ప్రైవేట్ బ్యాంకులు పడేశాయ్..
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:00 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. ఒక దశలో 1,020 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్..
సెన్సెక్స్ 876 పాయింట్లు పతనం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. ఒక దశలో 1,020 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. చివరికి 876.37 పాయింట్ల (1.17 శాతం) నష్టంతో 73,852.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257.20 పాయింట్లు (1.11 శాతం) కోల్పోయి 22,888.95 వద్ద ముగిసింది. గతవారాంతంలో విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. దాంతో ఆ బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడం మార్కెట్ క్షణతకు ప్రధాన కారణమైంది. ఐటీ షేర్లలోనూ అమ్మకాలు, చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రేడింగ్ ట్రెండ్ మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. అమ్మకాల హోరులో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4.69 లక్షల కోట్లు తగ్గి రూ.467.93 లక్షల కోట్లకు (4.94 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
వచ్చేనెల 8న ముహూరత్ ట్రేడింగ్ : వచ్చేనెల 8న(ఆదివారం) దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజ్లు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఈ ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై 3.30 గంటల వరకు (గంట పది నిమిషాల పాటు) కొనసాగుతుందని స్టాక్ ఎక్స్ఛేంజ్లు వెల్లడించాయి. 2.05 గంటల నుంచి 2.20 గంటల వరకు (15 నిమిషాలు) ప్రీ-ఓపెనింగ్ సెషన్ జరుగుతుంది. దీపావళి నుంచి హిందూ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే