Share News

కాక్రోచ్‌ కదన కుతూహలమేమిటి?

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:23 AM

నమ్మశక్యం కాని విషయాలు అప్పుడప్పుడు వాస్తవాలుగా పరిణమించడం భారతదేశ విలక్షణత. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చివేయాలని అనునిత్యం అనేకానేక మంది ఆకాంక్షిస్తుంటారు. స్వప్న సాధకులు ఎంతమంది?...

కాక్రోచ్‌ కదన కుతూహలమేమిటి?

నమ్మశక్యం కాని విషయాలు అప్పుడప్పుడు వాస్తవాలుగా పరిణమించడం భారతదేశ విలక్షణత. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చివేయాలని అనునిత్యం అనేకానేక మంది ఆకాంక్షిస్తుంటారు. స్వప్న సాధకులు ఎంతమంది? అరుదు, చాలా అరుదు. కనుకనే ఉద్యమ భారతంలో 30 ఏళ్ల యువకుడు అభిజిత్‌ దీప్కే సాఫల్యాన్ని ఒక అసాధారణ విజయంగా మనం భావించి తీరాలి.

‘కాక్రోచ్‌లు సంఘటితమవ్వాలి’ అని మే 16న విజ్ఞప్తి చేసిన ఒక ట్వీట్‌ దేశవ్యాప్తంగా యువజనుల నిరసనోద్యమంగా ప్రజ్వరిల్లి అంతిమంగా ఒక కేంద్రమంత్రి రాజీనామాకు దారితీస్తుందని ఎవరు ఊహించారు? ఈ దేశంలో, నెల రోజుల క్రితం దీప్కే గురించి విన్నవారు ఎంతమంది? ఆయన ఏర్పాటు చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)ని పట్టించుకున్నవారెంతమంది? మరి నేడు శంభాజీనగర్‌లోని దీప్కే నివాసం ఎదుట వందలాది టీవీ చానెళ్ల రిపోర్టర్లు, యూట్యూబర్లు, సీనియర్‌ రాజకీయ నాయకులు బారులు తీరుతున్నారు. ఆన్‌లైన్‌ ఫ్యాడ్‌గా అనేకమంది కొట్టిపారేసిన ఉదంతమే అనూహ్యంగా ఈ ఏడాది అతిపెద్ద రాజకీయ సంఘటనగా నిలిచింది.

ఉద్యమ తక్షణ లక్ష్యం నెరవేరింది. అసలు సవాల్‌ ఇప్పుడే మొదలయింది. కాక్రోచ్‌ జనతా పార్టీ ఇప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్వతంత్ర బృందం (ప్రెజర్‌ గ్రూప్‌)గా ఉండిపోతుందా? లేక, ఎన్నికల రాజకీయాలలోకి దూకుతుందా? ఈ విషయమై దీప్కేను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించాను (సామాజిక మాధ్యమాలలో అనేకమంది సైతం ఇదే ప్రశ్న అడుగుతున్నారు).. నా ప్రశ్నకు దీప్కే వెన్వెంటనే ఇలా సమాధానమిచ్చారు: ‘సీజేపీని ఒక రాజకీయపార్టీగా మార్చే విషయం గురించి మేము ఆలోచించనే లేదు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసే నిరసనోద్యమంగా మాత్రమే ఉండిపోవాలని మేము భావిస్తున్నాము’.

ఇటువంటి మాటలనే ఇండియా ఇంతకు ముందూ విన్నది. 2011లో అవినీతి నిర్మూలనోద్యమం ఉధృతంగా కొనసాగుతున్నప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని అరవింద్‌ కేజ్రీవాల్‌ పదే పదే ఉద్ఘాటించారు. రెండు సంవత్సరాల అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది ఆయనే కాదూ? విజయవంతమైన ప్రతి నిరసనోద్యమమూ అంతిమంగా ఒకే విధమైన సందిగ్ధావస్థ నెదుర్కోవటం కద్దు: నైతిక పలుకుబడిని రాజకీయ అధికారంగా మార్చుకోవడం ఎలా? ఈ సంకట పరిస్థితిని చాలా మంది కంటే దీప్కే మెరుగ్గా అర్థం చేసుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పనిచేసిన అనుభవం దీప్కేకు ఉన్నది. ప్రజాగ్రహాన్ని ఎన్నికల విజయంగా ఎలా మార్చుకోవచ్చో ఆప్‌ నిరూపించింది. ఉద్యమ సాఫల్యంతో సమకూరిన నైతిక అధికారాన్ని, పోటీ రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాత నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అన్నదానికి కూడా ఆ పార్టీ ఒక దృష్టాంతం అయింది. ఎన్నికల రాజకీయాలలోకి దిగిన తరువాత పొత్తులు, రాజీలు, సంస్థాగత ఒత్తిళ్లు అనివార్యం కదా.


