TCS Quarterly Results: టీసీఎస్ లాభం రూ.10,657 కోట్లు
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:55 AM
ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.10,657 కోట్ల నికర లాభం ఆర్జించింది...
వార్షిక ప్రాతిపదికన 14% క్షీణత
కొత్త కార్మిక చట్టాల అమలు ప్రభావమే కారణం
అయినా...ఒక్కో షేరుపై రూ.57 డివిడెండ్
ముంబై/న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.10,657 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,380 కోట్లతో పోల్చితే లాభం 13.91ు క్షీణించింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,075 కోట్ల కన్నా కూడా ఇది తక్కువే. కొత్త కార్మిక చట్టాల అమలు ప్రభావంతోనే లాభం క్షీణించినట్టు కంపెనీ వెల్లడించింది. కార్మిక చట్టాల అమలు కారణంగా తమపై రూ.2,128 కోట్ల భారం పడినట్టు తెలిపింది. ఒకే ఒక్కసారి ఏర్పడిన ఆ ప్రభావం లేకపోయి ఉంటే కంపెనీ లాభం 8.5ు పెరిగి రూ.13,438 కోట్లుగా నమోదై ఉండేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి ఆదాయం వృద్ధిపై తాము దృష్టి కేంద్రీకరించినట్టు టీసీఎస్ సీఈఓ, ఎండీ కే కృతివాసన్ తెలిపారు. కృత్రిమ మేధ, అనుబంధ డేటా ఆదాయాలు స్థూల ఆదాయ వృద్ధికి దోహదపడ్డాయని ఆయన వెల్లడించారు. క్లయింట్లతో తాము జరుపుతున్న సంప్రదింపులను బట్టి 2026 ‘‘మంచి సంవత్సరం’’ కానుందనే నమ్మకం ఏర్పడిందని ఆయన చెప్పారు. కంపెనీ వరుసగా రెండో త్రైమాసికంలో కూడా పత్రికా సమావేశం లేకుండానే ఫలితాల ప్రకటనతో సరిపుచ్చింది.
ఇతర ముఖ్యాంశాలు...
క్యూ3లో కంపెనీ ఆదాయం 4.86ు వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.63,973 కోట్లుగా ఉంది.
సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చితే నిర్వహణాపరమైన లాభాల మార్జిన్ 25.2ు వద్ద స్థిరంగా ఉంది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 24.5 శాతం కన్నా అధికంగా ఉంది.
కృత్రిమ మేధ (ఏఐ) విభాగం ద్వారా సమకూరిన ఆదాయం 17 శాతం పెరిగి 180 కోట్ల డాలర్లకు చేరింది.
మొత్తం కాంట్రాక్టు విలువలో భాగంగా కంపెనీ సాధించిన కొత్త డీల్స్ విలువ 930 కోట్ల డాలర్లుగా ఉంది.
మొత్తం భౌగోళిక వ్యాపారంలో భారతదేశం వాటా వార్షికంగా 34శాతం క్షీణించింది. దేశీయంగా చూస్తే మాత్రం వాటా 9.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గింది.
భౌగోళిక, రాజకీయ పరిణామాల కారణంగా ఉత్తర అమెరికా ఆదాయాల్లో వృద్ధి 1.3 శాతానికే పరిమితం కాగా బ్రిటన్ నుంచి మాత్రం ఆదాయం 3.2 శాతం క్షీణించింది.
కొత్త కార్మిక చట్టాల అమలు కోసం ప్రస్తుత త్రైమాసికంలో రూ.2,100 కోట్లు ప్రత్యేకంగా ఉంచారు. అందులో రూ.1,800 కోట్లు గ్రాట్యుటీకి, రూ.300 కోట్లు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు కేటాయించారు.
భారీ డివిడెండ్
కార్మిక చట్టాల ఏకకాల ప్రభావంతో లాభం భారీగా క్షీణించినా కంపెనీ ఒక్కో షేరుపై రూ.46 ప్రత్యేక డివిడెండ్ సహా మొత్తం రూ.57 డివిడెండ్‌కు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. సోమవారం టీసీఎస్ షేరు బీఎ్‌సఈలో 0.86ు లాభంతో రూ.3,235.70 వద్ద ముగిసింది.
క్యూ3లో 11,151 మంది ఔట్
దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య మూడో త్రైమాసికంలో నికరంగా 11,151 తగ్గింది. సెప్టెంబరు చివరి నాటి కి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,314 ఉండగా డిసెంబరు 31 నాటికి అది 5,82,163కి తగ్గింది. కంపెనీలో జరుగుతున్న పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 12,000 మందికి ఉద్వాసన చెప్పనున్నట్టు టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్య పై కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీ 2004లో లిస్టింగ్ అయి న తర్వాత తొలిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదలను ప్రకటించింది. అంతకు ముందు అన్ని సంవత్సరాల్లోనూ ఏటేటా కంపెనీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఉద్యోగుల సంఖ్య తగ్గడమే కాదు... డిసెంబరు త్రైమాసికంలో స్వచ్ఛందం గా ఉద్యోగాలు వదులుకుని వలసపోయిన వారి సంఖ్య కూడా అత్యధికంగా 13.5ు ఉంది. అయితే కంపెనీ పునర్నిర్మాణ వ్యయాలు క్యూ3లో 77ు తగ్గి రూ.253 కోట్లకు పరిమితం అయ్యాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింపు 19,755గా ఉండగా వారిలో ఆరు వేల మందిని మాత్రమే తాము పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వెలుపలికి పంపినట్టు కంపెనీ మానవ వనరుల ప్రధానాధికారి సుదీప్ కున్నుమల్ చెప్పారు. ఆగస్టులో 1,800 మంది వైదొలగారన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి