జ్ఞాపకాల అత్తరు
ABN , Publish Date - May 11 , 2026 | 01:00 AM
చలికాలమంతా బద్ధకంగా మునగతీసుకుని పడుకున్న జీవితం ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని లేస్తుంది లేలేత మామిడి చిగుళ్లతో...
చలికాలమంతా బద్ధకంగా
మునగతీసుకుని పడుకున్న జీవితం
ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని లేస్తుంది
లేలేత మామిడి చిగుళ్లతో తెలతెల్లని వేపపూతలతో
కోకిల స్వరంలో పాడుతూ
సింగారించుకోవటం మొదలు పెడుతుంది!
పిల్లలంతా మొక్కుబడిగా, హడావిడిగా
పరీక్షలు ముగించుకుని,
పుస్తకాల సంచులు విసిరి అవతల పడేసి,
విసుర్రాయి జీవనానికి విశ్రాంతినిచ్చేసి
పూర్తి స్థాయి ఆటల్లో పడతారు!
అటక మీద దాచిపెట్టిన వీడియో గేములు
స్కిప్పింగ్ తాళ్ళు, గోళీల డబ్బాలు, చెస్ బోర్డులు
పరమపథ సోపాన పటాలు అన్నీ కిందకి దిగి
ఇంటి గచ్చుపై పరుచుకుని కాళ్ళకడ్డం పడుతుంటాయి!
వాకిళ్లకు తడితడి పరదాలు కడుతూ
నీళ్ల కుండలకి చల్లటి తువాళ్లు చుడుతూ
తరిగిన మాగాయ ముక్కలు, కలపాల్సిన ఆవకాయ పాళ్ళు
వలవాల్సిన వడియాల వరుసలతో
అమ్మలు, బామ్మలు తిప్పలు పడుతూ ఉంటారు!
మండు వేసవి మధ్యాహ్నం చెట్టు కింద
ఆగి నాన్న తాగించిన నిమ్మకాయ సోడా ఘాటుదనం
భుజంపై బరువుగా మోసుకొచ్చి తొట్టి నీళ్లలో
పడేసిన పుచ్చకాయ కోసినప్పటి ఎర్రదనం
కారే చెమటలు తుడుచుకుంటూ
రోడ్డువారగా నిల్చుని వలిపించుకొచ్చిన
లేత తాటి ముంజల కమ్మదనం
సంవత్సరం అంతా గుర్తుండిపోయే
జీవనోత్సవ సందర్భాలు కల్పిస్తాయి!
సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టగానే
చుట్టేసే మల్లెపూల పరిమళం
రాత్రి పెరుగన్నంలో పిండుకున్న మామిడిపళ్ల రసం
డాబాపై నీళ్ళు చల్లి వేసుంచిన చాపల చల్లదనం
ఇది కదా జీవితం... ఇంతకన్నా గొప్పదా స్వర్గం
అనుకునే అనుభూతిని అందిస్తాయి!
ఇప్పుడు చదువుల రోజులు అయిపోయి
కొలువుల రోజులకి వయసు ఎదిగిపోయింది
బాల్యంలో పెద్ద పరీక్షలు భయపెడుతూ ఉన్నా
వెన్నంటే వేసవి సెలవులు ఉన్నాయనే ధీమా ఉండేది
ఇప్పుడు బతుకు పెట్టే రోజువారీ పెద్ద పరీక్షల
వెనుక వేసవి సెలవుల ఆటవిడుపులు ఏమీ ఉండవు
అందుకే ఇప్పటికీ, ఎండలు ముదురుతూ ఉంటే
మనసు మళ్ళీ బాల్యం దిశగా పరుగులు పెడుతుంది!
అదుగో అలాంటప్పుడే, మనసు అరల్లో దాచుకున్న
వేసంకాలపు జ్ఞాపకాల అత్తరు ఉండ ఒకటి బయటకి తీస్తాను
ఒక్కసారిగా చుట్టుముట్టే ఆప్యాయతల పరిమళాల చిరుజల్లులతో
మనసు తడుపుకుంటాను!
సింగరాజు రమాదేవి
99083 37064
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News