Share News

పౌరహక్కుల పరిరక్షకుడు సుబ్బారావు సార్!

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:20 AM

కరీంనగర్‌లో జాప లక్ష్మారెడ్డిని పౌర హక్కుల లక్ష్మారెడ్డి అంటేనే గుర్తుపట్టేవారు. వరంగల్‌కు చెందిన బుర్రా రాములుకు కూడా ‘పౌర హక్కుల’ ఇంటి పేరైంది. ఇలా ఊరికొక్కరు రాజ్యాంగ హక్కుల పరిరక్షకులుగా...

పౌరహక్కుల పరిరక్షకుడు  సుబ్బారావు సార్!

కరీంనగర్‌లో జాప లక్ష్మారెడ్డిని పౌర హక్కుల లక్ష్మారెడ్డి అంటేనే గుర్తుపట్టేవారు. వరంగల్‌కు చెందిన బుర్రా రాములుకు కూడా ‘పౌర హక్కుల’ ఇంటి పేరైంది. ఇలా ఊరికొక్కరు రాజ్యాంగ హక్కుల పరిరక్షకులుగా నిలిచిన ఆ కాలానికి చెందిన మరో మానవతావాది మిర్యాలగూడకు చెందిన పొన్నూరు సుబ్బారావు. సామాన్యులకు తోడుగా ఉంటూ, పౌర హక్కుల పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేసిన సుబ్బారావు సార్ ఈ నెల 4న కన్నుమూశారు. విద్యార్థి దశ నుంచే మార్క్సిజం, హేతువాదం పట్ల ఆకర్షితులైన సుబ్బారావు అదే నిబద్ధతతో జీవితాన్ని గడిపారు. 92 ఏళ్ల నిండు జీవితం చివరి రోజుల్లో కూడా.. ప్రశ్నించే ఆయన గొంతుక మూగబోలేదు. వ్యవస్థలు, వ్యక్తులు.. ఎవరైనా పౌర హక్కులను అతిక్రమించినప్పుడు ఆయన ఎదురు నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

1934 జూలై 1న ఏపీలోని అమరావతిలో పుట్టిన సుబ్బారావు.. 1956లో మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా చేరారు. 1971లో లెక్చరర్‌గా పదోన్నతి పొంది, 1982లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత మిర్యాలగూడలోనే ‘చైతన్య పాఠశాల’ను స్థాపించి, అన్ని వర్గాల విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. ‘చైతన్య సమాఖ్య’ ద్వారా సామాజిక సమావేశాలను, వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. 1990 నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నల్లగొండ జిల్లా బాధ్యుడిగా పనిచేశారు. 1998లో మానవ హక్కుల వేదికకు నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత అదే వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అలా పౌర హక్కుల ఉద్యమంలో క్రియాశీల నేతగా ఆ రోజుల్లో జిల్లాలోని ఎన్‌కౌంటర్లపై నిర్వహించిన అన్ని నిజనిర్ధారణ కమిటీల్లోనూ భాగమయ్యారు.

సిద్ధాంతపరంగానే కాకుండా బలహీన వర్గాల మహిళలు, యువత సామాజికంగా ఎదుర్కొనే సమస్యలకు కూడా ముందు నిలిచేవారు. కుటుంబ హింస, వరకట్న వేధింపులు లాంటి చిక్కుల్లో ఉన్న స్త్రీలకు తోడుగా ఉండి, న్యాయపోరాటం చేసేవారు. కులాంతర, ఆదర్శ వివాహాలను నిర్వహించేవారు. తమ పిల్లలకు కూడా కులాంతర వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలిచారు.


2018లో మిర్యాలగూడ నడివీధిలో పట్టపగలు జరిగిన ప్రణయ్ పరువు హత్యను ఎవరూ మరిచిపోలేరు. విషయం తెలిసిన వెంటనే హాస్పిటల్‌కు చేరుకుని ఆ విషాద సమయంలో ప్రణయ్‌ కుటుంబానికి దన్నుగా నిలిచారు. ఆవేదన, ఆగ్రహంతో నిరసన వ్యక్తం చేస్తూ.. రోడ్డుపైకొచ్చి ఊర్లో పలువురిని కూడగట్టి న్యాయ పోరాటానికి రంగం సిద్ధం చేశారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపేసి శాంతి చర్చలు ప్రారంభించాలని పదే పదే గుర్తు చేసేవారు. ఇలా గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్రంలో, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన సామూహిక ఉద్యమాలన్నిటిలోనూ సుబ్బారావు పాత్ర ఉంది. స్థానికంగా రెండు, మూడు తరాల యువతను చైతన్యవంతులుగా మార్చిన ఘనత ఆయనది. వీరి తిరుగుబాటు ధోరణి నచ్చని ప్రభుత్వం.. పలుమార్లు ట్రాన్స్‌ఫర్ చేసి వేధించినా, ఆయన తన పంథాను మార్చుకోలేదు.

కుటుంబ సభ్యులు, అభిమానుల వీడ్కోలుతో సుబ్బారావు భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు అప్పగించారు. సుబ్బారావు భార్య సత్యవతి 2003లో మరణించారు. వారి పెద్దకొడుకు శరత్ విప్లవోద్యమంలో కొంతకాలం పనిచేశారు. అనారోగ్యం కారణంగా ఆయన 2019లో చనిపోయారు. వీరిద్దరి మృతదేహాలను కూడా వైద్య కళాశాలకు ఆయన అందజేశారు. భార్య చనిపోయాక ఆమె జ్ఞాపకార్థం తమ ఇంటిని గ్రంథాలయంగా తీర్చిదిద్ది, 20 ఏళ్లపాటు దాన్ని నిర్వహించారు. ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలను సేకరించి అందుబాటులో ఉంచేవారు. వయోభారం వల్ల రెండేళ్ల క్రితం ఆ పుస్తకాలను నాగార్జునసాగర్ క్యాంపు లైబ్రరీకి అప్పగించారు. శరీరం సహకరించని ముదిమి వయసులో కూడా.. సమాజం మారాలని తపించిన యోగి సుబ్బారావు.

బద్రి నర్సన్

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 12:20 AM