Share News

కదిలే రైలు నుంచి దొంగను కిందకు తోసేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:04 PM

కదిలే రైలు తలుపు వద్ద వేలాడుతోన్న ఒక అనుమానిత దొంగను ప్రయాణికుడు కాళ్లతో తన్నుతూ కిందకు తోసేసిన ఘోర ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కదిలే రైలు నుంచి దొంగను కిందకు తోసేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్
Passenger Booked After Kicking Suspected Thief Off Moving Train in Raipur

రాయ్‌పూర్, జులై 19: కదిలే రైలు తలుపు వద్ద వేలాడుతున్న ఒక అనుమానిత దొంగను ప్రయాణికుడు కాళ్లతో తన్నుతూ కిందకు తోసేసిన ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు ప్రయాణికుడిపై రాయ్‌పూర్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) కేసు నమోదు చేశారు.


అసలేం జరిగిందంటే?

ఈ ఘటన జులై 14వ తేదీ మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో రాయ్‌పూర్ జిల్లాలోని మాంధర్, ఉర్కురా రైల్వే స్టేషన్ల మధ్య ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగింది.

రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. రూర్కెలాకు చెందిన కె.ఆర్. సురేష్ కుమార్ (54) అనే ప్రయాణికుడు ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్‌లోని B-4 కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఒక గుర్తుతెలియని యువకుడు సురేష్ కుమార్ పర్సును దొంగిలించి పారిపోతుండగా, పక్క బెర్తులో ఉన్న ప్రయాణికుడు గమనించి హెచ్చరించాడు. వెంటనే సురేష్ కుమార్ ఆ దొంగను వెంబడించగా, కోచ్ అటెండెంట్లు అప్పటికే ఆ అనుమానితుడిని పట్టుకున్నారు.

ఈ గందరగోళంలో సదరు దొంగ తన వద్ద ఉన్న ఓ మొబైల్ ఫోన్‌ను రైలు టాయిలెట్‌లోకి విసిరేసి, అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. కదిలే రైలు తలుపుల వద్ద ఉన్న ఎంట్రీ లాడర్ (మెట్లు) పట్టుకుని బయట వేలాడాడు.


కాలితో తన్నడంతో కింద పడిపోయిన దొంగ

తలుపు మెట్ల వద్ద ప్రాణభయంతో వేలాడుతున్న ఆ యువకుడిని ప్రయాణికుడు సురేష్ కుమార్ కాలితో బలంగా తన్నుతున్నాడు. ఆ దెబ్బకు పట్టు కోల్పోయిన ఆ యువకుడు.. రైలు పైనుంచి కింద పడిపోయాడు. అయితే, తాను ఆ యువకుడిని తన్నలేదని సురేష్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు.

పోలీసులు నిందితుడి నుంచి దొంగిలించిన పర్సును రికవరీ చేశారు. అందులో ఆధార్ కార్డ్, ఇతర పత్రాలు భద్రంగా ఉన్నప్పటికీ, మరో మొబైల్ ఫోన్, రూ. 3,000 నగదు కనిపించకుండా పోయాయని బాధితుడు తెలిపాడు. టాయిలెట్‌లో పడేసిన ఫోన్‌ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ప్రయాణికుడిపై కేసు.. దొంగ కోసం గాలింపు

రైలు పైనుంచి పడిపోయిన ఆ అనుమానిత దొంగ ఇంకా పోలీసులకు చిక్కలేదు. జీఆర్‌పీ బృందాలు స్థానిక ఆసుపత్రుల్లో వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ యువకుడు గాయాలతో నడుచుకుంటూ వెళ్లడం చూశామని కొందరు స్థానికులు పోలీసులకు తెలిపారు.

మరోవైపు, వీడియో ఆధారంగా ప్రయాణికుడు సురేష్ కుమార్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద దాడి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బి.కె. రాథోడ్ తెలిపారు. నిందితుడిని బిలాస్‌పూర్ కోర్టులో ప్రవేశపెట్టగా, అనంతరం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.


ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

సోనమ్ వాంగ్‌‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Updated Date - Jul 19 , 2026 | 07:16 PM