ఆగస్టు 17న నాగ పంచమి.. సుబ్రహ్మణ్యస్వామిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!
ABN , Publish Date - Aug 16 , 2026 | 07:32 AM
శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 17వ తేదీ వచ్చింది. ఆ రోజు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు పూజిస్తారు.
శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 17వ తేదీ వచ్చింది. ఆ రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు.
ఈ రోజు ఇలా చేయండి..
తెల్లవారుజామునే లేచి.. తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి దేవాలయానికి వెళ్లి ఆవుపాలతో అభిషేకం చేయించాలి. ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఒంటి పూట భోజనం చేయాలి. రాత్రికి చాపపై నిద్రించాలి. అలా కుదరకపోతే.. శివాలయాల్లో రావి చెట్టు కింద జంట నాగుల విగ్రహాలుంటాయి. ఆ విగ్రహాలకు మంచి నీటితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆవుపాలతో అభిషేకం (విగ్రహాలు మొత్తం తడిచే విధంగా ఆవుపాలు పోయాలి) చేయాలి.
అనంతరం స్వామి వారిని పసుపు, కుంకుమలతో పాటు ఎర్రని పూలతో పూజించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. స్వామి వారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు (పెసరపప్పు) పెట్టాలి. ఆగరబత్తులు వెలిగించి ధూపాన్ని సమర్పించాలి. చివరకు స్వామి వారికి హారతి ఇవ్వాలి. స్వామి వారికి నమస్కరించి.. మనస్సులోని కోరికలు చెప్పుకోవాలి.
ఈ మంత్రాన్ని..
ఓం భుజంగేశాయ విద్మహే.. సర్పరాజాయ ధీమహి.. తన్నో ముక్తి నాగ: ప్రచోదయాత్ (ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు పఠించండి). అలాగే శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించాలి.
పంచమి ఎప్పుడు.. ఆదివారమా? సోమవారమా?
శ్రావణ శుద్ధ పంచమి తిథి ఆగస్టు 16 ఆదివారం సాయంత్రం 4.52 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు.. ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం వేళ ఏ తిథి ప్రకారం.. సోమవారం ఆగస్టు 17న నాగ పంచమి పండుగ జరుపుకోవాలి.
రెండు మాసాల్లో నాగ పంచమి..
శ్రావణ మాసంతోపాటు కార్తీక మాసంలో కూడా నాగ పంచమిని భక్తులు జరుపుకుంటారు. ఈ రెండు మాసాల్లో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు.
ఈ రోజు..
మద్యం, మాసం, పరుష పదాలు మాట్లాడకుండా ఉండడం ఉత్తమం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..