పూరిగుడిసె నుంచి పార్లమెంటు దాకా..
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:52 AM
అప్పికట్ల జోసెఫ్ ప్రజాజీవితాన్ని పరిశీలిస్తే ఒక విశిష్ట లక్షణం స్ఫురిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా పోరాడి, తొలి పార్లమెంటేరియన్‌గా దేశానికి సేవ చేసి, శాసనమండలి సభ్యుడిగా ప్రజల సమస్యలను...
అప్పికట్ల జోసెఫ్ ప్రజాజీవితాన్ని పరిశీలిస్తే ఒక విశిష్ట లక్షణం స్ఫురిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా పోరాడి, తొలి పార్లమెంటేరియన్‌గా దేశానికి సేవ చేసి, శాసనమండలి సభ్యుడిగా ప్రజల సమస్యలను వినిపించినప్పటికీ, ఆయన అధికారాన్ని ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదు. ఆయన జీవితంలో వెంటనే హృదయాన్ని తాకే విషయం ఆయన నిరాడంబర జీవనం. స్వాతంత్ర్య సమరయోధుడిగా, పార్లమెంటేరియన్‌గా, శాసనమండలి సభ్యుడిగా ఉన్నత పదవులు చేపట్టినప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంత సాధారణంగా ఉండేది. విజయవాడ కొండపైన పూరి గుడిసెలో నివసించేవారు. వర్షాకాలంలో చినుకులు లోపలికి వచ్చేంత మామూలు గుడిసె అది. అధికారం ఉన్నప్పుడు ఇళ్లు, భూములు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి ప్రయత్నించకుండా, సామాన్య ప్రజల జీవన పరిస్థితులకు దగ్గరగా ఉండటమే ఆయనకు సహజమైన జీవన విధానం.
జవహర్‌లాల్ నెహ్రూ విజయవాడలో ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో అప్పికట్ల జోసెఫ్ సభా ప్రాంగణానికి వచ్చారు. భద్రతా కారణాలతో పోలీసులు ఆయనను వేదికపైకి రానీయలేదు. అప్పుడు జోసెఫ్ తను వచ్చినట్టు నెహ్రూజీకి చెప్పమని కోరారు. విషయం నెహ్రూజీ దృష్టికి వెళ్లగానే, నెహ్రూ వెంటనే ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సంఘటనతో జోసెఫ్ కేవలం ప్రాంతీయ నాయకుడు కాదనీ, జాతీయ నాయకత్వంతో సన్నిహిత పరిచయం, గౌరవం పొందిన ప్రజానాయకుడనీ అర్థమవుతుంది. విజయవాడ గాంధీహిల్‌కు ‘సరిహద్దు గాంధీ’ (ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్) వచ్చిన సందర్భం కూడా జోసెఫ్‌కు ప్రజల్లో ఉన్న గుర్తింపును చూపెట్టింది. ‘సరిహద్దు గాంధీ’ని చూడటానికి వచ్చిన ప్రజలకు ఆయనను గుర్తించేందుకు మైకుల ద్వారా, ‘అప్పికట్ల జోసెఫ్ గారి కుడివైపు ఉన్న వ్యక్తే సరిహద్దు గాంధీ’ అని ప్రకటించారు.
కేంద్రమంత్రి పి.శివశంకర్ గ్యాస్ – పెట్రోలియం డీలర్‌షిప్ ఇవ్వజూపితే జోసెఫ్ దానిని సున్నితంగా తిరస్కరించారు. బాబూ జగ్జీవన్‌రామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన అవకాశం వచ్చినప్పటికీ దానినీ తిరస్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వ స్థలం పొందే అవకాశం ఉన్నప్పటికీ తీసుకోలేదు.
పేద కుటుంబాల పిల్లల జీవితాలను మార్చడానికి విద్యే శక్తివంతమైన సాధనమని ఆయన నమ్మారు. తండ్రి అప్పికట్ల భూషణం స్మారకార్థం విజయవాడలోని లంబాడీపేటలో అప్పికట్ల భూషణం మెమోరియల్ స్కూల్‌ను హాస్టల్ సౌకర్యంతో స్థాపించారు. పాఠశాల ప్రారంభించడం ఆయనకు కేవలం ఒక విద్యాసంస్థ నిర్మించడం కాదు. పేదపిల్లలకు చదువు, వసతి, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు అందించాలనే సామాజిక దృక్పథం. కంచికచర్ల కోటేశు ఘటన సమయంలో బాధితుడి పరిస్థితిని తెలుసుకోవడానికి జగ్జీవన్ రామ్ విజయవాడకు వచ్చినప్పుడు, జోసెఫ్ గారిని ఒక్కరినే తనతో తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. జోసెఫ్ గాంధేయవాది. రాజకీయ జీవితంలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనా, తనపై దాడులు జరిగిన సందర్భాల్లో కూడా, ప్రతీకారానికి పాల్పడకుండా అహింసా మార్గాన్నే అనుసరించారు. సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, కానీ మనిషిపై ద్వేషం చూపకూడదనేది ఆయన గాంధేయ దృక్పథం. ప్రముఖ గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్యతో ఆయన స్నేహం కూడా ఆయన ఆలోచనా విధానానికి ప్రతిబింబం. నిరాడంబర జీవనం, నిజాయితీ, ప్రజాసేవ, గాంధేయ విలువలు– ఈ అంశాల్లో ఇద్దరి మధ్య సారూప్యత ఉండేది. కాకాని వెంకటరత్నం ఎన్.జి.రంగా, నీలం సంజీవరెడ్డి, కొంగర జగ్గయ్య, పిన్నమనేని కోటేశ్వరరావు, రఘురామయ్య, చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తదితర ప్రముఖులతో ఆయనకు పరిచయాలు, రాజకీయ అనుబంధాలు ఉన్నాయి.
అప్పికట్ల జోసెఫ్ సేవలకు గుర్తింపుగా భారత తపాలాశాఖ 2021లో ఆయన పేరుతో ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన నాయకుడిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యను ఆయుధంగా మలిచిన సామాజిక సేవకుడిగా అప్పికట్ల జోసెఫ్ సంపాదించుకున్నది ఆస్తులు కాదు, చరిత్రలో స్థానం.
ఎ.వి. పటేల్
మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్
(ఆగస్టు 31: అప్పికట్ల జోసెఫ్ 30వ వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్
For More National News And Telugu News