సెబీకి మరిన్ని అధికారాలు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్!
ABN , Publish Date - Jun 11 , 2026 | 08:05 PM
భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంక్షోభాలను ముందే ఊహించి, వాటిని అడ్డుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 11: భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంక్షోభాలను ముందే ఊహించి, వాటిని అడ్డుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన 'సెబీ' (SEBI - Securities and Exchange Board of India) కి మరిన్ని పటిష్టమైన అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ఆర్థిక స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. నియమ నిబంధనల ఆధారంగా నడిచే వ్యవస్థ ద్వారా మాత్రమే సెబీ జవాబుదారీతనాన్ని పెంచవచ్చని కమిటీ అభిప్రాయపడింది.
గత డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 'సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ 2025' బిల్లుపై ఆర్థిక కమిటీ చైర్మన్ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో ఇవాళ న్యూఢిల్లీలో కీలక సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1992లో సెబీ చట్టం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భారత సెక్యూరిటీల మార్కెట్ ఎంతో అభివృద్ధి చెందిందని, అదే సమయంలో కొత్త రకమైన సవాళ్లు కూడా తెరపైకి వస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి వర్గాల నుంచి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో, సామాన్య పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడానికి, వ్యవస్థను మరింత ఇన్వెస్టర్-ఫ్రెండ్లీగా మార్చడానికి అత్యంత పటిష్టమైన చట్టం అవసరమని కమిటీ నొక్కిచెప్పింది.
ప్రస్తుతం మార్కెట్‌ను నియంత్రిస్తున్న మూడు ప్రధాన చట్టాలైన సెబీ చట్టం (1992), డిపాజిటరీల చట్టం (1996), సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) చట్టం (1956)లను విలీనం చేసి ఈ ఏకీకృత 'సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్'ను తీసుకువస్తున్నారు. సెబీ తీసుకునే నిర్ణయాలు వ్యక్తుల ఇష్టాయిష్టాలపై కాకుండా పూర్తిగా పారదర్శకమైన నిబంధనల ఆధారంగా ఉండేలా చట్టాన్ని రూపకల్పన చేస్తున్నారు. సెబీ నియంత్రణ సామర్థ్యాన్ని పెంచడానికి దాని బోర్డు సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 9 నుంచి గరిష్ఠంగా 15 మందికి పెంచాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
బోర్డు సభ్యులకు మార్కెట్ వ్యవహారాల్లో ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రయోజనాలు (కుటుంబ సభ్యులతో సహా) ఉన్నా వాటిని ముందే వెల్లడించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలలో వారు నిర్ణయాత్మక ప్రక్రియల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు (Ease of Doing Business), చిన్నపాటి సాంకేతిక, విధానపరమైన లోపాలను నేరాలుగా పరిగణించకుండా, వాటిని సివిల్ పెనాల్టీలుగా మార్చనున్నారు. పెట్టుబడిదారుల ఫిర్యాదులను త్వరితగతిన, సమయపాలనతో పరిష్కరించేందుకు ప్రత్యేక ఒంబుడ్స్‌మన్ (Ombudsperson) యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
త్వరలోనే పార్లమెంట్‌కు నివేదిక
ఈ బిల్లుపై వివిధ రంగాల నుంచి కమిటీకి దాదాపు 1,055 సూచనలు అందాయి. వాటన్నింటినీ ప్రభుత్వం పరిశీలనకు పంపారు. ఆర్థిక వ్యవహారాల శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా చర్చలు జరుపుతోంది. రాబోయే వర్షాకాల సమావేశాల (Monsoon Session) మొదటి వారంలోనే ఈ తుది నివేదికను పార్లమెంట్‌కు సమర్పించనున్నట్లు కమిటీ చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..