Share News

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:21 AM

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..
Swat Commando Kajal Chaudhary Murder

ఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ స్వాత్(Special Weapons and Tactics Teams)లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27), తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కలిచివేసే వివరాలు ఇలా ఉన్నాయి.

'నీ చెల్లిని చంపేస్తున్నా.. రికార్డ్ చేసుకో'

ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో ఆమె(కాజల్) సోదరుడు నిఖిల్ (ఈయన కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్) కు ఫోన్ చేశాడు. 'ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా' అని చెప్పి, ఆమెపై దాడికి దిగాడు.

ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి 'తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు' అని చెప్పడం గమనార్హం.


ఘటన నేపథ్యం..

జనవరి 22న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్-అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది. భర్త.. నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టి, ఆపై బరువైన డంబెల్ (Dumbbell)తో ఆమె తలపై దాడి చేశాడు.

గర్భిణీ అని కూడా చూడకుండా..

దాడి సమయంలో కాజల్ నాలుగు నెలల గర్భిణీ. ఆసుపత్రిలో ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి, జనవరి 27న కమాండో కాజల్ కన్నుమూశారు. కట్నం వేధింపులే తమ బిడ్డ హత్యకు ప్రధాన కారణమని కాజల్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు అంకుర్ చౌదరి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. పెళ్లిలో బుల్లెట్ బైక్, బంగారం ఇచ్చినప్పటికీ, కారు ఇవ్వలేదని అతను తరచూ కాజల్‌ను వేధించేవాడని తెలుస్తోంది.

పోలీసులు.. నిందితుడు అంకుర్ చౌదరిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. ముందుగా హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. కాజల్ మరణం తర్వాత దానిని హత్య కేసుగా (Murder Case) మార్చారు. కాజల్-అంకుర్ దంపతులకు ఇప్పటికే ఒకటిన్నర ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాబు కాజల్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.


ఇవి కూడా చదవండి..

అజిత్‌ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..

భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు

Updated Date - Jan 30 , 2026 | 12:19 PM