దీపావళి వేళ ఇవి దానం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్నీ శుభాలే
ABN , Publish Date - Nov 08 , 2026 | 09:29 AM
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారు అనుగ్రహిస్తారని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పేరు చెబితే.. ఇంటింటా దీపాల వెలుగులు, ఆకాశంలో రంగురంగుల బాణసంచా జిలుగులు గుర్తుకొస్తాయి. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం శ్రద్ధగా నిర్వహించే పూజలూ కళ్ల ముందుకొస్తాయి. ఈ పూజల్లో భాగంగా భక్తులు పూలతోరణాలతో, రంగవల్లులతో ఇంటిని అలంకరిస్తారు. అయితే ఈ పండుగ సందర్భంగా కొన్ని వస్తువులను దానంగా ఇస్తే అమ్మవారు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అంటున్నాయి. దీపావళి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ వస్తువులు దానం చేయటం మంచిదో తెలుసుకుందాం.
అన్నదానం.. పుణ్యఫలం
దీపావళి సందర్భంగా అన్నదానం చేస్తే అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందనే విశ్వాసం ఉంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలని, పేదవారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలను హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న.. అని భారతీయులు భావిస్తారు. అందుకే దీపావళి నాడు అన్నదానం చేయటం శ్రేయస్కరం.
వస్త్రదానం.. శుభప్రదం
లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించాలంటే దీపావళి నాడు వస్త్రదానం చేయాలని మహాపండితులు సూచిస్తున్నారు. పండుగ సందర్భంగా పేదలకు కొత్త బట్టలు దానంగా ఇవ్వొచ్చు. మంచి స్థితిలో శుభ్రంగా ఉన్న పాత దుస్తులనూ దానం చేయొచ్చు. దీపావళి ఎప్పుడూ చలికాలంలోనే వస్తుంది కాబట్టి అవసరమైన వారికి వెచ్చని దుస్తులు ఇవ్వడం ఇంకా మంచిది.
ప్రమిద దానం.. ప్రత్యేకం
దీపావళి రోజున ప్రమిద కాంతులకు ప్రత్యేక స్థానం ఉంది. మట్టి ప్రమిదల్లో అతివలు దీపాలు పెట్టిన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. అందుకే మట్టి ప్రమిదలను దానంగా ఇవ్వాలంటున్నారు పండితులు. వీటిని దానం చేస్తే శుభం జరుగుతుందని భక్తులూ విశ్వసిస్తున్నారు.
నెయ్యి దానం.. లాభదాయకం
పండుగ సందర్భంగా నెయ్యి, నూనెలను దానంగా ఇచ్చే ఆనవాయితీ కూడా ఉంది. సాధారణంగా వీటిని దేవాలయాలకు అందిస్తారు. ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందనే నమ్మకాలూ ఉన్నాయి..
చీపురు దానం.. శ్రేయస్కరం
దీపావళికి చీపురును దానంగా ఇచ్చే ఆసక్తికర సంప్రదాయమూ ఉంది. నిత్యం గృహాలను పరిశుభ్రంగా ఉంచే చీపురును లక్ష్మీదేవీ ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. అందుకే చీపురును దానం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారని విశ్వసిస్తారు. సంపదలు, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు.
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కూర్చి, పేర్చి మీకు అందించాం. ఇందులో రాసిన విషయాలను మతపరమైన అంశాలుగా భావించాలి.
ఇవీ చదవండి
దీపావళి పూజా విధానం.. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..
దీపావళి వేళ.. ఏ రాశుల వారు ఏ దేవుళ్లను పూజించాలి..