బుల్ రయ్.. రయ్
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:00 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 1,502.29 పాయింట్ల (1.82 శాతం) వృద్ధితో 83,938.28 వద్ద ముగిసింది. ఒకదశలో సూచీ 2,062 పాయింట్లు ఎగబాకి...
దూసుకెళ్లిన మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1,502 పాయింట్లు అప్
25,800 ఎగువ స్థాయికి నిఫ్టీ
రూ.3.5 లక్షల సంపద వృద్ధి
విదేశీ పెట్టుబడుల జోరు..
చమురు చల్లారడమే కారణం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 1,502.29 పాయింట్ల (1.82 శాతం) వృద్ధితో 83,938.28 వద్ద ముగిసింది. ఒకదశలో సూచీ 2,062 పాయింట్లు ఎగబాకి 84,498 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 600 పాయింట్లకు పైగా పుంజుకుని 26,000 స్థాయికి చేరువైంది. చివరికి 469.60 పాయింట్ల (1.85 శాతం) లాభంతో 25,819.25 వద్ద స్థిరపడింది. దీంతో సోమవారం నాటి నష్టాల నుంచి సూచీలు పూర్తిగా తేరుకున్నట్లైంది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్ను, చమురు ధరల తగ్గుదల, బ్లూచిప్ బ్యాంకింగ్ షేర్లలో భారీగా కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దోహదపడ్డాయి. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.50 లక్షల కోట్ల వృద్ధితో రూ.512.48 లక్షల కోట్లకు(5.54 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 27 రాణించాయి. హిందుస్థాన్ యూనిలీవర్ షేరు 5.94 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
ఫోన్‌పే ఐపీఓ ప్రక్రియ మళ్లీ షురూ
వాల్‌మార్ట్ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే.. ఐపీఓ ప్రణాళికను పునరుద్ధరించుకుంది. త్వరలోనే కంపెనీ.. సెబీకి సవరించిన ఐపీఓ పత్రాలు సమర్పించవచ్చని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్టాక్ మార్కెట్లో షేర్లను నమోదు చేసే ఆలోచనలో ఉంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.1.2-1.5 లక్షల కోట్ల స్థాయి మార్కెట్ విలువను ఆశిస్తున్నదని, మార్కెట్ నుంచి రూ.12,000-14,000 కోట్ల స్థాయిలో నిధులు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, దేశీయంగా బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్‌పే గతంలో ఐపీఓను వాయిదా వేసుకుంది.

8 నెలల గరిష్ఠానికి రూపాయి
భారత కరెన్సీ 8 నెలల గరిష్ఠ స్థాయికి పుంజకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 65 పైసలు పెరిగి 92.20 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో లాభాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల జోరు, చమురు ధరల తగ్గుదల ఇందుకు తోడ్పడ్డాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి చవిచూసిన నష్టాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అక్టోబరు 8న సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయి 96.88 వద్ద ముగిసిన డాలర్-రూపాయి మారకం విలువ.. గత 7 వారాల్లో దాదాపు 5ు పెరిగింది. విదేశీ పెట్టుబడుల దన్నుతో మున్ముందు రూపాయి మరింత బలపడే అవకాశం ఉందని, 91.95-92.55 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అన్నారు.

రూ.7,000 తగ్గిన వెండి
సరికొత్త ఏడాది కనిష్ఠానికి ధర
దేశీయంగా విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. వెండి సరికొత్త ఏడాది కనిష్ఠ స్థాయికి దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ ఏకంగా రూ.7,000 తగ్గి రూ.1.50 లక్షలకు జారుకుంది. 2025 అక్టోబరు 3 నాటి కనిష్ఠ స్థాయిది. కాగా, 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.800 తగ్గుదలతో రూ.1.26 లక్షలకు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గడంతోపాటు రూపాయి బలోపేతం ఇందుకు దోహదపడిందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్