3 రోజుల్లో రూ.7 లక్షల కోట్లు ఫట్
ABN , Publish Date - Apr 25 , 2026 | 02:53 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. ఈ వారంలో ముడిచమురు ధరల్లో...
సెన్సెక్స్ మరో 1000 పాయింట్లు పతనం
మళ్లీ 24,000 దిగువ స్థాయికి నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. ఈ వారంలో ముడిచమురు ధరల్లో 18 శాతం పెరుగుదల, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, పశ్చిమాసియాలో సంక్షోభం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రూపాయి క్షీణత మన మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకదశలో 1,260.13 పాయింట్లు పతనమై 76,403.87 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 999.79 పాయింట్ల (1.29 శాతం) నష్టంతో 76,664.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 275.10 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 23,897.95 వద్దకు జారుకుంది. దాంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు తగ్గి రూ.461.49 లక్షల కోట్లకు (4.89 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్ 2,609.12 పాయింట్లు (3.29 శాతం) పతనమవగా.. మార్కెట్ సంపద రూ.7.17 లక్షల కోట్ల మేర తరిగిపోయింది.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు తగ్గి రూ.94.16 వద్ద ముగిసింది. ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రెంట్ ముడిచమురు పీపా ధర ఒక దశలో 2.21 శాతం పెరిగి 107.39 డాలర్లకు ఎగబాకింది. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన రవాణా పూర్తిగా నిలిచిపోవడం ఇందుకు కారణమైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News