కొత్త ప్రపంచానికి భారత్ ఇటలీ బాట
ABN , Publish Date - May 20 , 2026 | 02:15 AM
భారత్–ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు కీలక మలుపులో నిలిచిన తరుణమిది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన ఇటీవలి కాలంలో ప్రత్యేక వ్యూహాత్మక...
భారత్–ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు కీలక మలుపులో నిలిచిన తరుణమిది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన ఇటీవలి కాలంలో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అవి రూపాంతరం చెందాయి.
అంతర్జాతీయ వ్యవస్థ ప్రగాఢ మార్పులకు లోనవుతున్న ప్రస్తుత సందర్భంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయిలలో క్రమబద్ధ ఆదానప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆయా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన పరివర్తన నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వ బలోపేతం తదితరాలు ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. ఈ దిశగా కొత్త పరస్పర పూరక బలాల ఏకీకరణ సహా ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్ల తయారీ నైపుణ్యంతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో భారత్ శరవేగంగా ఆర్థికవృద్ధిని సాధిస్తోంది. దీంతోపాటు ఇంజనీరింగ్ ప్రతిభ–విస్తృతి, ఆవిష్కరణ–వ్యవస్థాపనావరణ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు దేశాలకుగల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేము నిర్దేశించుకున్నాం. ఇది మా పారిశ్రామిక బలాలను పరస్పరం బలోపేతం చేసుకునే విలువల వ్యవస్థను సంయుక్తంగా సృష్టిస్తుంది.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) బాటలు వేస్తుంది. రక్షణ–ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన–ఔషధ, జౌళి, వ్యవసాయ–ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్‌టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ–భారత్ మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరిపెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష.
‘మేడ్ ఇన్ ఇటలీ’ అనేది అంతర్జాతీయంగా అత్యుత్తమ నాణ్యతకు పర్యాయ పదబంధం. ఇప్పుడిది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిర్దేశిత ఉన్నత నాణ్యత లక్ష్యంతో సహజ సమన్వయం ఏర్పరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ కోసం ఉత్పాదన దిశగా ఇటలీ వ్యాపార సంస్థలలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం.
మా భాగస్వామ్యానికి సాంకేతిక ఆవిష్కరణలే పునాది. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చైతన్యవంతమైన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యంగల వృత్తి నిపుణుల వనరులు, ఇటలీకిగల నవనవీన పారిశ్రామిక సామర్థ్యం మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నిటా మా సహకారం వ్యూహాత్మకంగా రూపొందుతుంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పరిణామశీలతకు ఇతోధికంగా తోడ్పడుతుంది. ఇక భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఇప్పటికే అనేక దేశాల్లో, ముఖ్యంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో సానుకూల స్పందన లభిస్తోంది.
కృత్రిమ మేధ రంగం.. మా రెండు దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. ఈ ఆధునిక సాంకేతికత పురోగమనం బాధ్యతాయుతంగా, మానవాళి కేంద్రితంగా కొనసాగేలా చూడటంలో భారత్, ఇటలీ కృషి చేస్తున్నాయి. ఈ దృక్కోణంతో ‘ఏఐ’ని సార్వజనీన ప్రగతికి.. ప్రత్యేకించి వర్ధమాన దేశాలకు ఒక శక్తిమంతమైన సాధనంగా మేం పరిగణిస్తున్నాం. సాంకేతికత పరిజ్ఞానాలను మానవాళి కేంద్రితంగా ఉంచేందుకు ‘మానవ్’ పేరిట భారత్ ఒక దార్శనిక విధానం అనుసరిస్తోంది. అదేవిధంగా మానవతావాద సంప్రదాయంలో పాదుకున్న మానవ–కేంద్రక ‘అల్గార్–ఎథిక్స్’ను ప్రోత్సహించడంలో ఇటలీ ముందంజ వేసింది. ఈ రెండు దృక్కోణాలు ప్రాతిపదికగా కృత్రిమ మేధ పరిజ్ఞానం సామాజిక సాధికారతను ఉత్తేజితం చేయాలన్నది మా భాగస్వామ్యం నిర్దేశించుకున్న లక్ష్యం. ఈ దిశగా భారత డిజిటల్ స్థాయిని, ఇటలీ నైతిక– పారిశ్రామిక నైపుణ్యాన్ని మేళవిస్తూ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి ఔన్నత్యానికి సేవలందించేలా భరోసా ఇవ్వడమే మా విధానం.
డిజిటల్ సహకారం, సామర్థ్య వికాసం, పటిష్ఠ సైబర్ మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాల ఆదానప్రదానం ద్వారా ప్రతి దేశం ‘ఏఐ’ని తీర్చిదిద్దుకోవాలన్నది మా నిశ్చితాభిప్రాయం. తదనుగుణంగా ప్రయోజనం పొందగలిగే సార్వత్రిక, విశ్వసనీయ, సమాన అవకాశాలుగల డిజిటల్ ప్రపంచ సృష్టి మా ధ్యేయం. ఇటలీ జీ7 అధ్యక్షతకు, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026’ సత్ఫలితాలకు మూలం ఈ సంయుక్త దృక్పథమే. కృత్రిమ మేధను మానవాళి కోసం.. మానవ మేధ సృష్టించిన ఉపకరణంగా మాత్రమే భావించాలి. అంటే– ఆధునిక సాంకేతికత వ్యక్తులకు స్థానభ్రంశం కలిగించదని లేదా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించదని, ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలను తారుమారు చేయదని ప్రస్ఫుటం చేయడమే.
అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలలో భారత్ ఇప్పటికే అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పుడిక ఇటలీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నైపుణ్యం తోడ్పాటుతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టడం సహా భావితరం సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనకు గణనీయ అవకాశాలు అందివస్తాయి. ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భరోసా లభించాలంటే జాతీయ భద్రత–స్థిరత్వం అత్యావశ్యకం. కాబట్టే రక్షణ–భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో సహకార బలోపేతానికి ఇటలీ, భారత్ సంకల్పించాయి. కీలక సముద్ర మార్గాల భద్రతకు భరోసాతోపాటు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లు, మాదకద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనగల సామర్థ్యాన్ని పటిష్ఠం చేయడంలో ఈ సహకారం దోహదం చేస్తుంది.
మా భాగస్వామ్యానికి ఇంధన రంగం మరో మూలస్తంభం. వైవిధ్యభరిత ఇంధన వనరుల దిశగా ప్రపంచ ప్రస్థానంలో ఆవిష్కరణ, పెట్టుబడులు, సహకారం అత్యావశ్యకాలు. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనాల నుంచి హైడ్రోజన్ సాంకేతికతల దాకా.. స్మార్ట్ గ్రిడ్‌ల నుంచి పునరుత్థాన మౌలిక సదుపాయాల వరకూ భారత్ –ఇటలీ ఇప్పటికే సహకారం కొనసాగిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కూడలిగా మారడం కోసం భారత్ కృషి ఫలితంగా మా భాగస్వామ్యానికి అసాధారణ సామర్థ్యం సమకూరుతోంది. పునరుత్పాదక మౌలిక సదుపాయాల కల్పనలో ఇటలీకిగల అత్యాధునిక సాంకేతికతతోపాటు ఐరోపాకు ఇంధన ముఖద్వారంగా దాని వ్యూహాత్మక పాత్రకు ఇది సంపూర్ణంగా తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ నేతృత్వాన ఏర్పడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ), అంతర్జాతీయ జీవఇంధన కూటమి (జీబీఏ) వంటి సంకీర్ణ సంస్థల కృషిలో ఇతర దేశాలతోపాటు మా సహకారం కూడా కీలకం.
భౌతిక, డిజిటల్, మానవ అనుసంధానమే మా భాగస్వామ్యాన్ని మరింతగా పెనవేసిన సూత్రం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రాలైన ఇండో–పసిఫిక్, మధ్యధరా ప్రాంతాల నడిబొడ్డున భారత్, ఇటలీ ఉన్నాయి. కాబట్టి, ఈ ప్రాంతాలను వేర్వేరు పరిధులుగా కాకుండా అంతకంతకూ పరస్పర సంధానితం అవుతున్న ప్రదేశాలుగా పరిగణించాలి. వాస్తవానికి.. హిందూ మహాసముద్రాన్ని ఐరోపాతో ముడిపెట్టే వాణిజ్య, సాంకేతిక, ఇంధన, డేటా సహా సమాలోచనలకు కీలక మార్గమైన భారత–మధ్యధరా ప్రాంతం ఆవిర్భావానికి మా రెండు దేశాలే ప్రత్యక్ష సాక్షులు. సరిగ్గా ఈ పరస్పర సంధాన క్రమంలోనే మన స్నేహబంధం సహజ రీతిలో ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిఢవిల్లుతూ– రెండు ఖండాలను కలిపి, కొత్త ప్రపంచ గమనానికి రూపుదిద్దుతుంది.
ఈ పరిస్థితుల నడుమ ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు, ఇంధన వ్యవస్థలు, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో మన ప్రాంతాలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్న దార్శనికతకు భారత్–మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ) ఒక ప్రతీక. ఈ దృక్కోణానికి వాస్తవికతను ఆపాదించడంలో ఇతర భాగస్వాములతో సమష్టిగా కృషి చేసేందుకు భారత్, ఇటలీల నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి.
మాకెదురయ్యే ఉమ్మడి సవాళ్ల పరిష్కారంలో రెండు దేశాల మధ్యగల ప్రగాఢ భాగస్వామ్యం, శాశ్వత సాంస్కృతిక సంబంధాలను సద్వినియోగం చేసుకుంటాం. భారతీయ సంస్కృతి ప్రబోధించే ‘ధర్మం’ అనే ఉదాత్త భావన మా చర్యలకు మార్గనిర్దేశం చేసే బాధ్యతా స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆ క్రమంలో నేటి పరస్పర సంధాన డిజిటల్ యుగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) సూత్రం మానవాళి మొత్తాన్నీ ముడివేయడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. పునరుజ్జీవన పథంలో పయనించే ఇటలీ మానవతావాద సంప్రదాయం కూడా ఈ విలువలను సహజంగా ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి గౌరవాన్ని, ప్రజలను–సమాజాలను ఏకం చేసే సంస్కృతికిగల అపార శక్తిని ఇది తేటతెల్లం చేస్తుంది. అందుకే, రెండు దేశాల ప్రజలకు కేంద్ర స్థానమిస్తూ బలమైన, భవిష్యత్ దృక్కోణ సహిత భారత్–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేయాలని మా సంయుక్త దార్శనికత లక్ష్యనిర్దేశం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News