పారదర్శకంగా ‘మెగా డీఎస్సీ’ నియామకాలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:15 AM
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం నవశకానికి నాంది పలికింది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ‘మెగా డీఎస్సీ’ నియామకాలను పూర్తిచేసి...
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం నవశకానికి నాంది పలికింది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ‘మెగా డీఎస్సీ’ నియామకాలను పూర్తిచేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే కూటమి ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని చూసి ఓర్వలేక జగన్‌రెడ్డి ముఠా విషప్రచారానికి తెరలేపింది.
మెగా డీఎస్సీని అడ్డుకోవాలని కోర్టుల్లో ఏకంగా 240 కేసులు వేసింది. అయినా న్యాయస్థానాలు కూటమి ప్రభుత్వ విధానాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మెగా డీఎస్సీ ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే సాగింది. ప్రశ్నపత్రాల తయారీ, భద్రత, అప్‌లోడ్ ప్రక్రియలను పూర్తి గోప్యంగా ఉంచారు. ఎస్‌సీఈఆర్టీ నిపుణులు ప్రత్యేక భద్రతా గదిలో 42 వేల ప్రశ్నలను రూపొందించగా, పాస్‌వర్డ్‌లను ప్రతిరోజూ మార్చుకుంటూ భద్రతను పటిష్ఠం చేశారు. అవుట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి యాక్సెస్ ఇవ్వకుండా, ప్రశ్నల అప్‌లోడ్‌ను కేవలం ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులే ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో నిర్వహించారు. ప్రతి సెషన్‌లో ప్రశ్నలు ర్యాండమైజేషన్ ద్వారా రావడంతో లీకేజీకి అవకాశమే లేకుండా చేశారు. అభ్యర్థుల అభ్యంతరాలు, టెట్ వెయిటేజీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ల అమలు వంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది ఎంపిక జాబితా రూపొందించారు తప్ప, మెరిట్ లిస్టు ఎక్కడా రద్దు కాలేదు. 33,830 ఫిర్యాదులను మూడు స్థాయిల గ్రీవెన్స్ వ్యవస్థ ద్వారా పరిష్కరించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేశారు.
ఈ ఎంపికలు కేవలం మెరిట్ ర్యాంకు ఆధారంగా మాత్రమే జరగవు. అభ్యర్థి కేటగిరీ, రోస్టర్ విధానం, హారిజాంటల్ రిజర్వేషన్లు, మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికులకు వర్తించే నిబంధనల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి. అందుకే కొందరు అభ్యర్థులకు మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ, వారి కేటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ పరిమితుల కారణంగా ఎంపిక సాధ్యం కాలేదనే వాస్తవాన్ని గ్రహించాలి.
కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్‌లోనే పారదర్శకమైన స్పోర్ట్స్ పాలసీని తెచ్చింది. తొలిసారి స్పోర్ట్స్ కోటాలో 3శాతం రిజర్వేషన్ పెంపుతో 431 పోస్టులు కేటాయించగా, 3,600 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 382 మందిని రాష్ట్ర స్థాయి కమిటీ నిబంధనల ప్రకారం ఎంపిక చేశారు. క్రీడల స్థాయి, సాధించిన పతకాల ఆధారంగా జీవోల ప్రకారం అధికారుల సమక్షంలో ఒకటికి రెండుసార్లు స్క్రూటినీ జరిగాకే అర్హులను ఎంపిక చేశారు. 2011 నుంచి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్‌ను జారీ చేసేది ఫెడరేషన్లు, యూనివర్సిటీలే తప్ప, క్రీడలశాఖ లేదా శాప్ సంస్థ కాదనే కనీస జ్ఞానం జగన్ ముఠాకి లేదు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్త ఉద్యోగాల కోసం ఆమోదించిన 65 ఆటల జాబితానే పోర్టల్‌లో ఉంచారు తప్ప, కూటమి ప్రభుత్వం సొంతంగా చేర్చిన ఆట ఒక్కటి కూడా లేదు. ఒలింపిక్ కౌన్సిల్ గుర్తించిన ‘బ్రిడ్జ్’ క్రీడను వీధి పేకాటతో పోల్చడం వైసీపీ నేతల అజ్ఞానానికి పరాకాష్ఠ. ఈ గేమ్ కింద ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోయినా, మెగా స్కామ్ అంటూ బురద చల్లే యత్నం చేశారు.
వైసీపీ పాలనలో నిరుద్యోగుల జీవితాలు అంధకారమయ్యాయి. 2019 ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, చివరకు 2024 ఎన్నికలకు రెండు నెలల ముందు కేవలం 6,100 అరకొర పోస్టులతో కంటితుడుపు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 2013లోనే రద్దయిన ‘అప్రెంటిస్ విధానాన్ని’ మళ్లీ తెచ్చి, ఉద్యోగం వచ్చినా రెండేళ్ల పాటు పూర్తి జీతం ఇవ్వకుండా ఉపాధ్యాయుల పొట్టకొట్టాలని చూశారు జగన్‌రెడ్డి. తన పాలనలో యువతకు మేలేమీ చేయకపోగా, పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి వారికి తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇళ్లల్లో పనిచేసే వాళ్లు, డ్రైవర్లు, రిక్షా కార్మికులతో అత్యున్నత గ్రూప్–1 పరీక్ష పేపర్లను దిద్దించి వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కడప జిల్లా పరిషత్‌లో ఎవరూ చనిపోకపోయినా వైసీపీ పెద్దల అండతో 15 మందికి నకిలీ కారుణ్య నియామకాలు ఇచ్చి రూ.కోట్లు నొక్కేసారు. 2024 ఎన్నికల కోడ్‌కు ముందు రూ.50 కోట్ల లంచాలు చేతులు మారాక, 2000 మంది టీచర్ల బదిలీలకు దొంగచాటుగా ఉత్తర్వులు ఇచ్చారు. యువత ప్రతిభను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న జగన్‌రెడ్డి అండ్ కోపై చట్టపరమైన చర్యలు తప్పవు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం రావడం ఖాయం!
అనగాని సత్యప్రసాద్
రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News