దయాల్బాగ్
ABN , Publish Date - May 11 , 2026 | 12:58 AM
చూస్చూసి ఇలాగనుకున్నాను. రద్దీగా ఉన్న మెట్రోలోన సంచీలు జారిపోతుంటే నవ్వు మొహాల్తోటి కాళ్ళు పక్కకి తీసుకుని తోవిస్తారు...
చూస్చూసి ఇలాగనుకున్నాను.
రద్దీగా ఉన్న మెట్రోలోన సంచీలు జారిపోతుంటే
నవ్వు మొహాల్తోటి కాళ్ళు పక్కకి తీసుకుని తోవిస్తారు. తుమ్మొచ్చినప్పుడు
ముక్కూ మొహం తెలీనావిడి ‘‘చిరంజీవ!’’ అంటాది. కూరల బేగులొసిలి
నిమ్మకాయలు దొర్లిపోతుంటే ఏరి తెచ్చిస్తారు, సీట్లో ఫోను మరిచిపోతే
ఆటోలాయన తెచ్చిచ్చీసినట్టు.
ఒకళ్నొకళం నొప్పించుకోకుండా గెటానౌతాము సిటీలోన.
చంటిపిల్లల్తోని లెగిసెళ్ళలేనప్పుడు
వేడి టీ షాపాయనే తెచ్చందిస్తాడు.
బండిలో పెట్రోలైపోతే చీకట్లోనే బుగ్గల్లోకి లబ్బరుగొట్టం నాగస్వరంలాగ ఊది
బుక్కెడు పెట్రోలు పోసి కాణీ తీసుకోకుండా కిక్కు కొట్టుకోనెళ్ళినాయన
‘‘థేంక్సండి చిన్నానా!’’ అంటే పెద్ద వినిపించుకోకుండాని.
వీధిలోన, రోడ్లమీద ఈ ఎవరో తెలీని మనుషులు
నవ్వితే మన్ని చూసి నవ్వి అరచెయ్యి గాల్లోకెత్తి నమస్కారం అన్నట్టుగా.
ప్రసూతి వార్డులోన ‘‘ఇలగొచ్చీ తల్లీ, ఎంచేపు నిలపడతావు?’’ అని బెంచీ మీద చోటివ్వాలనీ,
వానలో తడిసిపోతే అరుగుమీదికి జరిగి గొడుగడ్డం పడతామనీ,
లారీ ఆయన ఆగి నవ్వి రోడ్డు దాటనిస్తాడనీ
చెట్టుకింద మేడం పులిహోర పేకట్టు వాటర్ బోటిలు అందించి
‘‘సాయిరాం!’’ అని నవ్వుతాదనీ
బస్సు కదిలిపోతుంటే ఎవరో ముక్కూ మొహం తెలీనాయన
చెయ్యందించి లోనికి లాక్కుంటాడనీ.
ఇళ్ళొదిలి ఊళ్ళొదిలి దేశం కాని దేశాలంట
ఈ పలకరింతలే పదివేలనీ
అడివిలో అబ్బామని ఇవి
మనం నిలబెట్టుకున్న చలివేంద్రాలనీ
ఎర్రటెండల్లోన ఈ షెల్టర్లలో నిలబడే కాసుకుంటాం కాఁవా
ఒకళ్నొకళ్ళం ‘‘ఇలగొచ్చియ్యండి లోపటకి!’’ అని,
‘‘పిల్లలతల్లివి, లైను ముందరికెళిపోవమ్మ!’’ అనీ,
‘‘అయ్యొ మంచివాడివేను! ముందు భోంచేసెళ్ళు!!’’ అనీసీను.
కనకప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News