ఆర్‌బీఐ, జీడీపీ గణాంకాలే కీలకం
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:59 AM
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు వారాల విజయయాత్రకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు బ్రేక్ వేశాయి. లాభాల స్వీకరణ, విదేశీ సంస్థాగత నిధుల ఒత్తిడితో వారాంతంలో నిఫ్టీ...
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు వారాల విజయయాత్రకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు బ్రేక్ వేశాయి. లాభాల స్వీకరణ, విదేశీ సంస్థాగత నిధుల ఒత్తిడితో వారాంతంలో నిఫ్టీ 25,607 స్థాయికి చేరుకోగా సెన్సెక్స్ 83,339 పాయింట్ల వద్ద నష్టాలతో ముగిసింది. ఈ వారం క్యూ2 జీడీపీ గణాంకాలు, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ఒపెక్ ప్లస్ చమురు ఉత్పత్తి నిర్ణయాలు మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. ప్రధానంగా ముడి చమురు ధరల గమనం మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించే అవకాశం కనిపిస్తోంది. టెక్నికల్‌గా ఈ వారం నిఫ్టీకి 25,500 వద్ద తక్షణ మద్దతు ఉంది. మదుపరులు దూకుడు తగ్గించి.. అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. డిఫెన్స్, ఫార్మా, ఎంపిక చేసిన ఐటీ రంగాలపై దృష్టి సారించి దశల వారీగా నాణ్యమైన షేర్లను పోర్టుఫోలియోలో చేర్చుకోవటం శ్రేయస్కరం.
స్టాక్ రికమండేషన్స్
స్టెరిలైట్ టెక్నాలజీస్: ఈ ఏడాది ఆరంభం నుంచి బుల్‌రన్‌ను కొనసాగించిన ఈ కౌంటర్ అక్టోబరులో జీవితకాల గరిష్ఠాన్ని చేరాక దిద్దుబాటుకు లోనైంది. దాదాపు 46 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫండమెంటల్స్ బలంగా ఉండటం సానుకూల అంశం. గత శుక్రవారం రూ.618 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.600 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.720 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.580 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఇంజనీర్స్ ఇండియా: స్వల్పకాలంలో ఒడుదొడుకులకు లోనవుతున్నప్పటికీ ఈ షేరు మీడియం టర్మ్‌లో బుల్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్దకు వచ్చిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ పర్వాలేదు. గత శుక్రవారం రూ.300 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.290 స్థాయిలో ఎంటరై రూ.355 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.280 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మ్యాక్ పవర్ సీఎన్‌సీ: జూన్ నుంచి ఇప్పటి వరకు 140 శాతం మేర రాబడిని అందించిన ఈ షేరు ప్రస్తుతం పుల్‌బ్యాక్‌కు లోనైంది. అయితే ట్రెండ్‌లైన్ సపోర్ట్ దొరకటంతో మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. త్రైమాసిక ఫలితాలు, రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉండటం సానుకూల అంశం. గత శుక్రవారం రూ.2,082 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,050 శ్రేణిలో ఎంటరై రూ.2,450 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,010 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
అపోలో మైక్రోసిస్టమ్స్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై ఆరంభానికి ఈ షేరు దాదాపు 150 శాతం మేర పెరిగింది. బేస్ బ్రేకౌట్ తర్వాత కన్సాలిడేషన్ కొనసాగుతోంది. స్వల్పకాల మూవింగ్ యావరేజీల వద్ద మద్దతు తీసుకోవటంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.435 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.430 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.475 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.420 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఏజిస్ లాజిస్టిక్స్: ఈ ఏడాది మార్చి నుంచి ఈ షేరు ఏకంగా 150ుమేర రాబడిని అందించింది. గత త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు, రిలేటివ్ స్ట్రెంత్, డెలివరీ వాల్యూమ్ వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఒక్కసారిగా టవర్ ఆకారంలో ఎగిసిన ఈ షేరు జూలై నుంచి గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతోంది. 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు లభించటం గమనార్హం. గత శుక్రవారం రూ.1,297 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,280 శ్రేణిలో ప్రవేశించి రూ.1,400 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,250 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలూ చదవండి
బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం
మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత