Son Kills Father: తనయుడి దారుణం! ఇద్దరు భార్యలున్న తండ్రి తనకు మాత్రం పెళ్లి చేయట్లేదని..
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:59 PM
తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని కోపం పెంచుకున్నాడో వ్యక్తి. తండ్రికి ఇద్దరు భార్యలున్నా తన పెళ్లి విషయంలో పట్టనట్టు ఉంటున్నాడని ఆగ్రహంతో ఊగిపోయాడు. చివరకు ఓ రాత్రి వేళ నిద్రలో ఉన్న తండ్రిని కొట్టి చంపాడు. కర్ణాటకలో ఈ దారుణం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడికి 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అతడి తోటి వాళ్లందరూ పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సెటిలైపోయారు. ఇద్దరు భార్యలున్న తండ్రి మాత్రం తన పెళ్లిపై శ్రద్ధ పెట్టట్లేదని అతడు కోపంతో రగిలిపోయాడు. చివరకు విచక్షణ మరిచి కన్నతండ్రినే దారుణంగా అంతమొందించాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఇటీవల ఈ దారుణం వెలుగుచూసింది (KA Man Kills Father For Not Arranging His Marriage).
నిందితుడిని హొసదుర్గకు చెందిన ఎస్ నింగరాజగా పోలీసులు గుర్తించారు. అతడు తన తండ్రి టీ సన్ననింగప్ప నిద్రలో ఉండగా దాడి చేసి అంతమొందించారని చెప్పారు. నిందితుడి సోదరుడు మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
నింగరాజ పొలం పనులు చూసుకోకుండా సోమరిగా మారాడంటూ తన తండ్రి నింగప్ప ఆగ్రహించే వాడని మారుతి తెలిపాడు. తండ్రికి ఇద్దరు భార్యలున్నా తన పెళ్లి విషయంలో మాత్రం ఆయన శ్రద్ధ పెట్టట్లేదని నింగరాజ కోపం పెంచుకున్నాడని తెలిపారు. ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతుండేవని చెప్పారు. బుధవారం రాత్రి కూడా తండ్రీకొడుకుల మధ్య మళ్లీ ఇదే విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో తండ్రిని చంపేస్తానని నింగరాజ బెదిరించాడని అన్నారు.
ఆ రాత్రి నింగప్ప నిద్రిస్తున్న సమయంలో నింగరాజ ఆయనను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడని అన్నాడు. నింగరాజ దాడి చేసినట్టు తనకు అర్ధరాత్రి ఫోన్ రావడంతో తాను వెళ్లి తండ్రిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు తెలిపాడు. కానీ అప్పటికే నింగప్ప మృతి చెందారని డాక్టర్లు చెప్పారని అన్నాడు. ఈ నేపథ్యంలో మారుతి ఫిర్యాదు మేరకు పోలీసులు నింగరాజపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇవీ చదవండి:
మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం
అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో..