లాభాల ధమాకా
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:41 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒక దశలో 2,168.63 పాయింట్లు ఎగబాకి 79,470.03 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది...
తారాజువ్వల్లా దూసుకుపోయిన సూచీలు
సెన్సెక్స్ 2009 పాయింట్ల లాభంతో 79,310 వద్ద ముగింపు
24,500 ఎగువకి నిఫ్టీ
ఒక్కరోజే రూ.8.17 లక్షల కోట్ల లాభం
రూ.500 లక్షల కోట్లు దాటిన మార్కెట్ మొత్తం సంపద
ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు రూ.15,000 కోట్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒక దశలో 2,168.63 పాయింట్లు ఎగబాకి 79,470.03 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 2,008.61 పాయింట్లు (2.60ు) లాభంతో 79,310.01 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 576 పాయింట్ల (2.40ు) వృద్ధితో మూడు నెలల గరిష్ఠ స్థాయి 24,536.60 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.8.17 లక్షల కోట్లు పెరిగి రూ.501.61 లక్షల కోట్లకు (5.31 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్ల విజయంతో ట్రంప్ వాణిజ్య సుంకాల విషయంలో మెత్తబడవచ్చన్న ఆశలతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు పరిష్కారం లభించవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి తగ్గడం ఈక్విటీ మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) కొత్త పెట్టుబడులు, అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం, యూఎస్ బాండ్ల రేట్ల తగ్గుముఖం, డాలర్ బలహీనత వంటి అంశాలు దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచాయి.
బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 1.79 శాతం వృద్ధి చెందగా.. స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగింది. రంగాల వారీ సూచీల్లో ఆటో అత్యధికంగా 4.13 శాతం లాభపడగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, పీఎ్‌సయూ బ్యాంక్, మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా పెరిగాయి.
బీఎ్‌సఈలో మొత్తం 4,647 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 2,993 లాభపడ్డాయి. అందులో 133 సంస్థల షేర్లు సరికొత్త ఏడాది గరిష్ఠానికి ఎగబాకాయి.
ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.14,974.68 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.10,444.54 కోట్ల నికర విక్రయాలు జరిపారు. గడిచిన ఏడాదికి పైగా కాలంలో ఎఫ్‌ఐఐలకు ఇదే అత్యధిక ఒక్కరోజు కొనుగోళ్లు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి రూ.94.41 వద్ద ముగిసింది. చమురు ధర తగ్గుదల, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల జోరు ఇందుకు తోడ్పడింది.
అమెరికా మార్కెట్లు ఢమాల్
5 శాతం పతనమైన నాస్‌డాక్
ఏఐ, టెక్నాలజీ షేర్ల భారీ క్షీణతే కారణం
డెమోక్రాట్ల ఘన విజయంతో బుధవారం భారీగా పుంజుకున్న అమెరికా స్టాక్ మార్కెట్లు మరుసటి రోజే పతనమయ్యాయి. గురువారం డోజోన్స్ ఒక దశలో 1,700 పాయింట్లకు పైగా క్షీణించగా.. నాస్‌డాక్ ఏకం గా 5.4ు పతనమైంది. దీంతో గత సెషన్ లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. డెమోక్రాట్ల విజయంతో ఏఐ, డేటా సెంటర్లకు కఠిన నిబంధనలు అమల్లోకి రావచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు టెక్నాలజీ రంగ షేర్లలో అమ్మకాలను పోటెత్తించడం ఇందుకు కారణం. ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియాతో పాటు బ్రాడ్‌కామ్ షేర్లు 9ు చొప్పున నష్టపోగా.. క్వాల్‌కామ్ 13ు క్షీణించింది. ట్రంప్ ప్రధాన మద్దతు దారుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ షేర్లు 10ు చొప్పున తగ్గాయి. అమెరికా మార్కెట్ల సంకేతాలతో భారత సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీ నష్టాల్లో సాగేఅవకాశాలున్నాయి.
ఈక్విటీ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు దీపావళి బొనాంజా పంచాయి. కొనుగోళ్ల ధమాకాతో గురువారం దలాల్ స్ట్రీట్ హోరెత్తిపోయింది. సూచీలు తారాజువ్వల్లా పైకి దూసుకెళ్లాయి. దాంతో మదుపరుల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలు మతాబుల్లా లాభాల వెలుగులు జిమ్మాయి. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి పార్టీకి చెందిన డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. ఈ షాక్‌తో ట్రంప్ ఆర్థిక, రాజకీయ విధానాల్లో కాస్త మెత్తబడవచ్చని.. ఆయన విధానాల కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇక తగ్గుముఖం పట్టవచ్చన్న ఆశాభావం అమెరికా సహా ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి దోహదపడింది.
6 రోజుల్లో రూ.29 లక్షల కోట్ల లాభం
స్టాక్ మార్కెట్ సూచీలు లాభపడటం వరుసగా ఆరో రోజు ఇది. ఈ 6 సెషన్లలో సెన్సెక్స్ 6,063.98 పాయింట్లు (8.27ు) పుంజుకోగా..నిఫ్టీ 1,837.75 పాయింట్లు (8ు) బలపడింది. దీంతో ఈక్విటీ మార్కెట్ వర్గాల సంపదలో ఏకంగా రూ.28.98 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది.
ఈ వార్తలూ చదవండి
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం