ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!
ABN , Publish Date - Aug 07 , 2026 | 03:28 PM
రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 7: ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మొదట సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఆ ఘటన వెనుక, భార్యను హతమార్చి రూ.44 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి భర్త వేసిన ఘోరమైన స్కెచ్ బయటపడింది.
ప్లాన్ ప్రకారం హత్య:
నిందితుడు అమర్ సింగ్, తన భార్య రీటా (32)ను పక్కా ప్రణాళిక ప్రకారం ఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ కారుతో వేచి ఉన్న తన ముగ్గురు అనుచరులతో కలిసి ఆమెను కారుతో గుద్దించాడు. కారు ఢీకొట్టడంతో రీటా పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ఆమెను బయటకు తీసి, మళ్లీ రోడ్డుపై పడేసి ఆమెపై నుంచి కారుతో తొక్కించి అక్కడి నుంచి పరారయ్యారు.
మిస్సింగ్ కేసు డ్రామా: హత్య అనంతరం ఏమీ తెలియనట్లు భర్త అమర్ సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. మరోవైపు, పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద దొరికిన ఒక బ్యాంక్ స్లిప్ ఆధారంగా బాధితురాలిని రీటాగా గుర్తించారు.
అడిషనల్ ఎస్పీ అరవింద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సీసీటీవీ దృశ్యాలు, టెక్నికల్ సర్వైలెన్స్, నిందితుల విచారణ ఆధారంగా 48 గంటల్లోనే ఇది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు తేల్చారు.

హత్యకు కారణం
రీటా పేరిట ఉన్న రూ.44 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేయడానికే అమర్ సింగ్ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల్లో అమర్ సింగ్ తన అప్పులు తీర్చుకోడానికి రూ.15 లక్షలు ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని మిగతా ముగ్గురు సహచరులకు పంచిచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.
ఈ కేసులో భర్త అమర్ సింగ్‌తో పాటు అతనికి సహకరించిన అమిత్ గుప్తా, పుష్పేంద్ర సోని, అభయ్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు రీటా, అమర్ సింగ్‌లు రెండేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే.. రీటాకు ఇది రెండో పెళ్లి కాగా, అమర్ సింగ్‌కు మూడో వివాహమని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం