ఏం చేసి ‘నీట్’ని సరిదిద్దాలి!?
ABN , Publish Date - May 29 , 2026 | 12:40 AM
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసి, మళ్లీ జూన్ 21న నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్ణయించింది. నీట్ పరీక్షకు నమోదు చేసుకున్న...
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసి, మళ్లీ జూన్ 21న నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్ణయించింది. నీట్ పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు 22,79,743 కాగా హాజరైనవారు 22,05,035 మంది (అంటే 96.92 శాతం). కొన్ని కారణాల వల్ల 75వేల మంది మే 3న పరీక్ష రాయలేకపోయారు. మరి ఇప్పుడు జూన్ 21న జరగబోయే పరీక్షకు ఈ 75వేల మందిలో కొందరు పరీక్ష రాయాలనుకొంటే రాయనివ్వాలిగదా. ఆనాడు విద్యార్థుల అశక్తత వలన రాయలేకపోతే, ఈసారి ప్రభుత్వ అసమర్థత వలన ఆ పరీక్ష రద్దయింది కాబట్టి ఈసారి వారికి అవకాశం కల్పించటం న్యాయం.
జాతీయ పరీక్షల సంస్థ మొదటిసారి పరీక్ష నిర్వహణకు పెట్టిన ఖర్చంతా వృథా అవ్వడమే గాక, మళ్లీ పరీక్ష పెట్టేందుకు అదే మొత్తాన్ని రెండోసారి ఖర్చు చేయాలి. వృథా అయిన నిర్వహణ ఖర్చులు గాక దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణకు సుమారు రూ.325 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 13 ప్రధాన భాషలలో ప్రశ్న పత్రాల తయారీ ఉంటుంది. సుమారు 30 పుటలతో ఉన్న ప్రశ్నపత్రాలను 26 లక్షలకు పైగా ముద్రించాలి. మరో 26 లక్షలకు పైగా ఓఎంఆర్ షీట్లు ముద్రించాలి. 5,500కు పైగా పరీక్షా కేంద్రాలను దేశమంతటా విదేశాలలోనూ ఏర్పాటు చేయాలి. రెండు లక్షలమందికి పైగా పరిశీలకులను నియమించాలి. కట్టుదిట్టమైన భద్రతతో ప్రశ్నాపత్రాల రవాణా చేయాలి. ఇలాంటివెన్నో ఖర్చులు ఉంటాయి.
మళ్లీ నిర్వహించబోయే పరీక్ష కోసం విద్యార్థుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ప్రకటించినందున, ఈ రూ.325 కోట్ల అదనపు భారాన్ని NTA తన అంతర్గత నిధుల నుంచే భరించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుల ద్వారా సుమారు రూ.300కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే, గతంలో చెల్లించిన ఫీజును విద్యార్థులకు రీఫండ్ చేస్తామని ఇటీవల ప్రకటించడంతో, సంస్థ ఒకేసారి రెట్టింపు ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తోంది. నేరస్తుల ముఠాలను వెదికి పట్టడానికి సీబీఐ వంటి సంస్థలను రంగంలోకి దించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు పరిపాలనాపరమైన భారం పడుతుంది.
ప్రభుత్వానికి అయ్యే ఖర్చులను లెక్కించగలిగినప్పటికీ, 22 లక్షల మందికిపైగా విద్యార్థులూ వారి కుటుంబాలపై పడే పరోక్ష ఆర్థిక భారం అంతకంటే చాలా రెట్లు పెద్దది. మళ్లీ ఇంతమందికి ప్రయాణ వసతి ఖర్చులు ఉంటై. పరీక్షా కేంద్రాలకు దూరంగా ఉండే ఒక విద్యార్థి ప్రయాణానికి (రైలు/బస్సు ఛార్జీలు, స్థానిక రవాణా) ఇంకా రాత్రి వేళల్లో వసతి కోసం సగటున రూ.2,500 వరకు ఖర్చు చేయవలసివస్తుంది. 22లక్షల మందికి పైగా విద్యార్థులు రెండోసారి పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి రావడం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు రూ.560 కోట్ల వరకు ఉత్పాదకత లేని అదనపు ఖర్చు అవుతుంది. మళ్లీ పరీక్ష రాయడానికి మానసికంగా సిద్ధమవ్వాల్సి రావడం వల్ల విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆందోళనలను వెలకట్టలేం.
ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా ఉండటానికి రాబోయే పరీక్షల్లో భారీ మార్పులు చేయాలి. అత్యంత సురక్షితమైన కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) విధానంలోకి మారాలి. అధునాతన డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. కృత్రిమ మేధ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను అనుసంధానించడం, థర్డ్–పార్టీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం కోసం వందల కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి అవసరమవుతుంది. ఇంత జేసినా, ఇలాంటివి పునరావృతం కావని చెప్పలేం. ఇలాంటి విపత్తులను నివారించేందుకు ప్రత్యామ్నాయ విధానం అవసరం. నీట్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించకుండా రాష్ట్రాల వారీగా నిర్వహించాలి. అయితే జాతీయ స్థాయి సీట్ల పంపిణీతో పాటు రాష్ట్రాల వాటాను యథాతథంగా కొనసాగించవచ్చు. ప్రతిభను గుర్తించడం, ప్రైవేట్ కాలేజీల డొనేషన్ల దోపిడీని అడ్డుకోవడం, అభ్యర్థులకి దేశవ్యాప్తంగా తమకు నచ్చిన కళాశాలలో చదువుకొనేందుకు ఒకే ఒక ప్రవేశ పరీక్ష రాయడం లాంటి నీట్ ప్రయోజనాలను కాపాడుతూనే... మానసిక ఒత్తిడి, పేపర్ లీకేజీలతో కలిగే ఆర్థిక సామాజిక నష్టాలు, గ్రామీణ విద్యార్థులపై వివక్ష వంటి లోపాలను ఈ ప్రత్యామ్నాయాల ద్వారా సరిదిద్దే విధంగా ఆలోచనలు ఉండాలి.
ఒక్క మూడు గంటల పరీక్షతో విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించేలా కాకుండా, ఇంజనీరింగ్ (జేఈఈ) తరహాలో బహు దశల సాధారణీకృత యోగ్యతా నమూనా (మల్టీ–స్టేజ్ నార్మలైజ్డ్ ఆప్టిట్యూడ్ మోడల్) లాంటి విధానంలో వైద్య ప్రవేశ పరీక్షలను కూడా మార్చవచ్చు. ఈ విధానంలో ఈ పరీక్షను నీట్–మెయిన్స్, నీట్–అడ్వాన్స్‌డ్ అని రెండు భాగాలుగా విభజించి, సంవత్సరానికి రెండు లేదా మూడుసార్లు నిర్వహించవచ్చు. దీని ప్రయోజనం విద్యార్థులలో ఆ ఒక్క రోజు పరీక్ష సరిగ్గా రాయలేకపోయానే అనే భయాన్ని పోగొట్టడం. విద్యార్థి ఒక సెషన్‌లో అనారోగ్యం పాలైనా, మరో సెషన్ మార్కులను వాడుకొనే విధంగా ఉండాలి. దీనివల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల మాఫియా తగ్గుతాయి. నీట్ రాకముందు చాలా రాష్ట్రాలు ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ సీట్లు ఇచ్చేవి. ఆ పాత పద్ధతిని, కొత్త టెక్నాలజీని కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ చేయవచ్చు. ఇంటర్ మార్కులు+ఆప్టిట్యూడ్ హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెడితే కాలేజీ చదువుకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు క్లాసులు మానేసి లక్షల రూపాయల కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది పేద, గ్రామీణ విద్యార్థులకు వరం. వైద్య వృత్తికి కేవలం బట్టీపట్టిన చదువుల కంటే... మానసిక పరిణితి, ఆపద సమయంలో ఆలోచించే శక్తి, సానుభూతి చాలా అవసరం. ఈ విధానంలో పుస్తకాల్లోని ప్రశ్నలను అక్షరం పొల్లుపోకుండా గుర్తుపెట్టుకునే పద్ధతిని మార్చి విమర్శనాత్మక ఆలోచన, సమాచార విశ్లేషణ, తార్కిక వివేచన, స్థితప్రజ్ఞత, సమయస్ఫూర్తి మొదలైనవాటిని పరీక్షించేలా మార్చాలి.
ఒకే ఒక్క జాతీయ సంస్థ 25 లక్షల మంది విద్యార్థులకు ఒకే రోజు పరీక్ష పెట్టడం వల్ల ఎన్నో లోపాలు లొసుగులూ తప్పవు. దీనికి బదులు నీట్ పరీక్షను ప్రాంతీయంగా వికేంద్రీకరించాలి. ఈ విధానంలో కేంద్ర సంస్థ సిలబస్ నిబంధనలను నిర్ణయిస్తుంది. కానీ పరీక్షలను ఆయా రాష్ట్రాలు లేదా ప్రాంతీయ పరీక్షా కేంద్రాలు డిజిటల్ పద్ధతిలో నిర్ణీత రోజుల్లో నిర్వహిస్తాయి. దీని వలన పేపర్ లీక్ ముప్పు చాలావరకూ తగ్గుతుంది. విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ మార్పులు చాలా లాభదాయకంగా ఉంటై. కేవలం బట్టీ పట్టే సామర్థ్యాన్నిగాక సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించే దిశలో ఉన్న విద్యా నైపుణ్యాలను కొలమానానికి వీలుగా పరీక్షలను తీర్చదిద్దవీలవుతుంది.
ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News