కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ లాభాలతో ప్రారంభించిన భారత స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 09:28 AM
భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ గ్యాప్ అప్ తో మొదలై ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేశాయి.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 1: భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ గ్యాప్ అప్ తో మొదలై ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో మార్కెట్లో కొత్త ఊపు సంతరించుకుంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఉత్సాహంతో మార్కెట్లు భారీ 'గ్యాప్ అప్' ఓపెనింగ్ ఇచ్చాయి.
ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే నిఫ్టీ ఏకంగా 22,899.00 వద్దకు చేరింది. నిన్నటి ముగింపు (22,331.40) నుంచి చూస్తే ఇది చాలా పెద్ద జంప్. ఉదయం 9:15 గంటల సమయానికి నిఫ్టీ 507.80 పాయింట్లు (+2.27%) లాభపడి 22,839.20 వద్ద ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్ 73,762.43 వద్ద ఓపెన్ అయ్యి, ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1,695.88 పాయింట్ల (+2.36%) భారీ లాభంతో 73,643.42 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సెన్సెక్స్ సూచీ 73,847.08 స్థాయిని తాకింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎనర్జీ రంగాల షేర్లు భారీ కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి.
నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లలో నూతనోత్సాహం కనిపిస్తోంది. కొత్త బడ్జెట్ కేటాయింపులు, కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రావడం కార్పొరేట్ రంగానికి సానుకూలంగా మారుతుందన్న అంచనాలు మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు:
అంతర్జాతీయ మార్కెట్లు, ముఖ్యంగా అమెరికా, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ముగియడం మన దేశీ మార్కెట్లపై ప్రభావం చూపింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) మళ్లీ భారత మార్కెట్ వైపు మొగ్గు చూపడం ఈ ర్యాలీకి ప్రధాన బలంగా నిలిచింది.
స్థిరమైన ఆర్థిక సంకేతాలు:
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చకపోవడం, దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న సంకేతాలు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చాయి. దీనికి తోడు కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు (Q4 Results) బాగుంటాయన్న అంచనాలు కొనుగోళ్లకు ఊతమిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక