తాను అలా పరిచయం చేసుకోగానే ఆడ్వాణీ మనసు ఉప్పొంగిపోయింది. రాహుల్ చూపించిన సహజమైన మర్యాద, తన వయసుకు ఇచ్చిన గౌరవం ఆడ్వాణీకి రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీని గుర్తుచేసుకునేలా చేశాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత రాజీవ్‌గాంధీ కూడా తొలి సమావేశంలో ఆడ్వాణీని ఇదే విధంగా పలకరించారు.
‘ఆడ్వాణీజీ, ప్రస్తుత జాతీయ రాజకీయాలపై మీరేమనుకుంటున్నారు?’ అని ఆయనను రాహుల్ ప్రశ్నించారు. ‘రాహుల్జీ, ప్రధాన స్రవంతిలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యం తగ్గిపోతోంది. ప్రాంతీయ పార్టీలు విస్తరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది’ అని ఆడ్వాణీ అన్నారు. ‘ఇంతకీ మీరేమనుకుంటున్నారు?’ అని రాహుల్‌ను ఆడ్వాణీ అడిగారు. ‘నాకు కూడా అదే అనిపిస్తోంది ఆడ్వాణీజీ’ అని రాహుల్ చెప్పారు. ‘ఈ పరిస్థితి మారిపోవాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి శత్రువులుగా కాక రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించాలి. ఇందుకోసం ముఖ్యమైన జాతీయ అంశాలపై రెండు పార్టీల నాయకులు పరస్పరం మాట్లాడుకుంటూనే ఉండాలి’ అని ఆడ్వాణీ సూచించారు, రాహుల్ తలపంకించారు. ఈ సంభాషణను ఆడ్వాణీయే తన ఆత్మకథలో పూసగుచ్చినట్లు వివరించారు.
పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయిల మధ్య కూడా ఇలాంటి సంబంధాలు ఉండేవి. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు వాజపేయిని భారత ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌కు పంపించిన విషయం అందరికీ తెలిసిందే. 1988లో వాజపేయికి కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు, ఆయనకు చికిత్స చేయించుకునే స్తోమత లేదని తెలిసిన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ఆయనను యూఎన్ సమావేశాలకు భారత ప్రతినిధిగా న్యూయార్క్‌కు పంపించి ప్రభుత్వ ఖర్చులతో ఆయనకు అక్కడ చికిత్స జరిగేలా చూశారు.
రెండు రోజుల క్రితం తన శత వసంతంలోకి ప్రవేశించిన లాల్‌కృష్ణ ఆడ్వాణీ రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం పట్ల గౌరవం ఉన్న అరుదైన నేతల్లో ఒకరు. కేవలం 14 సంవత్సరాల వయసులో ఆరెస్సెస్‌లో చేరిన ఆడ్వాణీ, దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చారు. ఆరెస్సెస్‌పై నిషేధం అమల్లో ఉన్నకాలంలో అజ్ఞాత జీవితం గడిపారు. తొలుత జనసంఘ్, ఆ తరువాత బీజేపీని బలోపేతం చేయడంలో వాజపేయితో కలసికట్టుగా ఆడ్వాణీ కృషి చేశారు. 1984లో ఇందిర మరణానంతర ఎన్నికల్లో రెండే స్థానాలు గెలుచుకున్న బీజేపీకి రాజీవ్‌గాంధీ నిర్ణయాలు ఎంతో కొంత ఊపిరి పోశాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ లౌకికవాదం విషయంలో అనుసరించిన ద్వంద్వ వైఖరుల మూలంగానే అయోధ్య ఉద్యమానికి ఊపు లభించింది. మతం పట్ల ప్రజలకు ఉన్న మమేకతను ఒక సానుకూల దిశలో మళ్లించినట్లయితే దాన్ని జాతీయ పునర్నిర్మాణం కోసం అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దవచ్చునని ఆడ్వాణీ భావించారు. అయితే అలా జరిగిందా అన్నది వేరే విషయం. గుజరాత్ అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీకి పూర్తిగా అండగా ఉండడం ఆడ్వాణీ జీవిత చరిత్రలో చెరిపివేయలేని ఘట్టాలు. వాజపేయి హయాంలో ఏకాభిప్రాయ సాధన కోసం వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి నికార్సయిన ప్రజాస్వామ్యవాదిగా ఆడ్వాణీ వ్యవహరించారు. నరేంద్ర మోదీకి ఎంతగా మద్దతునిచ్చినా, గుజరాత్ అల్లర్ల సమయంలో సీపీఐఎం నేత సోమనాథ్ ఛటర్జీ ఇచ్చిన సమాచారం మేరకు మోదీకి ఫోన్ చేసి కొందరు ముస్లింల ప్రాణాలు కాపాడిన నేత ఆడ్వాణీ అని చెప్పక తప్పదు. జైన్ హవాలా కేసులో తనపై ఆరోపణలు రాగా నిర్దోషిగా తేలనంతవరకూ పార్లమెంట్‌కు పోటీచేయనని ఆడ్వాణీ ప్రకటించారు. ఆయనపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు కానీ, ఏ వ్యాపారవేత్తకో అనుచితంగా మేలు చేశారన్న విమర్శలు కానీ రాలేదు.
బీజేపీ పునరుత్థానం చెందేందుకు తాను ప్రధాన కారకుడైనప్పటికీ 1995లో ముంబైలో జరిగిన బీజేపీ ప్లీనరీ సదస్సులో అటల్‌బిహారీ వాజపేయిని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం (అగ్లీబారీ– అటల్ బిహారీ)... ఆడ్వాణీ తన సీనియర్లను గౌరవించేవారనడానికి నిదర్శనం. ఆడ్వాణీ ప్రకటనను విని నిర్ఘాంతపోయిన వాజపేయి ‘లేదు, ఆడ్వాణీయే మా ప్రధానమంత్రి’ అని మైకులో చెప్పారు. ఆడ్వాణీ అందుకు తిరిగి జవాబిస్తూ ‘లేదు, ప్రకటన ఇప్పటికే జరిగిపోయింది (ఘోషణా హో చుకీ హై)’ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజపేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాజపేయి, ఆడ్వాణీ సంయుక్తంగా విలేఖర్ల సమావేశాల్లో పాల్గొన్న సందర్భాలు, ఎన్డీఏ నిర్ణయాలను మీడియాకు ఆడ్వాణీ వివరించిన సందర్భాలు లేకపోలేదు. వారెప్పుడూ మీడియాకు ముఖం చాటేయలేదు.
రాజకీయ ఎత్తుగడలు, సైద్ధాంతిక విశ్వాసాలు ఎలా ఉన్నా పార్టీలోనూ, బయటా మర్యాదల్ని, పరస్పర గౌరవాల్ని పాటించే నేతలకు ప్రతీకగా ఆడ్వాణీ నిలిచారనడంలో సందేహం లేదు. ‘నా దేశం, నా జీవితం’ పేరిట తాను రాసిన జీవిత చరిత్రను సోనియాగాంధీకి బహూకరించేందుకు 2008లో ఆడ్వాణీ స్వయంగా తన భార్యతో కలిసి జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లారు. ఇరువురూ కాఫీ తాగుతూ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. తనకు, రాజీవ్‌గాంధీకి స్విస్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ నివేదిక విడుదల చేసినప్పుడు ఆ నివేదికకు ఆధారాలు లేవంటూ ఆడ్వాణీకి నేరుగా లేఖ రాశారు. ఆడ్వాణీ అందుకు జవాబిస్తూ, సోనియాకు మనస్తాపం కలిగించినందుకు విచారం వ్యక్తం చేశారు. ఎనిమీ ప్రాపర్టీ బిల్లును ఆమోదించే విషయంలో సోనియాగాంధీని కలుసుకునేందుకు తనకు అభ్యంతరం లేదని ఆయన తన సొంత పార్టీ నేతలకు చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందంపై తీవ్ర వాగ్వివాదాలు జరుగుతున్న సమయంలో ఒక రోజు సోనియా లోక్‌సభ కారిడార్‌లో ఆడ్వాణీని కలుసుకున్నారు. ఆడ్వాణీ బొంగురు గొంతుతో పలకరించేసరికి ‘సభలో గట్టిగా అరుస్తూ మాట్లాడినందుకు మీ గొంతు దెబ్బతిన్నదా ఏమిటి?’ అని సోనియా పరామర్శించారు.
