సమాజం మారకుండా భాష మారుతుందా?
ABN , Publish Date - May 11 , 2026 | 01:05 AM
భాషలో అసమానత గురించీ, ఈ విషయంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి కొండబాబు గారి ఆవేదన అర్థవంతమైనదే (‘భాషలో అసమానతను ఎలా సరిచేద్దాం?’ వివిధ: 13.04.2026). అయితే ఇక్కడ..
భాషలో అసమానత గురించీ, ఈ విషయంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి కొండబాబు గారి ఆవేదన అర్థవంతమైనదే (‘భాషలో అసమానతను ఎలా సరిచేద్దాం?’ వివిధ: 13.04.2026). అయితే ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న వేసుకోవాలి. సమాజంలో ఎన్నో అసమానతలున్నాయి. తరతరాల ఈ అసమానతలు మన రక్తంలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. సమాజంలోని అసమానతల ప్రతిబింబమే భాషలోని అసమానతలు కూడా. పురుషాధిక్య వ్యవస్థలో స్త్రీల పట్ల చిన్నచూపు సర్వసాధారణమైపోయింది. స్త్రీవాద ఉద్యమాల వల్ల కొద్దిమందిలోనైనా కొంత స్పృహ వచ్చింది కానీ పూర్తి మార్పు రాలేదు. ఈ సామాజిక అసమానతల్ని రూపుమాపే ప్రయత్నం చేయకుండా కేవలం భాషలోని అసమానతల్ని తొలగించడం సాధ్యం కాదు.
జంతువులు, వస్తువులతోబాటు స్త్రీలను కూడా అమహత్తులతో చేర్చారని కొండబాబు విమర్శ. సంస్కృతంలోని లింగ వివక్షకూ, తెలుగులోని లింగ వివక్షకూ చాలా తేడా ఉంది. సంస్కృతంలోని పదాలన్నిటినీ పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలుగా విభజించారు. పుంలింగాలంటే పురుష వాచక శబ్దాలు కాదు, స్త్రీ లింగాలంటే స్త్రీ వాచక శబ్దాలు కాదు, నపుంసక లింగాలంటే జంతువులూ, వస్తువులూ కాదు. శబ్దాలన్నిటినీ కుప్పగా పోసి దోసిళ్ళతో మూడు డబ్బాలకెత్తి మూడు పేర్లు పెట్టారు. పురుష వాచక, స్త్రీ వాచక శబ్దాలు అన్ని లింగాలలోనూ ఉంటాయి. ఉదాహరణకు ‘దారాః’ అనే శబ్దం స్త్రీ వాచకమైనా పుంలింగ శబ్దం. ‘వృక్షః’ అనేది పురుష వాచకం కాకపోయినా, పుంలింగ శబ్దం. కాని తెలుగులో అలా కాదు. పురుష వాచకాల్ని మహద్వాచకాలుగా, స్త్రీ వాచకాల్ని మహతీ వాచకాలుగా, ఇతర శబ్దాల్ని అమహద్వాచకాలుగా అర్థవంతంగా విభజించారు. అయితే క్రియాపదాల విషయంలో మాత్రం స్త్రీలకు సంబంధించిన వాటిని కూడా జంతువులు, వస్తువులకు సంబంధించిన పదాలతోనే – వచ్చింది, పోయింది అనే ఉపయోగిస్తున్నాం.
దీనికి కొండబాబు హేతుబద్ధంగా ఒక సూచన చేస్తున్నారు. పురుషులకు వాడే ‘డు’ ట–వర్గాక్షరం, స్త్రీలకు వాడే ‘ది’ త–వర్గాక్షరం. కాబట్టి జంతువులకూ వస్తువులకూ ప–వర్గాక్షరం అయిన ‘బి’ని వాడాలంటున్నారు. కానీ ‘వచ్చింబి’ అనేది పలకడానికి వినడానికి బాగా లేదు. జనం దీన్ని అంగీకరించడం కష్టం. భాష విషయంలో అలవాటు, సౌలభ్యం చూస్తారే గాని, హేతుబద్ధంగా ఆలోచించి కొత్త మార్పుల్ని స్వీకరించడం జరగదు.
