China Manja-Biker Death: వామ్మో.. చైనా మాంజా! మరో బైకర్ దుర్మరణం
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:22 PM
కర్ణాటకకు చెందిన ఓ బైకర్ చైనా మాంజా బారిన పడి మరణించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. బైక్‌పై వెళుతుండగా ఆయనకు మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలు కావడంతో దుర్మరణం చెందారు. బీదర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా మాంజా యమ పాశంగా మారి దేశవ్యాప్తంగా అనేక మందిని బలి తీసుకుంటోంది. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బైకర్ ఈ మాంజా కారణంగా దుర్మరణం చెందారు. బీదర్ జిల్లా తలమడగి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని సంజు కుమార్ హొసమణిగా గుర్తించారు (Chinese manja - Biker death Karnataka).
హొసమణి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన మెడకు మాంజా చుట్టుకోవడంతో కోసుకుపోయి గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది. ఆయన తన కూతురికి ఫోన్ చేసి సమాచారం అందించే ప్రయత్నంలో ఉండగానే కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల వారు గాయాలకు కర్చీఫ్‌లను అడ్డుపెట్టి రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మరికొందరు అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే, బాధితుడిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే కన్నుమూశారు.
హొసమణి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే ఆయన ప్రాణాలతోనే ఉండి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాప్యమే ఆయన ప్రాణాలను తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో మృతుడి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగారు. ఎమర్జెన్సీ సర్వీసులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైనా మాంజాపై నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
మకర సంక్రాంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గాలిపటాలను ఎగురవేయడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గాలిపటాల కోసం సాధారణ మాంజాలకు బదులుగా కొందరు చైనా మాంజాలను వినియోగించడంతో ప్రమాదాలు ఎదురవుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, వైర్ల నుంచి వేళ్లాడే మాంజాలు వాహనదారులకు చుట్టుకుని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా టూవీలర్స్‌పై ప్రయాణించే వారికి ఇవి యమ పాశాలుగా మారుతున్నాయి.
ఇవీ చదవండి:
తనయుడి దారుణం! ఇద్దరు భార్యలున్న తండ్రి తనకు మాత్రం పెళ్లి చేయట్లేదని..
వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య