దేశ రాజకీయాల్లో నేతల మధ్య ఇలాంటి సుహృద్భావ వాతావరణం చూసి చాలా కాలమయింది. ఆడ్వాణీ, ప్రమోద్ మహాజన్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి వారు కాంగ్రెస్ నేతలతో చర్చలకు ద్వారాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడేవారు. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కనపడడం లేదు. గత కొంతకాలంగా రాజకీయ నాయకులు పరస్పరం దూషించుకునేందుకు, ఎలాంటి భాషనైనా వాడేందుకు వెనుకాడడం లేదు. విదేశీ శక్తులతో రాహుల్‌గాంధీ కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని, ఆయన ఒక దిమాగీ నక్సల్ అని ఇటీవల ప్రధాని మోదీ విమర్శించారు. ‘కావాలంటే చర్చకు రండి. మీరే విదేశీ శక్తులతో ఎలా కుమ్మక్కయ్యారో నిరూపిస్తా’ అని రాహుల్ సవాలు విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య దూషణలు తీవ్రతరమయ్యాయి. వీధుల్లో నేతల మధ్య వాతావరణం ఎంత కలుషితమైందంటే, పార్లమెంట్ సమావేశాలు సమీపిస్తున్నాయంటే చాలు... వారు కొట్టుకుంటారా అన్న భయం కలుగుతోంది. ఉభయ సభల్లో గందరగోళం మధ్య బిల్లులను ఆమోదించడం మినహా ఏ అంశంపైనా చర్చలు జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంట్ సజావుగా జరగాలన్న అభిప్రాయం ఇరు పక్షాలకూ ఉన్నట్లు లేదు.
జాతీయ ప్రాధాన్యం గల అంశాలపై రెండు ప్రధాన జాతీయ పార్టీలు కనీస ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని, ఎన్నికల రాజకీయాల సంకుచిత పోటీతత్వంలో కనీస చర్చల స్థాయి దెబ్బతినకుండా చూసుకోవడం అవసరమని ఆడ్వాణీ నాడు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో శత్రుత్వమనే భావనే అనారోగ్యకరమైనదని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఇవాళ అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య తలుపులు మూసుకుపోయాయి. ఇరువర్గాల నేతలు ప్రత్యర్థుల నుంచి శత్రువులుగా మారిపోయారు. ఒకరినొకరు దేశద్రోహులుగా నిందించుకుంటున్నారు. ప్రత్యర్థులను శత్రువులుగా చూసినప్పుడు, ప్రతి రాజీ లొంగుబాటులా, ప్రతి కరచాలనం ద్రోహంగా అనుమానానికి గురవుతుందని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
వాజపేయి, ఆడ్వాణీ హయాంలో పార్లమెంట్, న్యాయవ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య సంస్థలన్నీ ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పనిచేయాలనుకునేవారు. ధనబలం, కండబలం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేసేవారు. ఎన్నికల సంస్కరణల కోసం తపించేవారు. వారిరువురూ ఎమర్జెన్సీకి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన నేతలు కనుక న్యాయపోరాటాలకు, వ్యవస్థలు సజావుగా నడిచేందుకు ప్రాధాన్యమిచ్చేవారు. ఇప్పుడు ఇలాంటి మంచి పనుల కోసం ఇరు పక్షాలు చర్చించుకోవడం లేదు. కనీసం నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌పై కూడా ఏకాభిప్రాయ సాధన కోసం చర్చించేందుకు ప్రయత్నాలు జరగడం లేదు. ఓట్ చోరీ గురించి ప్రతిపక్షాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధపడడం లేదు. దేశంలో చర్చించుకునే సంప్రదాయం ఎప్పటినుంచో ఉన్నది. దానిని పునరుద్ధరించి ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడడం అనేది ఒక కలలా కనిపిస్తోంది!
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News