పూర్వం స్త్రీ పురుషులిద్దరికీ ‘వచ్చెను’ లాంటి సామాన్య రూపాలుండేవని కొండబాబు అన్నారు. అది స్త్రీ పురుషుల్ని సమానంగా చూసే దృష్టితో వచ్చింది కాదు. అది గ్రాంథిక భాషా రూపం. గ్రాంథిక భాషలో పురుషులకూ, స్త్రీలకూ, జంతువులకూ ఒకే క్రియారూపం ‘వచ్చెను’ అనేది. పురుషులకూ, స్త్రీలకూ ‘రు’ అని బహువచన రూపాన్నయినా వాడొచ్చని మరొక పరిష్కారాన్ని కూడా సూచించారు కొండబాబు. ఇది కొంత ఫరవాలేదు. అయితే ఈ బహువచన రూపాన్ని ఏకవచనంలో అన్ని సందర్భాల్లో వాడటం అలవాటు లేని వ్యవహారం కాబట్టి ఆచరణలో అంత సులభం కాదు.
అసమానతల్ని ప్రతిబింబించే కొన్ని పదాలకు సరైన ప్రత్యామ్నాయ పదాలు ఒక్కోసారి వెంటనే దొరకవు. ఒకవేళ దొరికినా వాటిని వ్యవహారంలోకి తీసుకురావడం కష్ట సాధ్యం. మనిషిని గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ‘మానవుడు’ అని ఉపయోగిస్తుంటాం. ఇది పురుష వాచకమే. కాని అందులో స్త్రీపురుషులిద్దరూ ఉంటారు. ‘మనిషి’ అనేది ఇద్దర్నీ తెలియజేసినా, ‘మానవుడు’ అనే మాటకే ఉపయోగం ఎక్కువ. వందల ఏళ్ళ అలవాటు సులభంగా మారదు.
ఏదేమైనా సామాజిక వ్యవస్థలో, మానవ ప్రవర్తనలో మార్పు తీసుకురాకుండా కేవలం భాషలో అసమానతల్ని తొలగించడం గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరడం లాంటిదే.
వి. చెంచయ్య
94406 38035
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News
సమతా భాష సమాజాన్ని మారుస్తుంది!
‘సమ్మిళిత పదజాలం’ (ఇన్‌క్లూజివ్ లాంగ్వేజ్) ఆవశ్యకతపై అర్థవంతమైన చర్చను ఆరంభించిన టి. కొండబాబు అభినందనీయులు (‘భాషలో అసమానతను ఎలా సరిచేద్దాం?’ వివిధ: 13.04.2026). ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సమస్యను అధిగమించే కృషి ఇప్పటికే మొదలైంది. ఆంగ్లంలో వలెనే తెలుగులోనూ భాషాగతమైన వివక్షను గుర్తించి, సరిదిద్దే ప్రయత్నం జరగాలి. తెలుగు సాహిత్య ప్రపంచంలో, విద్యా వ్యవస్థలో, మీడియాలో, పాలనలో ఈ చర్చ ముమ్మరంగా సాగాలి. ఐక్యరాజ్యసమితి సైతం స్పష్టం చేసినట్లు – భాష మారితే భావన మారుతుంది; భావన మారితే సమాజం మారుతుంది. అందుకు అత్యంత శక్తివంతమైన మార్గం ‘సమతా భాష’ను అలవాటు చేసుకోవడమే.
కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, సరైన పదాల ఎంపిక పట్ల అవగాహన లేకపోవడమే అసమానతకు దారితీస్తుంది. ఉదాహరణకు, పదో తరగతి (ఆంధ్రప్రదేశ్) ఆర్థిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘ఉపాధ్యాయునికి సూచనలు’ అని ముద్రించారు. తెలంగాణ పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ఉపాధ్యాయుడి ప్రతిస్పందన’, ‘ఉపాధ్యాయుడి తయారీ’ వంటి పదాలు వాడారు. ఉపాధ్యాయుల్లో మెజారిటీ మహిళలే ఉన్నప్పటికీ, పాఠ్యపుస్తకాల్లో మాత్రం ‘ఉపా ధ్యాయుడు’ మాత్రమే కనిపిస్తారు. ఇది కావాలని చేసిన తప్పు కాకపోవచ్చు, కానీ అందరినీ కలుపుకునిపోయే భాషను వాడటం ముఖ్యం. ‘ఉపాధ్యాయులకు సూచనలు’, ‘ఉపాధ్యాయుల ప్రతిస్పందన’ అని బహువచనంలో రాస్తే సరిపోయేది.
