Share News

రైతన్నకు మోదీ సర్కార్‌ మేలు

ABN , Publish Date - May 20 , 2026 | 02:07 AM

ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్‌ సంయుక్త యుద్ధంతో నెలకొన్న చమురు, నౌకాయాన సంక్షోభాలతో అనేక వర్ధమాన దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. మరే దేశం కంటే భారత్‌ అత్యధికంగా నష్టపోతోంది. అయితే...

రైతన్నకు మోదీ సర్కార్‌ మేలు

ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్‌ సంయుక్త యుద్ధంతో నెలకొన్న చమురు, నౌకాయాన సంక్షోభాలతో అనేక వర్ధమాన దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. మరే దేశం కంటే భారత్‌ అత్యధికంగా నష్టపోతోంది. అయితే ఈ యుద్ధం అనంతర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి సారించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అసాధారణ దార్శనికతను చూపుతోంది.

పశ్చిమాసియాలో యుద్ధం మూలంగా భారత్ నుంచి బ్రెజిల్ వరకు, నైజీరియా నుంచి ఆస్ట్రేలియా దాకా అనేక దేశాలలో వ్యవసాయ సంక్షోభం ఉత్పన్నమవుతోంది. ఇరాన్‌ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా పంట మార్పిడి సాగు అనివార్యమవగలదని ప్రపంచ ఆహార సంస్ధ ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చుతోందని ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గడ్డు కాలంలో భారత్ పరిస్థితి పలు ఇతర దేశాలతో పోల్చిచూస్తే మెరుగ్గా ఉన్నదనడంలో సందేహం లేదు. ఇరాన్‌ యుద్ధ తక్షణ సవాళ్లకు దీటుగా ప్రతిస్పందించడమే కాకుండా భవిష్యత్తులో వాటిల్లే సరఫరా సంక్షోభాల ప్రభావం కనిష్ఠస్థాయిలో ఉండేలా చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఆహార ధాన్యాల అధిక దిగుబడులకు అవసరమైన యూరియా, డీఏపీ తదితర ఎరువులు, రసాయనాలు చమురు అనుబంధ ఉత్పత్తులు. ఈ కారణంగానే సమస్త వర్ధమాన దేశాలు గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ యూరియా అవసరాలలో దాదాపు సగభాగాన్ని సౌదీ అరేబియా, ఖతర్, ఇరాన్‌లే తీర్చుతున్నాయి. ఈ మూడు దేశాలతో పాటు ఒమాన్ కూడ భారత రైతాంగ యూరియా అవసరాలను పూర్తిగా తీర్చుతోంది. గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌ ఏటా లక్ష టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత యుద్ధ పరిస్ధితులలో ఉత్పత్తి, రవాణాకు అంతరాయం ఏర్పడడంతో ఎరువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తత్ఫలితంగా పలు దేశాలలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడుతోంది.


యూరియాను దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్న దేశాలలో భారత్‌ అగ్రగామిగా ఉన్నది. ఆత్మనిర్భరతకు తార్కాణాలుగా సగర్వంగా చెప్పుకునే వాటిలో భారతీయ ఎరువుల కార్మాగారాలు ప్రధానమైనవి. మోదీ ప్రభుత్వం ఈ కర్మాగారాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి అధునికీకరించింది. ఈ ఎరువుల కర్మాగారాలు అన్నీ ఖతర్ నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువుతో పనిచేస్తాయి. ఇరాన్‌ యుద్ధం వల్ల ఖతర్ నుంచి సహజవాయువు సరఫరా నిలిచిపోవడంతో భారతీయ ఎరువుల రంగానికి తీవ్ర విఘాతమేర్పడింది. సౌదీ అరేబియా, ఇరాన్ నుంచి కూడా ఎరువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశంలో ఎరువుల కొరతను నివారించేందుకు మోదీ సర్కార్‌ సంకల్పించింది. ఈ సంకల్ప సాధనకై అల్జీరియా మొదలు ఇండోనేషియా దాకా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రతి ఎరువుల ఉత్పాదక దేశం నుండి ఎరువులు, వాటి ముడి సరుకును కొనుగోలు చేస్తోంది. భారతీయ రాయబారులు రేయింబవళ్ళు ప్రత్యామ్నాయ కొనుగోళ్ళకు ప్రయత్నిస్తున్నారు. హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో ఎరువులు లభించే అవకాశాలు సన్నగిల్లడంతో మరే దేశమూ చేయని విధంగా రెండింతలు ఎక్కువ ధరతో ఎరువులు కొనుగోలు చేసి ఈ ఖరీఫ్ సీజన్‌కు ముందు భారత రైతాంగాన్ని మోదీ ప్రభుత్వం ఆదుకున్నది. భారత్ చెల్లించిన అధిక ధరలకు పలు దేశాలు దిగ్భ్రాంతి చెందాయనడం సత్యదూరం కాదు. భారత ప్రభుత్వరంగ సంస్ధలయిన క్రిబ్కో, ఇఫ్కోలు ఒమాన్‌లో ఆ దేశ సంస్ధల సంయుక్త భాగస్వామ్యంలో ఎరువుల ఉత్పత్తి కర్మాగారాన్ని నడుపుతున్నాయి. ఒమాన్‌లో ఉత్పత్తి అయ్యే ఎరువులను భారత్‌లోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా విక్రయిస్తారు. ఒమాన్‌లో ఎరువుల కర్మాగారాన్ని 250 బిలియన్ డాలర్ల వ్యయంతో విస్తరించేందుకు భారత్‌ సంకల్పించింది. కల్లోల హార్మూజ్‌ జలసంధితో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్ తీరానికి ఎరువులు చేరుకుంటాయి.


45 కిలోల యూరియా బస్తా ధర అంతర్జాతీయ విపణిలో రూ.4,500 కాగా కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీతో రూ.270 కంటే తక్కువ ధరకు విక్రయిస్తూ భారత రైతాంగాన్ని ఆదుకుంటోంది. ఈ నిర్మాణాత్మక సహాయక చర్యల గురించి సామాన్య ప్రజానీకానికి సవివరంగా తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. మస్జీదు – మందిర్‌ గురించి ఉత్సాహంగా మాట్లాడే అధికార పక్షంవారు వ్యయప్రయాసలతో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచుతోన్న నిజమైన ఆత్మనిర్భర చర్యల గూర్చి మాట్లాడడానికి ఆనాసక్తి చూపడం విచిత్రంగా ఉన్నది. సకల వేళల్లోను జాతి ప్రయోజనాలు కాపాడుకునే దిశగా మోదీ సర్కార్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి...

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 02:07 AM