వ్యవస్థపై ప్రజాగ్రహం మాత్రమే కాకుండా మరెన్నో అంశాలు కలిసివస్తేనే మౌలిక రాజకీయ మార్పును సాధించడం సాధ్యమవుతుంది. చరిత్ర సూచిస్తున్న సత్యమిది. సరైన సమయంలో సరైన నాయకుడు రంగంలో ఉండడం చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యంగా అతడి ప్రాభవ ప్రాబల్యాలకు ఒక స్పష్టమైన సామాజిక మద్దతు ఉండి తీరాలి. కేజ్రీవాల్‌ కేవలం అవినీతి నిర్మూలనోద్యమం ఆధారంగా ఢిల్లీ అధికారాన్ని కైవసం చేసుకోలేదు. అంతకంతకూ విస్తరిస్తోన్న పట్టణ మధ్యతరగతి వర్గానికి ఆయన రాజకీయ గొంతుక అయ్యారు. ఆ విస్తృత సామాజికవర్గం ఆలంబనతోనే కేజ్రీవాల్‌ తన అధికారోన్నతికి సోపానాలు నిర్మించుకున్నారు. తమిళనాడులో ఈ ఏడాది అసాధారణ రాజకీయ విజయం సాధించిన జోసెఫ్‌ విజయ్‌ కథ కూడా విశిష్టమైనది. సినీనటుడు అయిన విజయ్‌, తమిళ సమాజానికి విలక్షణమైన సినిమా సంస్కృతి, రాజకీయాలను కలగలిపి అద్భుత విజయాన్ని అందుకున్నారు. ద్రావిడ పార్టీల దశాబ్దాల ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు ఆయన ప్రధానంగా యువతరంపై ఆధారపడ్డారు. సంప్రదాయ కుల, వర్గ అంతరాలకు అతీతంగా యువ ఓటర్లు విజయ్‌ పట్ల ఆకర్షితులయ్యారు. ఆయనకు అద్వితీయ విజయాన్ని అందించారు.

ప్రజల ధర్మాగ్రహం ఒక ఉద్యమాన్ని ప్రజ్వలింప జేయవచ్చు. అయితే అది అరుదుగా మాత్రమే ఎన్నికల సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది. కాక్రోచ్‌ జనతా పార్టీ కీలక మద్దతుదారులు ఎవరు? ప్రశ్న పత్రాల లీక్‌లపై ఆగ్రహిస్తోన్న జెన్‌ జీ విద్యార్థులా? ఉద్యోగాన్వేషణలో వేసారుతున్న నిరుద్యోగ పట్టభద్రులా? భారత్‌ అనుపమానంగా సాధిస్తున్న అభివృద్ధిలో తమకు సముచిత రీతిలో వాటా లభించడం లేదని ఆగ్రహిస్తున్న దిగువ మధ్యతరగతి ప్రజలా? కొత్త రాజకీయ వ్యూహాలకు ప్రయత్నిస్తున్న అంబేడ్కర్‌ వాదులా? అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించడంలేదని ఆగ్రహిస్తున్న ముప్పై ఏళ్ల లోపు వయసు ఉన్న నవ యువతరమా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించనంతవరకు ఏ నిరసనోద్యమాన్ని అయినా సరే ఒక ఎన్నికల శక్తిగా మార్చడమనేది చాలా కష్టసాధ్యమవుతుంది.

సీజేపీ విషయంలో మరో కారణం కూడా ఉన్నది. 2013లో ఢిల్లీలో, 2026లో తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులకు నేటి జాతీయ రాజకీయ దృశ్యం పూర్తిగా భిన్నమైనది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధాన ఎన్నికల శక్తిగా వర్ధిల్లుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీర్తి చంద్రికలు కించిత్‌ మసకబారి ఉండవచ్చు గానీ ఆయన ఇప్పటికీ శిఖర సమానుడు. ఒక అజేయశక్తిగా వెలుగొందుతున్నారు. కేంద్ర కేబినెట్‌ మంత్రి రాజీనామాను అనివార్యం చేయడం విశిష్ట రాజకీయ విజయమే, సందేహం లేదు. అయితే మహాశక్తిమంతమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఓడించడం పూర్తిగా భిన్నమైన విషయం. అదంత తేలికైన వ్యవహారం కాదు.


నిజానికి సీజేపీ బలం, ప్రభావశీలత అంతా కచ్చితంగా అది మరొక రాజకీయ పార్టీ కాకపోవడంలోనే ఉన్నది. సీజేపీ నిర్వహించిన జంతర్‌ మంతర్‌ ఆందోళన భారతీయ యువజనులను చైతన్యపరచడమే కాదు, సమస్త భారతీయుల మనసులపై చెరగని ముద్ర వేసింది. సంప్రదాయ పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఒక విశాల ఆదర్శాన్ని అది ఆలంబనగా చేసుకున్నది. వ్యవస్థ పట్ల తమ అసంతృప్తిని, ఆగ్రహావేశాలను వ్యక్తం చేసేందుకు యువజనులకు అది ఒక వేదికను సమకూర్చింది. నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌ అందుకు తక్షణ ప్రేరణ అయినప్పటికీ తగ్గిపోతున్న అవకాశాలు, పెరుగుతున్న అసమానతలు, సామాన్య ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాల ప్రతిస్పందనా రాహిత్యం మొదలైన వాటి పట్ల యువజనులలో లోతుగా గూడుకట్టుకున్న ఆవేదనలు, ఆందోళనల కారణంగానే సీజేపీ ఉద్యమం విస్తృతంగా ప్రతిధ్వనించింది, ప్రజల మద్దతును పొందింది.

నైతిక పలుకుబడి చాలా విలువైనది. దానిని ఒకసారి కోల్పోతే తిరిగి పొందడమనేది అరుదుగా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక ఉద్యమం ఎన్నికల రాజకీయాలలోకి ప్రవేశించిన క్షణమే ప్రతి నిర్ణయమూ ఏదో ఒక రీతిలో రాజీపడి తీసుకున్నదే అవుతుంది. ఉద్యమకారుడు క్రమంగా, తాను ఒకప్పుడు సవాల్‌ చేసిన వ్యవస్థలోనే భాగస్వామి అవుతాడు. బహుశా ఈ కారణంగానే సీజేపీ సదా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్వతంత్ర బృందంగా ఉండిపోవాలన్నది అభిజిత్‌ దీప్కే స్వాభావిక వైఖరిగా ఉన్నది. ఇది, కనీసం ప్రస్తుతానికి వివేకవంతమైన మార్గం. ఉద్యమించవలసిన సమస్యలా?– నిరుద్యోగం, ప్రశ్న పత్రాల లీక్‌, విఫలమవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలు, పోలీసు సంస్కరణలు, పర్యావరణ విధ్వంసం, వ్యవసాయరంగంలో నిత్య సంక్షోభం, బడుగు, బలహీన వర్గాల జీవన అవస్థలు... మొదలైనవి అనంతంగా ఉన్నాయి. ఈ సమస్యలను జరూరుగా పరిష్కరించవలసి ఉన్నదన్న విషయమై అన్ని పార్టీల మధ్య ఏకీభావం ఉన్నది. కనుక సీజేపీ ఈ సమస్యలపై ఉద్యమించాలి. ఏదో ఒక రాజకీయ పక్షం తరఫున లేదా భావజాలానికి అనుగుణంగా వ్యవహరించడానికి బదులుగా ఆ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి ప్రభుత్వమూ పూచీ వహించేలా సీజేపీ తన స్వతంత్ర గళాన్ని వినిపించాలి.

ఎన్నికల రాజకీయాలలోకి ప్రవేశించాలనే ఆకాంక్ష సహజంగానే అంతరించదు. లక్ష్య సాధనలో సఫలమైన ప్రతి ఉద్యమమూ అంతిమంగా ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తపన పడుతుంది. అయితే చరిత్ర మరొక పాఠాన్ని నేర్పడం కూడా ఖాయం. రాజకీయాలలో మార్పు సాధించేందుకు ప్రతి ఉద్యమమూ ఒక రాజకీయ పార్టీగా పరిణమించవలసిన అవసరం లేదు. పార్లమెంటులో అధికారపక్షంగా వెలుగొందడానికి బదులుగా జాతీయ సంభాషణను ప్రగాఢంగా ప్రభావితం చేయడం ద్వారా కొంతమంది ప్రజా జీవితంపై చెరిగిపోని ముద్ర వేశారు. మహోన్నతుడైన బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సైతం ఎల్లవేళలా ఎన్నికల్లో విజయం పొందలేకపోయారు. అయితే సామాజిక న్యాయం లక్ష్య సాధనకు నిబద్ధమైన అంబేడ్కరిజం మరే భావజాలం కంటే కూడా భారతీయ రాజకీయాలను మౌలికంగా తీర్చిదిద్దింది.


కొద్దిమంది సాధ్యమని ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మార్పునే కాక్రోచ్‌ జనతా పార్టీ ఇప్పటికే సాధించింది. డిజిటల్‌ వేదికల ద్వారా సంఘటితమైన యువ భారతీయులు అధికారంలో ఉన్నవారు తమ మాటను విని తీరేలా చేయగలరనే విషయాన్ని సీజేపీ ఉద్యమం సందేహాతీతంగా రుజువు చేసింది. కాక్రోచ్‌ జనతా పార్టీ మరొక రాజకీయ పక్షంగా పరిణమిస్తుందా లేదా అనేది ఇప్పుడు దాదాపు ఒక అప్రస్తుత ఆలోచన. లక్షలాది యువ భారతీయులను అపూర్వ రీతిలో సంఘటితపరిచిన సీజేపీ విశ్వసనీయత, స్వతంత్రత, నిక్కమైన ఉద్యమ నిబద్ధతను కాపాడి నిలబెట్టడమే దాని వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేకు అసలైన పరీక్ష. ఒక పోరాటంలో విజయం సాధించడమనేది మొత్తం యుద్ధంలో గెలవడం ఎంతమాత్రం కానేకాదు. కాక్రోచ్‌ల పోరాట ప్రస్థానంలో మొదటి అధ్యాయం ముగిసింది. మరింత క్లిష్టమైన, కఠినమైన కొత్త అధ్యాయం ఇప్పుడే ఆరంభమయింది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:25 AM