Share News

అమెరికా మార్కెట్‌ అతలాకుతలం

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:54 AM

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంతో అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణానికి అడ్డుకట్ట పడవచ్చని, కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధికి నిబంధనలు కఠినతరం కావచ్చన్న అంచనాల కారణంగా వాల్‌ స్ట్రీట్‌ గురువారం కుప్పకూలింది.

అమెరికా మార్కెట్‌ అతలాకుతలం
americamarket

ఒక్కరోజులో రూ.282 లక్షల కోట్ల సంపద ఆవిరి

న్యూయార్క్‌: మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంతో అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణానికి అడ్డుకట్ట పడవచ్చని, కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధికి నిబంధనలు కఠినతరం కావచ్చన్న అంచనాల కారణంగా వాల్‌ స్ట్రీట్‌ గురువారం కుప్పకూలింది. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు (చిప్‌), డేటా సెంట ర్లు సహా ఇతర టెక్నాలజీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించారు. దాంతో డోజోన్స్‌ ఏకంగా 1,833 పాయింట్లు (3.44శాతం) క్షీణించింది. దాంతో బుధవారం గడించిన లాభాలను సూచీ మరుసటి రోజే కోల్పోయినట్లైంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 4.36శాతం నాస్‌డాక్‌ 5.52శాతంక్షీణించాయి. అమ్మకాల సునామీ కారణంగా ఎస్‌ అండ్‌ పీ 500 కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల (రూ.282 లక్షల కోట్లు) మేర తరిగిపోయింది. నాస్‌డాక్‌ 100 సూచీ నమోదిత సంస్థల సంపద 2.5 లక్షల కోట్ల డాలర్ల (రూ.235 లక్షల కోట్లు) మేర ఆవిరైంది.

రెండ్రోజుల్లో మస్క్‌కు రూ.10.62 లక్షల కోట్ల నష్టం: ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీ ఘోర పరాభవంతో ఆయన ప్రధాన మద్దతుదారైన ఎలాన్‌ మస్క్‌కు చెందిన కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్‌ షేర్లు వరుసగా రెండో రోజూ భారీగా క్షీణించాయి. గురువారం 9 శాతానికి పైగా పతనమయ్యాయి. దాంతో ఈ రెండు కంపెనీల మార్కెట్‌ విలువ రెండు రోజుల్లో 45,600 కోట్ల డాలర్లకు (రూ.42.86 లక్షల కోట్లు) పైగా తగ్గి 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 3.04 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. తత్ఫలితంగా ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత సంపద బుధవారం 3,350 కోట్ల డాలర్లు, గురువారం మరో 8,000 కోట్ల డాలర్లు తగ్గింది. అంటే.. రెండ్రోజుల్లో మస్క్‌ 11,300 కోట్ల డాలర్ల (రూ.10.62 లక్షల కోట్లు) సంపద కోల్పోయారు.

ఇవి కూడా చదవండి..

రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి ఎల్‌జీ

Updated Date - Nov 07 , 2026 | 02:08 AM