Share News

+830 నుంచి -623 దాకా..

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:54 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, విద్యుత్‌ రంగ షేర్లలో అమ్మకాలతో పాటు చమురు ధరలు, యూఎస్‌ బాండ్ల రేట్ల పెరుగుదల...

+830 నుంచి -623 దాకా..

  • ఇంట్రాడేలో 1,453 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌

  • 143 పాయింట్ల నష్టంతో ముగింపు

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, విద్యుత్‌ రంగ షేర్లలో అమ్మకాలతో పాటు చమురు ధరలు, యూఎస్‌ బాండ్ల రేట్ల పెరుగుదల, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి. కాగా, ఐటీ షేర్లలో కొనుగోళ్లు నష్టాలకు అడ్డుకట్ట వేయగలిగాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. కొద్దిసేపటికే 829.29 పాయింట్ల మేర ఎగబాకి 74,682.19 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన సూచీ.. మఽధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి మళ్లింది. ఒక దశలో 623.45 పాయింట్ల మేర క్షీణించి 73,229.45 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ కాస్త కోలుకున్న సెన్సెక్స్‌.. చివరికి 143.21 పాయింట్ల నష్టంతో 73,709.69 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 1,453 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడింది. నిఫ్టీ విషయానికొస్తే, ఇంట్రాడేలో 23,000 కీలక స్థాయిని అధిగమించినప్పటికీ, అక్కడే నిలదొక్కుకోలేకపోయింది. చివరికి సూచీ 77.60 పాయింట్ల నష్టంతో 22,811.35 వద్ద స్థిరపడింది.

6 వారాల గరిష్ఠానికి రూపాయి

భారత కరెన్సీ విలువ ఆరు వారాల గరిష్ఠ స్థాయికి పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు 53 పైసలు బలపడి 94.38 వద్ద ముగిసింది. జియో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు పెద్దఎత్తున సొమ్మును మన మార్కెట్లోకి తరలించడంతోపాటు స్పాట్‌ మార్కెట్లో డాలర్ల డిమాండ్‌ను తగ్గించేందుకు ఆర్‌బీఐ చేపట్టిన చర్య లు ఇందుకు దోహదపడ్డాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ చమురు పీపా ధర ఒకదశలో 2.23 శాతం ఎగబాకి 111 డాలర్ల ఎగువన ట్రేడైంది.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి: రూపాయి పుంజుకోవడంతో విలువైన లోహాల ధరలు కాస్త దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.1,300 తగ్గి రూ.1,49,000కు జారుకుంది. కిలో వెండి రేటు రూ.1,600 తగ్గుదలతో రూ.2,13,400గా నమోదైంది.

ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..

అమెరికన్‌ పిల్లలకు మస్క్‌ బంపరాఫర్‌

Updated Date - Oct 22 , 2026 | 05:54 AM