బలిపీఠంపై ప్రజాస్వామ్యం!
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:27 AM
పక్షికి రెక్కలు కత్తిరించి పాయసం తినిపించినట్టుంది దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి. దేశాన్ని పన్నెండేళ్లుగా అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్లో...
పక్షికి రెక్కలు కత్తిరించి పాయసం తినిపించినట్టుంది దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి. దేశాన్ని పన్నెండేళ్లుగా అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగపరచి సృష్టించిన ‘సర్’ (ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ) విన్యాసం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పును కలిగించింది. ఈ ప్రక్రియ ద్వారా పదమూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల నుంచి 6.5కోట్ల మందిని తొలగించారు. తొలగించినవారిలో ఎక్కువమంది ముస్లింలు బలహీనవర్గాలవారే. విదేశీ చొరబాటుదారులన్న నెపం మోపి తమకు ఓటు వేయని ముస్లిం ఓటర్లను, అలాగే తమ ప్రత్యర్థి పక్షాల నేతల నియోజకవర్గాల్లో వారికి అనుకూల ఓటర్లను తొలగించడం కోసమే ‘సర్’ను బీజేపీ పాలకులు ప్రయోగించారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. మామూలుగా నిశ్శబ్దంగా సాగిపోయే ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ఈసారి విద్వేష విలయాగ్నులు సృష్టించడం ఆందోళనకరం.
అసలు అక్రమ చొరబాటుదార్లను గుర్తించే బాధ్యతను ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడం సబబేనా? ఎన్నికల కమిషన్‌కూ వలస వ్యవహారాలకూ ఏమి సంబంధం? అక్రమ చొరబాటుదార్లనే నెపం చూపి చట్టబద్ధ ముస్లిం ఓట్లను కూడా తొలగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈసీ ఓటర్ల జాబితాల నుంచి తొలగించినవారి పౌరసత్వానికి ముప్పు కలగబోదని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేనిపక్షంలో వారిని ఈసరికి దేశ బహిష్కారం చేసి ఉండేవారేమో! జాబితాలకు ఎక్కని ఓటర్లను వెతికి పట్టుకుని వారికి ఓటు హక్కు కలిగించాల్సిన కలుపుకునిపోయే సమ్మిళిత లక్షణంతో పుట్టిన ఎన్నికల సంఘం అందుకు పూర్తి విరుద్ధమైన వికృత అవతారమెత్తడం అత్యంత ఖండనార్హం.
బలమైన కారణం లేకుండా మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభ మెట్లు ఎక్కనివ్వకుండా చేసిన తీరు పాలకపక్షం నిర్లజ్జను చాటింది. ఈ మధ్య నియోజకవర్గాల పునర్విభజన, మహిళల కోటా రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో తగినంత బలం కొరవడి వీగిపోయిన తలవంపు నుంచి కోలుకోలేక బీజేపీ అడ్డదారుల్లో ఆ మెజారిటీని సాధించుకోడానికి పాట్లు పడుతున్నది. ఇంచుమించు ఒకేసారి బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లోను, మహారాష్ట్రలో శివసేనలోను చీలికలు సృష్టించడానికి తొక్కిన అడ్డదారులు బీజేపీకి ప్రజాస్వామిక నియమాల పట్ల, రాజ్యాంగ సూత్రాల పట్ల గల వ్యతిరేకతను చాటుతున్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడానికి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో తెలిసిందే. గవర్నర్ ధన్‌ఖడ్‌ను దుర్వినియోగపరిచి తర్వాత అందుకు నజరానాగా ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టారు. అక్కడ అతను తమ చేయి దాటిపోయే స్థితి ఎదురుకాగానే ఆ పదవి నుంచి కూడా ఆయన్ను పంపించివేశారు.
రాజ్యాంగ నియమాల మీద ఈగ వాలకుండా చేసిన జస్టిస్ హంసరాజ్ ఖన్నా, జస్టిస్ జె.ఎం.షెలాట్, జస్టిస్ కె.ఎస్.హెగ్డే, జస్టిస్ ఎ.ఎన్.గ్రోవర్‌ల కాలానికి కాలం చెల్లడం బాధాకరం. అటువంటి గొప్ప న్యాయమూర్తుల కొరత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థలు రాజ్యాంగ విలువలను కాపాడడంలో విఫలమవుతున్నచోట కోర్టులను ఆశ్రయించడం నిరర్థకమని మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత జోయ్‌దాస్ అభిప్రాయపడ్డారు. స్వతంత్ర సంస్థల చేత పాలకులే ఊడిగం చేయించుకుంటున్న దేశంలో ప్రజాస్వామిక, సెక్యులర్ రాజ్యాంగం, దాని విలువలు దిక్కులేనివి కావడం సహజం. ప్రత్యక్షంగా ఎన్నికల్లో తగినంత మెజారిటీ సాధించుకుని రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు, కానీ దాని మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించరాదు. అటువంటి మర్యాదలేమీ పాటించకుండానే, తాము ఎన్ని అడ్డదారులు తొక్కినా తమకు కావలసిన రీతిలో తీర్పులను పొందుతున్న అదృష్టవంతులు ఎన్డీఏ పాలకులు. ప్రతిపక్షాలను చీల్చడానికి, ప్రాంతీయ పక్షాలను నామరూపాలు లేకుండా చేయడానికి, రాజ్యాంగ విలువలను కాలరాయడానికి తెగిస్తున్న ఎన్డీఏ పాలకులకు ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహ కొరవడిందా?
గార శ్రీరామమూర్తి
(సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి..
చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్
నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
For More National News And Telugu News