Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:56 PM
అనంతపురం జిల్లాలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎస్‌బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయంపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.
- తూముకుంట చెక్‌పోస్టు ఎస్‌బీఐ చోరీ నిందితుడి పన్నాగం
- మాటువేసి పట్టుకొచ్చిన పురం పోలీసులు
- ‘సినిమా’ చూపించిన బంధువులు
హిందూపురం(అనంతపురం): సాధారణంగా నేరం చేసినవారు ఎలాగోలా శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ దొంగ చోరీ చేసిన సొత్తును కాపాడుకోవడానికి అంతకుముందు చేసిన నేరంలో జైలుకు వెళ్లాడు. బెయిల్ కూడా తీసుకోకుండా జైలులోనే ఉండటానికి సిద్ధమయ్యాడు. ఆ కథాకమామిషు ఇలా...
జిల్లాలోని తూముకుంట(Tumukunta) చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎస్‌బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసులో నిందితుడైన మాజీ సైనికుడు అనిల్‌కుమార్ పన్వార్‌ను గతేడాది ఆగస్టులో ఢిల్లీ ప్రాంతంలో పట్టుకున్నారు.
అతడి నుంచి 2కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హరియాణాకు చెందిన అనిల్‌కుమార్ పేకాట వ్యసనంతో బ్యాంకులు దోపిడీ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈక్రమంలో తమిళనాడులోని కొయంబత్తూరు వద్ద బ్యాంక్ దోపిడీకేసులో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో జైలులో ఉన్న రాజస్థాన్ రాష్ట్రం కరౌలి జిల్లా సలాంపూర్‌కు చెందిన మహమ్మద్ ఇస్రార్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు జైలు నుంచి బయటకు వచ్చాక తూముకుంట చెక్‌పోస్టులో ఉన్న బ్యాంకును దోపిడీకి పాల్పడ్డారు.

నాలుగు బృందాలతో వేట
బ్యాంకు దోపిడీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు గత ఏడాది ఆగస్టులో అనిల్‌కుమార్ పన్వార్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన మహ్మద్ ఇస్రార్‌ఖాన్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుత ఎస్పీ సతీ్‌షకుమార్ ఈ కేసును పూర్తిగా ముగించాలని డీఎస్పీ మహేష్, అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులును ఆదేశించారు. దీంతో వారు తమ ప్రత్యేక బృందాలతో గత కొద్దిరోజులుగా నిఘా పెట్టారు. ఈక్రమంలో మహ్మద్ ఇస్రార్‌ఖాన్ కేరళలో అతడి తమ్ముడివద్ద ఉన్నాడని సమాచారం పోలీసులకు అందింది.

దీంతో పోలీసులు కేరళకు వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం రాజస్థాన్‌లో ఉన్న అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో బ్యాంకు దోపిడీ కేసులో నిందితుడై ఇస్రార్‌ఖాన్ పోలీసులకు దొరక్కూడదని భావించాడు. అందుకే గతంలో ఆయన సొంత ప్రాంతంలో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉండటంతో పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. లాయర్‌ను పెట్టుకుని బెయిల్ పొందాలని పోలీసులు చెప్పినా వినకుండా జైలుకు వెళ్లాడు. దీంతో అక్కడికి వెళ్లిన హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ పోలీసులు వెనుతిరిగి వచ్చారు. కొద్ది రోజులు అతడి బెయిల్ కోసం ఎదురు చూశారు. అక్కడే మకాం వేసి జైలు నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించగా చేసిన నేరం, ఆ తరువాత తప్పించుకునేందుకు జైలుకు వెళ్లిన విషయాలను వెల్లడించాడు.
చుక్కలు చూపించిన నిందితులు
ఇటీవల బంగారం సొత్తు రికవరీ కోసం హిందూపురం పోలీసులు రాజస్థాన్, ఢిల్లీకి వెళ్లారు. అయితే నిందితుడి స్వగ్రామానికి వెళ్లిన సమయంలో అతడి బంధువులు, కొన్నిశాఖల అధికారులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఒకానొక దశలో పోలీసులపైనే తిరగబడే స్థాయికి వచ్చినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటం, ఎప్పటికప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలోని ఆ జిల్లాకు చెందిన పోలీసు అధికారులతో మాట్లాడుతుండటంతో హిందూపురం పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
3.5 కిలోల బంగారం రికవరీ
ఇస్రార్‌ఖాన్‌ను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి సుమారు 3.5కేజీల బంగారం రికవరీ చేశారు. దీంతోపాటు ఆయన దొంగతనాలు చేసి రాజస్థాన్‌లోని సొంతూరులో సంపాదించిన ఇల్లు, ఆస్తులను అటాచ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాజస్థాన్‌కు సిఫార్సు చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News