Chennai News: పిల్లల తండ్రినే పెళ్ళి చేసుకుంటానని మెడికో మంకుపట్టు..
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:08 PM
ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటానంటూ.. వైద్య విద్యార్థినిని అనడంతో సవతి తల్లి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. హర్షిణి (22) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- చంపేసిన సవతి తండ్రి
చెన్నై: తాను ప్రేమించిన ఇద్దరు పిల్లల తండ్రినే వివాహం చేసుకుంటానని మంకుపట్టు పట్టిన వైద్య విద్యార్థినిని సవతి తండ్రి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలంలో జరిగిన ఈ హత్య కేసులో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే, సేలం జిల్లా చిత్రాకోయిల్ సమీపంలో ఓ హోమియోపతి వైద్య కాలేజీలో తిరునెల్వేలికి చెందిన వరదరాజన్ కుమార్తె హర్షిణి (22) చివరి సంవత్సరం హోమియోపతి కోర్సు చేస్తూ తన స్నేహితురాలితో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది.
ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఇటీవల అనుమానాస్పదంగా శవమై కనిపించింది. అదేసమయంలో ఆమె తండ్రి వరదరాజన్ కనిపించకపోవడం, ఆయన మొబైల్ స్విచాఫ్ అయివుండటంతో పోలీసులకు సందేహం వచ్చి లోతుగా విచారణ జరిపారు. ఈ విచారణలో వరదరాజన్ సవతి తండ్రి అని తేలింది. నెల్లైకు చెందిన ఉష అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో హర్షిణికి నాలుగేళ్లు.. ఉష - వరదరాజన్ దంపతులకు సంతానం లేకపోవడంతో హర్షిణిని సొంతబిడ్డలా పెంచారు. ఆర్థికంగా పలు కష్టాలు ఎదురైనప్పటికీ కుమార్తెను ఉన్నత విద్యావంతురాలని చేయాలన్న లక్ష్యంతో చదివించాడు.
అయితే ఆ యువతి నెల్లై వికే పురానికి చెందిన ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించి, అతడినే పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వరదరాజన్.. కుమార్తె మనసు మార్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. ఈ క్రమంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు కాలేజీ సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళతానని చెప్పిన హర్షిణి ఇంటికి వెళ్ళలేదు, మంగళవారం తిరిగి సేలంలోని తానుండే రూమ్‌కు వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న వరదరాజన్ సాయంత్రానికి కుమార్తె వద్దకు వచ్చి, మరోమారు మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో ఆగ్రహంతో ఆమెను హత్య చేసి, గది తలుపులు వేసి వెళ్లిపోయాడు. తర్వాత తన భార్య ఉషకు ఫోన్ చేసి చెన్నై వెళ్తున్నట్టు చెప్పి మొబైల్ ఫోన్ స్విఛాఫ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హర్షిణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న వరదరాజన్ కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News