ఆంగ్లంలో ‘మిస్టర్’ అనేది పురుషుడి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా వాడే గౌరవ సూచకం. స్త్రీలకు కూడా అదే స్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో ‘మిస్’ పదం పుట్టింది. హిందీలో ‘సుశ్రీ’ కూడా ఇదే పని చేస్తుంది. కానీ తెలుగులో మనం నేటికీ ‘శ్రీమతి’ (వివాహిత), ‘కుమారి’ (అవివాహిత) అనే వాడుతున్నాం. ఒక స్త్రీని పేరు పెట్టి అధికారికంగా పిలవాలంటే, ముందే ఆమె వైవాహిక స్థితిని ఆరా తీయాలా? ఈ లోటును పూరించే ఒక ‘సమతా సూచకం’ తెలుగులో అత్యవసరం. అప్పటివరకు, స్త్రీ–పురుషులందరికీ సమానంగా ‘శ్రీ’ అని వాడటం మంచి ప్రత్యామ్నాయం.
సమతా భాష అంటే కేవలం స్త్రీ–పురుష సమానత్వం మాత్రమే కాదు. శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న వారిని, ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారిని ముందుగా ఒక ‘వ్యక్తి’గా గుర్తించే ‘వ్యక్తి–మొదలు భాష’ (పర్సన్–ఫస్ట్ లాంగ్వేజ్) సమాజానికి అంతే అవసరం. ఉదాహరణకు ‘వికలాంగులు’ అనే పదంలో, ఆ మనిషి కంటే వారిలోని లోపానికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది. ఆంగ్లంలో ‘పర్సన్ విత్ డిసెబిలిటీ’ అన్నప్పుడు, అక్కడ ముందుగా ‘పర్సన్’ (వ్యక్తి) వస్తారు. తెలుగులోనూ ఆ మానవతా స్ఫూర్తిని పొందుపరిచే కొత్త పదాలను మనం సృష్టించుకోవాలి. మరికొన్ని ‘వ్యక్తి– మొదలు’ ఉదాహరణలు పరిశీలిస్తే: ఆంగ్లంలో ‘పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్’ అంటారు. కానీ తెలుగులో ‘మందమతి’, ‘పిచ్చివారు’ వంటి పదాలు వాడుతున్నాం. అలాగే ఆంగ్లంలో ‘ఎయిడ్స్ విక్టిమ్’ లేదా ‘హెచ్‌ఐవీ పేషెంట్’ అనే పదాలకు బదులు ‘పర్సన్ లివింగ్ విత్ హెచ్‌ఐవీ/ ఎయిడ్స్’ అనే సమ్మిళిత పదాన్ని వాడుకలోకి తెచ్చారు. కానీ మనం ‘ఎయిడ్స్ రోగి’, ‘హెచ్‌ఐవీ బాధితులు’ అనే వాడుతూ, వారిని జీవితకాలం రోగులుగానే చూపిస్తున్నాం. (పలకడానికి కాస్త పెద్దగా అనిపించినా ‘ఎవరైతే హెచ్‌ఐవీతో జీవిస్తున్నారో’ అనే పదబంధం కొంత బాగు.)
తెలుగులోనే కాదు, చాలా భాషల్లో ఈ ‘వ్యక్తి–మొదలు’ పదావళి కొరత ఉంది. కానీ, ‘‘పదాలు లేవు కాబట్టి పర్వాలేదు’’ అని రాజీ పడకూడదు. సమానత్వం కోసం ఆ పదాలను సృష్టించుకోవాలి. సుప్రీంకోర్టు విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వారి ‘లింగ–సమతా కమ్యూనికేషన్ గైడ్’ తరహాలోనే, తెలుగులోనూ ఒక అధికారిక ‘తెలుగు సమతా పదకోశం’ (ఇన్‌క్లూజివ్ గ్లోసరీ), ‘సమతా భాషా మార్గదర్శిని’ రూపొందించే బాధ్యతను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలి.
శ్రీనివాస్ మాధవ్
92471 59343
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News