Share News

నేతన్నది, చంద్రన్నది పోగు బంధం

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో అయిదు లక్షలకు పైగా కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కుల వృత్తులకు అండగా నిలుస్తోంది...

నేతన్నది, చంద్రన్నది పోగు బంధం

ఆంధ్రప్రదేశ్‌లో అయిదు లక్షలకు పైగా కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కుల వృత్తులకు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా చేనేతరంగ అభివృద్ధికి, నేతన్నల గౌరవప్రద జీవనానికి అధిక ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచారు. జనతా వస్త్రాల పథకం పేరుతో సగం ధరలకే చేనేత వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల అటు పేదలకు తక్కువ ధరకు నాణ్యమైన చేనేత వస్త్రాలు లభిస్తే... పెరిగిన అమ్మకాలతో నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది.

ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నారు. నూతన టెక్స్‌టైల్‌ పాలసీలు అమలు చేయడం, మెగా క్లస్టర్లు, టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 2014–19లో త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేసి, ప్రభుత్వం అందించే వాటాను పెంచారు. పవర్ టారిఫ్‌లో 50శాతం రాయితీ ఇచ్చారు. రూ.50.15 కోట్లతో 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చేనేతల బతుకుల్లో చీకటి నింపింది. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యకలాపాలకు తిలోదకాలిచ్చి ‘నేతన్న నేస్తం’తో సరిపెట్టింది.

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడంతో మరోసారి చేనేత రంగానికి ఊపిరి వచ్చింది. ఆయన దిశానిర్దేశంలో అధికారులతో కలిసి చేనేత, జౌళిశాఖ మంత్రిగా ఎన్నో పథకాలు రూపొందించాను. 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేతలకు అందజేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం. నెలకు రూ.34.36 కోట్ల చొప్పున చేనేతలకు పెన్షన్ల రూపంలో ఏడాదికి రూ.413.53 కోట్లు చెల్లిస్తున్నాం. చేనేతలకు త్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా అందజేసే ప్రభుత్వ వాటాను 8 నుంచి 16శాతానికి పెంచాం. ఈ పథకం కింద ప్రతి బడ్జెట్‌లోనూ రూ.5 కోట్లు కేటాయిస్తున్నాం. క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నాం. చేనేత కార్మికులకు డైయింగ్ చార్జీలు, బ్లీచింగ్ చార్జీల వేతనాలు పెంచాం.


ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మగ్గంపై నేసే నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాల నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తోంది. ఈ పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మరమగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతుంది. జూలై 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 62,541 మంది చేనేత కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. నేతన్నలకు మేలు చేసేలా ఇప్పటికే పలు పథకాలు అమలుచేస్తున్నాం. 2,640 మంది చేనేత కార్మికులకు ‘ముద్ర’ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై నెలాఖరు వరకూ 343 మందికి రూ.29.96 కోట్లు అందజేశాం. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా చేనేత వస్త్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించాం. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మరో బృహత్తరమైన పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడుతున్నారు. నేతన్నలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేలా ‘నేతన్న సేవలో’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అర్హులైన నేతన్నలకు ఏటా రూ.25 వేలు అందజేసేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

రాష్ట్రంలో నేతన్నల ఆదాయంతో పాటు చేనేత ఉత్పత్తుల పెంపునకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద రూ.14 కోట్లతో చీరాల, ఎమ్మిగనూరు, రాజాం–పొందూరులలో క్లస్టర్లు ప్రతిపాదించాం. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురంలో రూ.15.01 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను మంజూరు చేశాం. సహాయక క్లస్టర్లతో పాటు ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో రూ.172 కోట్లతో పీఎం ఏక్తా మాల్ నిర్మిస్తున్నాం. చేనేతరంగ అభివృద్ధి కోసం ఆధునిక డిజైన్లపై శిక్షణ అందిస్తున్నాం. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90శాతం వరకు సబ్సిడీ కల్పించడం ద్వారా కార్మికుల ఉత్పాదకతను పెంచుతున్నాం.


చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ‘ఆద్యం, టాటా తనీరా, కో ఆప్టెక్స్’ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా ఒప్పందం చేసుకున్నాం. చేనేత వస్త్రాలు, హస్త కళారూపాలు ఒకేచోట విక్రయించేలా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 ఓడీఓపీ–2025 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. ఆప్కోలో ఫోన్ పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, కంప్యూటర్ బిల్లింగ్ వంటి సాంకేతికతలను ప్రవేశపెట్టాం. ఈ కామర్స్ సంస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకు నేరుగా చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆప్కో చేపట్టిన సంస్కరణలతో చేనేత అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సంస్థ చేపట్టిన సంస్కరణల (డిజిటలైజేషన్)కు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించింది.

గత ప్రభుత్వం చేనేత రంగాన్ని భ్రష్టుపట్టించింది. ప్రభుత్వ నిధులను ఇష్టారాజ్యంగా దారి మళ్లించింది. ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 కోట్లను తీసుకొచ్చి, పక్కదారి పట్టించింది. దీనివల్ల ఆప్కో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఆప్కోను గాడిలో పెడుతోంది. చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లిస్తున్నాం. చేనేత వస్త్రాలపై ఆప్కో, చేనేత సంఘాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహించి 40–50 శాతం డిస్కౌంట్లలో చేనేత ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షోరూమ్‌లలో అమ్మకాలు పెరిగాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. నేతన్న కుటుంబాలు ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించేలా చేయడం.

ఎస్. సవిత

చేనేత, జౌళిశాఖ మంత్రి

(నేడు జాతీయ చేనేత దినోత్సవం)

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:17 AM